మున్సిపల్ వార్ కు సర్వం సిద్ధం..

రేపు (22న)జరగనున్న మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు చేసింది ఎన్నికల సంఘం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. దీంతో  సిబ్బందికి శిక్షణతో పాటు  సామాగ్రిని పంపిణీ చేస్తున్నారు. 25న ఫలితాలు ప్రకటించనున్నారు. రాష్ట్రంలోని 120 మున్సిపాల్టీల్లో 2 వేల 727 వార్డులున్నాయి. వీటిలో 80 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరోవైపు 9 కార్పొరేషన్లలో 325 డివిజన్లుండగా 3 డివిజన్లు ఏకగ్రీవమయ్యాయి. మున్సిపాల్టీల్లో 12 వేల 898 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో టీఆర్ఎస్ నుంచి 2 వేల 972 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా…. కాంగ్రెస్ నుంచి 2 వేల 616, బీజేపీ నుంచి 2 వేల 313, సీపీఐ నుంచి 177, సీపీఎం 166, ఎంఐఎం 276,  టీడీపీ 347, స్వతంత్రులు 3వేల 750 మంది పోటీ చేస్తున్నారు.

మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో కలిపి 53 లక్షల 36 వేల 605 మంది ఓటర్లున్నారు. వీరిలో పురుషులు 26 లక్షల 71వేల 694 మంది ఉండగా.. మహిళలు 26 లక్షల 64వేల 557 మంది, ఇతరులు 354 మంది ఉన్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 6లక్షల 40 వేల మంది ఓటర్లుండగా.. అత్యల్పంగా జనగామ జిల్లాలో 39వేల 729 మంది ఓటర్లున్నారు.

ఎన్నికలు జరిగే 9 కార్పొరేషన్లలోని 322 డివిజన్లకు 1773 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఎలక్షన్స్ జరిగే 120 మున్సిపాలిటీల్లోని 2 వేల 647 వార్డులకు  6188 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 2 వేల 355 పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించనున్నారు. మిగిలిన చోట్ల పోలింగ్ ప్రక్రియను వీడియో రికార్డింగ్ చేయనున్నారు. వెయ్యి 112 కేంద్రాల దగ్గర మైక్రో అబ్జర్వర్లు పోలింగ్ ను పర్యవేక్షించనున్నారు. 25 వేల మందితో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.

 

Latest Updates