రూ.1500 సరిపోవు. పేద, మధ్యతరగతి కుటుంబాల‌కు రూ.5,000 ఇవ్వాలి

లాక్ డౌన్ నేప‌థ్యంలో రాష్ట్ర‌‌ ప్రభుత్వం పేదలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని రూ. 5 వేలకు పెంచాలని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. హైదరాబాద్ బి.ఆర్.కె. భవన్‌లో సీఎస్ సోమేష్ కుమార్‌తో అఖిలపక్ష నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. 40 రోజుల లాక్ డౌన్ పీరియ‌డ్ లో నిరుపేదలు చాలా ఇబ్బందుల‌కు గుర‌య్యార‌ని, దొడ్డుబియ్యం స్థానంలో వారంద‌రికీ సన్న బియ్యం పంపిణీ చేయాలని సీఎస్‌ను అఖిలపక్ష నేతలు కోరారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఉత్పన్నమౌతున్న సమస్యలను వివరించారు. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ, తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరామ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉత్త‌మ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు ఇస్తున్న పదిహేను వందల రూపాయలు ఏమాత్రం సరిపోవని అభిప్రాయపడ్డారు. వారికి నెలకు రూ.5 వేలు అందజేయాలన్నారు. దీపం పథకం కింద బియ్యంతో పాటు పప్పు, ఎల్పీజీ సిలిండర్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని.. దాని గురించి కూడా సీఎస్‌ను అడిగారు. వైరస్ సమయంలో చనిపోయిన కుటుంబసభ్యులను ఆదుకోవాలని కోరారు. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు అందజేయాలని డిమాండ్ చేశారు.

అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు ఉత్త‌మ్ . తరుగు పేరుతో రైతాంగాన్ని మార్కెటింగ్ అధికారులు మోసం చేస్తున్నారని దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు.వివిధ దేశాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను గుర్తించి రాష్ట్రానికి రప్పించేలా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్యపై అనుమానం ఉందని విపక్ష నేతలు పేర్కొన్నారు. ఏపీలో 80 వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు చేస్తే తెలంగాణలో 20 వేలకు మించి పరీక్షలు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. పరీక్షలు చేయకపోవడం వల్లే కరోనా పాజిటివ్ కేసులు తక్కువగా వస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

కరోనా ఖర్చు లెక్కలు వెంటనే చెప్పాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేయాలన్నారు.రాష్ట్రంలో ఉన్న ప్రస్తుత సమస్యలు పరిష్కారం చేయకపోతే గవర్నర్ ను కలుస్తామ‌ని అన్నారు. అప్పటికి సమస్యలు పరిష్కారం చేయకపోతే బి.ఆర్.కె భవన్ వద్ద ధర్నా చేస్తామని ఆయ‌న అన్నారు.

కార్డులేని అర్హులైన వారందరికీ రేషన్ ఇవ్వాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. తాలు పేరుతో రైతులను ఇబ్బంది పెడుతున్నారని, రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలన్నారు. వడగండ్ల వానతో నష్టపోయిన పంటకు పంట నష్ట పరిహారం ఇవ్వాల‌న్నారు. పిడుగు పడి చనిపోయిన వారికి రూ.10 లక్షలు ఎక్సగ్రేషియా ఇవ్వాల‌న్నారు.

కరోనా లాక్‌డౌన్‌తో ప్రజల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తెలిపారు. పేదలకు మరో రెండు నెలలు సహాయం అందించాలని కోరారు. సీఎం స‌హాయ‌నిధికి వ‌చ్చిన విరాళాల లెక్క చెప్పాల‌న్నారు.

Latest Updates