21న పంచాయతీ కార్మికుల మహాధర్నా

   ఇందిరా పార్కు దగ్గర నిరసన

    జీతాల పెంపుపై జీవో

    విడుదల చేయాలి

    ప్రభుత్వమే జీతాలు ఇవ్వాలి

    లేకుంటే సమ్మెకు దిగుతాం

    పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ అల్టిమేటం

పంచాయతీ కార్మికుల జీతాలపై జీవోలు విడుదల చేయాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 21న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా చేపడుతున్నట్టు పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ ప్రకటించింది. సీఎం కేసీఆర్​ హామీ మేరకు రూ.8,500 వేతనాలపై జీవో ఇవ్వడంతోపాటు ప్రభుత్వమే జీతాలు చెల్లించాలని కోరింది. లేకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించింది. 21న సమావేశంలో సమ్మె తేదీని ప్రకటిస్తామని తెలిపింది. బుధవారం హైదరాబాద్​లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పంచాయతీ కార్మికులు,ఉద్యోగుల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడారు. అర్హులైన కారోబార్, బిల్ కలెక్టర్లకు గ్రేడ్- 4 పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామజ్యోతి, హరితహారం, యాక్షన్ ప్లాన్ సమయాల్లోనే కార్మికులు గుర్తుకొస్తారని విమర్శించారు.

పెండింగ్​ జీతాలు విడుదల చేయాలి

పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ఎన్నో ఆందోళనలు చేశామని, ప్రగతి భవన్ ను ముట్టడించామని ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు పాలడుగు భాస్కర్  చెప్పారు. ఈ నెల 9న కలెక్టరేట్ల ముట్టడి సందర్భంగా చాలా మంది కార్మికులను అన్యాయంగా అరెస్టు చేశారని, నిర్భందించారని మండిపడ్డారు. ఉద్యమ పార్టీగా చెప్పుకునే టీఆర్ఎస్ సర్కారు ఉద్యమాలను అణిచి వేయడం సరికాదన్నారు.
కేటగిరీలుగా విభజించాలి..

ఇప్పటికే 2015లో, 2018లో సమ్మె చేశామని, ఇప్పుడు మూడోసారి పోరాటం ప్రారంభిస్తున్నామని ఐఎఫ్ టీయూ నేత సూర్యం చెప్పారు. పంచాయతీల్లో లైన్ మన్లు, కారోబార్లు, వాటర్ మన్లు ఇలా అందరినీ సీఎం పారిశుధ్య కార్మికులుగా గుర్తించడం సరికాదన్నారు. కేటగిరీల వారీగా విభజించి జీతాలపై ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ప్రభుత్వం కార్మికుల చేత ఆరేళ్లుగా గొడ్డు చాకిరీ చేయించుకుంటోందని ఏఐటీయుసీ నేత జయచంద్ర మండిపడ్డారు. 2018 ఆగస్టులో సీఎం హామీ ఇచ్చినా.. ఇంతవరకు అమలు కాలేదని గుర్తు చేశారు. సమావేశంలో సీఐటీయూ అధ్యక్షుడు గణపతిరెడ్డి, వెంకటయ్య, ఈశ్వరయ్య పాల్గొన్నారు.

Latest Updates