పంచాయతీ జోష్ : ఒక్కనెలలోనే తెగ తాగేశారు

వెలుగు : అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పంచాయతీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. పల్లెపోరులో గెలుపే అంతిమ ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ఎన్నికల ఖర్చుకు పెట్టిన డబ్బులో ఎక్కువ భాగం మద్యానికే వెచ్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మద్యం అమ్మకాలపైన ఉక్కుపాదం మోపిన పోలీస్, ఎక్సైజ్ శాఖలు పంచాయతీ ఎన్నికలకు వచ్చేసరికి నిబంధనలు సడలించారు.మూడు నెలల్లో వచ్చినంత ఒక నెలలోనే.. అసెంబ్లీ ఎన్ని కల్లో మూడు నెలలో వచ్చినంత ఆదాయం పంచాయతీ ఎన్నికల్లో ఒక నెలలోనే ఎక్సైజ్ శాఖకు వచ్చింది.

అసెంబ్లీ ఎన్నికలు జరిగిన మూడు నెలల్లో (సెప్టెంబర్ 1 నుంచి​ డిసెంబర్ 11 వరకు ) ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖకు సమకూరిన అదనపు ఆదాయం రూ.92.12 కోట్లయితే, పంచాయతీ ఎన్నికలు జరిగిన జనవరిలోనే ఎక్సైజ్ శాఖకు సమకూరిన ఆదాయం రూ.89.73 కోట్లు. మూడు నెలలతో పోలిస్తే ఒక్క నెలలో జరిగిన మద్యం అమ్మకాల ద్వారానే ఎక్సైజ్ శాఖ కు రూ.89 కోట్లు రావడం విశేషం.  ఎన్నికలకు తోడు సంక్రాంతి..నల్గొండ జిల్లాలో మూడు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో డబ్బు , మద్యం సీసాలనే అభ్యర్థులు ఓటర్లకు ఎరగా వేశారు. జనవరి 7 నుంచి మొదటి విడత ఎన్నికల షెడ్యూల్ ప్రారంభం కాగా, సంక్రాంతి పండుగ కూడా కలిసిరావడంతో మద్యం వ్యాపారులకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. పంచాయతీ ఎన్నికలనే అదనుగా చూసుకున్న వ్యాపారులు సైతం మద్యం ఎమ్మార్పీకు మించి విక్రయాలు చేయడంతో వారికి మరింత కలిసొచ్చింది. రూ.234.13 కోట్ల అమ్మకాలు.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు 276, బార్లు 36 ఉన్నాయి. వీటిల్లో గతేడాది జనవరి 1 నుంచి 31 వరకు జరిగిన మద్యం అమ్మకాల్లో లిక్కర్​ 2,44,999 పెట్టెలు అమ్ముడుకాగా, బీర్లు 3,88,819 పెట్టెలు అమ్ముడయ్యాయి. ఈ ఏడాది అదే రోజుల్లో లిక్కర్​ 3,76,175 పెట్టెలు అమ్ముడు కాగా, బీర్లు 5,79,704 పెట్టెలు అమ్ముడయ్యాయి.

ఈ అమ్మకాల ద్వారా గతేడాది ఎక్సైజ్ శాఖకు వచ్చిన ఆదాయం రూ.144.40 కోట్లు కాగా, ఈ ఏడాది రూ.234.13 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే గతేడాదితో పోలిస్తే పంచాయతీ ఎన్నికల వల్ల ఎక్సైజ్ శాఖకు సమకూరిన అదనపు ఆదాయం రూ.89.73 కోట్లు. నల్గొండ జిల్లాలోనే అత్యధికం… అసెంబ్లీ ఎన్ని కల్లో మద్యం అమ్మకాల పైన కట్టుదిట్టమైన ఆంక్షలు విధించడంతో నల్లగొండ జిల్లాలో మద్యం అమ్మకాలు పడిపోయాయి. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలతో పోలిస్తే నల్లగొండ జిల్లా పోలీస్,ఎక్సైజ్ శాఖలు రూల్స్​ పకడ్బందీగా అమలు చే యడం ఆ ప్రభావం మద్యం అమ్మకాల పైన పడింది. దీంతో ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు పంచాయతీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, మద్యం అమ్మకాలకు తలుపులు తెరిచారు. దీంతో ఏకంగా నల్గొండ జిల్లాలో రూ.111.07 కోట్ల అమ్మకాలు జరిగాయి. అదే సూర్యాపేట జిల్లాలో అయితే రూ.67.05 కోట్లు, యాదాద్రి జిల్లాలో రూ.56 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో కలిపి ఎక్సైజ్ శాఖకు అదనంగా సమకూరిన ఆదాయం రూ.45 కోట్లు కాగా, ఒక్క నల్గొండ జిల్లా నుంచే అదనంగా రూ.44.08 కోట్ల ఆదాయం వచ్చింది.

.

Latest Updates