భారత్ మాతాకీ జై : అమర జవాన్లకు తెలంగాణ నివాళులు

ఉగ్రదాడిలో చనిపోయిన జవాన్లకు మద్దతుగా ర్యాలీలు చేస్తున్నారు ప్రజలు. అమరులైన జవాన్లకు కొవ్వొత్తుల ర్యాలీలు జరిపి.. నివాళి అర్పిస్తున్నారు. కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో.. సీఐ వెంకటేశ్వర్లు, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ జరిపారు. ఎన్టీఆర్ చౌరాస్తా నుంచి రాజీవ్ చౌక్ వరకు ర్యాలీ చేసి నివాళులు అర్పించారు.

జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ఆదిలాబాద్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు యువకులు. పాకిస్తాన్ జెండా, ఉగ్రవాదుల దిష్టి బొమ్మల్ని దహనం చేశారు. అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల పిరికి పంద చర్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. భారతమతాకి జై అంటూ నినాదాలు చేశారు.

నిర్మల్ జిల్లా బాసరలో.. వివేకానంద యూత్ సభ్యులు, బాసర ఆర్జీయూకేటీ వర్సిటీ విద్యార్థులు అమర జవాన్లకు మద్దతుగా క్యాండిల్ ర్యాలీ జరిపారు. భారీ ర్యాలీ చేసి.. చనిపోయిన అమరులకు శాంతి చేకూరాలని.. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని కోరారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో ఉగ్రవాదుల దిష్టిబొమ్మం దగ్దం చేశారు. జవాన్లపై దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించారు స్థానికులు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాష్ట్ర మైనార్టీ రెసిడెన్సియల్ విద్యాసంస్థల స్టూడెంట్స్ నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగులు, విద్యార్థులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. మరోవైపు శ్రీ విద్యానికేతన్ విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి అమర జవాన్లకు నివాళి అర్పించారు.

సైనికులు మృతికి కారణమైన పాకిస్థాన్ పై కేంద్రం కఠినంగా వ్యవహరించాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. చనిపోయిన సైనికులకు సంతాపం తెలుపుతూ మంచిర్యాలలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గర పాకిస్థాన్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. పాకిస్థాన్ కి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం జగ్గసాగర్ లో యువజన సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత గ్రామ పంచాయతీ ముందు మౌనం పాటించారు. విద్యార్థులు మానవహారంగా ఏర్పడి జావాన్లకు మద్దతు తెలిపారు. మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో యువకులు పాకిస్థాన్ దిష్టిబొమ్మకు పాడే కట్టి గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. డప్పు చప్పుళ్ళతో ప్రధాన విధుల్లో తిరుగుతూ పాకిస్థాన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో అమర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని అశ్వారావుపేట విద్యాశాఖ ఆధ్వర్యంలో 100 మీటర్ల జాతీయ పతాకంతో భారీ ర్యాలీ చేశారు. ర్యాలీలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. అశ్వరావుపేట రింగ్ రోడ్డు దగ్గర వీర జవాన్లకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి  ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, పోలీస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరై  వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.

వరంగల్ లో కాకతీయ వర్శిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ విద్యార్థులు భారీ రాలీ నిర్వహించారు.  హన్మకొండలోని ఆర్ట్ కాలేజీ నుంచి జాతీయ జెండాలతో విద్యార్థులు, ఫ్యాకల్టీ కలిసి ర్యాలీ చేశారు. ఉగ్రవాదులకు, పాకిస్థాన్ కు వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. అథాలత్ సెంటర్ లోని అమరవీరు స్థూపం వరకు ర్యాలీ చేసి అక్కడ మానవహారం నిర్వహించారు విద్యార్థులు.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఉగ్రదాడికి నిరసనగా.. ఉపాధ్యాయులు, ఉద్యోగ సంఘాలు, పోలీసులు కలిసి క్యాండిల్ ర్యాలీ జరిపారు. అమరులైన జవాన్ల ఫ్లెక్సీలతో ర్యాలీ చేసి నివాళులు అర్పించారు. గాయపడిన జవాన్లు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రదాడికి భారత్ దీటైన సమాధానం చెప్పాలని కేంద్రాన్ని కోరారు.

కల్వకుర్తి బస్టాండ్ నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీ జరిపారు స్థానికులు, మాజీ సైనికులు. ముష్కరదాడిలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. అమరుల కుటుంబాలకు దేశమంతా అండగా నిలుస్తుందన్నారు.

Latest Updates