మిస్సింగ్ కేసులపై తప్పుడు ప్రచారం చేస్తే కేసులు

రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన మిస్సింగ్ కేసులపై రాచకొండ పోలీసులు ప్రకటన చేశారు. మిస్సింగ్ కేసుల గురించి ప్రజలలో భయాందోళనలు కలిగించే విధంగా సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టినా, అటువంటి వాటిని షేర్ / లైక్  చేసినా కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటామని రాచకొండ పోలీసులు హెచ్చరించారు.

మిస్సింగ్ కేసుల పట్ల ఎవరైనా తప్పుడు ప్రచారం చేసినా… తప్పుడు సమాచారం ఇచ్చినా… వారి పైన చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.

మహిళలు, పిల్లలు, పెద్దలు తప్పిపోతున్నారంటూ అసత్య ప్రచారం విస్తృతంగా వ్యాపిస్తోందని.. ఇందులో వాస్తవం లేదని రాష్ట్ర పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు నమోదైన మిస్సింగ్ కేసుల్లో చాలావరకు.. కుటుంబం, ప్రేమ వ్యవహారం, పరీక్షలు ఫెయిలవ్వడం లాంటివే ఎక్కువ ఉన్నాయన్నారు. వివిధ కారణాల వల్ల కుటుంబాలను విడిచిపెట్టి వెళ్లిన మహిళలు, పురుషులు… తల్లిదండ్రులపై అలిగి వెళ్లిపోయిన పిల్లలు .. పిల్లల సంరక్షణ దొరకని తల్లిదండ్రులు.. ఇలాంటి కారణాలతో నమోదైన కేసులు ఎక్కువగా ఉన్నాయన్నారు పోలీసులు.

వీటిలో 85శాతం కేసులు ట్రేస్ చేసినట్టు చెప్పారు పోలీసులు. అన్ని వర్గాల ప్రజల భద్రతకు కట్టుబడి ఉన్నామన్నారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా పుకార్లను సోషల్ మీడియాలో వ్యాపింపచేయొద్దని విజ్ఞప్తి చేశారు.

Latest Updates