మహిళలను ఎలా గౌరవించాలి : ఆన్ లైన్ కోర్స్ లను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

వెటర్నరీ డాక్టర్ దిశ తరహా ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా ఉండేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుంది.గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో జులాయిగా తిరుగుతున్న యువకుల్ని గుర్తించి వారికి కౌన్సెలింగ్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలకు చెందిన ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారుల సమన్వయంతో యువతను గుర్తించేందుకు కసరత్తు చేస్తున్నారు.

మహిళలు, సమాజం పట్ల బాధ్యతగా ఎలా వ్యవహరించాలనే అంశంపై విద్యాశాఖ ప్రభుత్వ, ప్రైవేట్  హై స్కూల్ స్థాయి విద్యార్ధుల వరకు ఆన్ లైన్ లో కోర్స్ లు నేర్పించనున్నారు.

నిర్భయలాంటి చట్టాలు మహిళలపై హత్యాచారాలు పెరుగుతున్నట్లు చెబుతున్న గణాంకాలపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. మహిళలపై జరుగుతున్న దారుణాల్ని అరికట్టేందుకు కుటుంబసభ్యులు, సమాజం కృషి చేయాలన్నారు. దీంతో పాటు ప్రభుత్వం మహిళల భద్రత కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని..రాష్ట్రంలో మహిళలు భయాందోళనకు గురవుతున్న ప్రదేశాలు ఏంటో అధికారులకు చెప్పాలని షీటీమ్ చీఫ్ స్వాతీ లక్రా అన్నారు.

త్వరలో సాధ్యసాధ్యాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా షీటీమ్ లు పనిచేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామన్నారు స్వాతిలక్రా.

Latest Updates