పోలీస్ వాహనం.. ‘108’ అయ్యింది

జనగామ అర్బన్, కాజీపేట,  వెలుగు:  పోలీస్ వాహనాలు ఆపద కాలంలో ఆస్పత్రికి తరలించే ‘108’ అంబులెన్స్‌‌‌‌లుగా సేవలు అందిస్తున్నాయి.  లాక్డౌన్తో రవాణా సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న పేషెంట్లను హాస్పిటళ్లకు తరలించి పోలీసులు ఔదార్యం చాటుతున్నారు. జనగామ జిల్లా కేంద్రంలోని 30వ వార్డులో రుక్సానా అనే గర్భిణిని ఆదివారం పురుటి నొప్పులతో బాధపడుతోంది.  అందుబాటులో 108 వాహనం లేకపోవడంతో స్థానికులు  పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన టౌన్  సీఐ మల్లష్ యాదవ్  పోలీస్ వాహనంలో రుక్సానాను చంపక్హిల్స్ ఎంసీహెచ్ ఆస్పత్రికి సకాలంలో తరలించారు.  గర్భిణిని ఆదుకున్న పోలీసులను పట్టణ వాసులు అభినందించారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట డీజిల్ కాలనీ చెందిన ఇస్మాయిల్ అనే ఆరు సంవత్సరాల బాలుడు ఇంట్లో ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గోడకు  గుద్దుకున్నాడు. తలకు తీవ్ర గాయం కావడంతో తండ్రి ఇబ్రహీం బాలుడిని హాస్పిటల్ కు తీసుకెళ్లడానికి వాహనం కోసం చూశాడు. లాక్ డౌన్ సందర్భంగా వాహనాలు ఏవీ అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాన్ని గమనించిన కాజీపేట  ఎస్సై కె.అశోక్ కుమార్ కాజీపేట పోలీసు వాహనంలో  బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లి  ట్రీట్మెంట్ చేయించారు.

Latest Updates