కేబినెట్ నిర్ణయంలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు:

ఆర్టీసీ రూట్లను ప్రైవేటుపరం చేస్తూ రాష్ట్ర కేబినెట్​తీసుకున్న నిర్ణయంపై జోక్యం చేసుకునేది లేదని, కేంద్రం ఇచ్చిన అధికారాలకు అనుగుణంగానే ఆ నిర్ణయం ఉందని హైకోర్టు తీర్పు చెప్పింది. 5,100 ఆర్టీసీ రూట్లను ప్రైవేటు చేసేందుకు వీలుగా కేబినెట్‌‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌‌ చేస్తూ రిటైర్డ్​ ప్రొఫెసర్‌‌ పీఎల్‌‌ విశ్వేశ్వర్‌‌రావు వేసిన పిల్‌‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డితో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం డిస్మిస్‌‌ చేసింది. ‘‘దేశంలో 1991 నుంచి సరళీకృత ఆర్థిక విధానాలు అమల్లోకి వచ్చాయి. అప్పటి నుంచి పెట్టుబడులు పెట్టేవారికి పెద్దపీట వేయడం జరుగుతోంది. ఆర్టీసీ మోనోపొలీకి బ్రేక్‌‌ వేసి దానికి సమాతరంగా ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహించాలని కేబినెట్‌‌ నిర్ణయం తీసుకుంది. మెటారు వాహన చట్టంలోని సెక్షన్ 102 కింద ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అధికారాలను కేంద్ర సర్కార్‌‌ 2019 సెప్టెంబర్‌‌ 1న రాష్ట్రాలకు ఇచ్చింది. అందుకే కేబినెట్‌‌ నిర్ణయం లీగలేనని తేల్చుతున్నాం. పిల్‌‌ను కొట్టేస్తున్నాం’’అని డివిజన్‌‌ బెంచ్‌‌ తీర్పు చెప్పింది.

రహస్య ఎజెండా ఉందనడానికి ఆధారాలు లేవు

ఆర్టీసీ సమ్మె వల్ల జనం ఎన్నో ఇబ్బందులకు గురయ్యారని, వాళ్ల కష్టాలు తీరేందుకు కేబినెట్‌‌ నిర్ణయం భవిష్యత్‌‌లో ఎంతో దోహదపడుతుందని తెలిపింది. ఆర్టీసీతోపాటు ప్రైవేటు కూడా నూతన అడుగులు వేయాల్సిన సమయం వచ్చిందని, మోనోపొలీ ఉంటే అది సాధ్యం కాదని, పోటీతత్వం ఉండాలనే ఆర్టీసీకి సమాతరంగా ప్రైవేటు రవాణా కూడా ఉండాల్సిందేనని తేల్చి చెప్పింది. కేబినెట్‌‌ నిర్ణయం వెనుక రహస్య ఎజెండాలున్నాయని, దురుద్దేశాలున్నాయని చెప్పడానికి ఆధారాలేవీ లేవని పేర్కొంది. మోటార్‌‌ వెహికల్‌‌ యాక్ట్‌‌ సెక్షన్‌‌ 67ను కేంద్రం సవరించిందని, దీంతో ఆర్టీసీలకు పేర్లల్‌‌గా ప్రైవేటు బస్సులు నడిపేందుకు రాష్ట్రాలకు అధికారం వచ్చిందని, దీని వల్ల ఆర్టీసీ పూర్తిగా లేకుండా పోతుందనే వాదన కరెక్టు కాదని, ప్రైవేటు రూట్లు 50 శాతం మించరాదని కేంద్రం చేసిన చట్ట సవరణ చెబుతోందని బెంచ్‌‌ పేర్కొంది.

పోటీ పెరిగి మేలైన సౌలత్​లు లభిస్తాయి

కేంద్ర చట్టంలోని 67, 102 కింద ఈ నిర్ణయం తీసుకునే అధికారాలు రాష్ట్రాలకు ఉన్నాయని, అందులో భాగంగానే రాష్ట్ర కేబినెట్‌‌ తీర్మానం చేసిందని, చట్టానికి అనుగుణంగానే ఈ నిర్ణయం ఉందని హైకోర్టు తేల్చింది. ఆర్టీసీకి సమాతరంగా ప్రైవేటు రవాణా ఉండటం వల్ల పోటీ పెరిగి ప్రజలకు మేలైన రవాణా సౌకర్యాల కల్పనకు బాటలు వేసినట్లు అవుతుందని చెప్పింది. ఇలాంటి చర్యల వల్ల ఇకపై బస్సులు లేకపోవడం లేదా కిటకిటలాడుతూ ఉండటం వంటి సమస్యలకు తెరదించినట్లు అవుతుందని పేర్కొంది. మెనోపొలీ లేకుండా చేయడం వల్ల ఆర్టీసీ ఏమీ లేకుండాపోదని, దానికి పోటీగా ఇతర రవాణా సర్వీసులు వస్తాయని, ఇద్దరి మధ్యా పోటీ పెరిగితే ఆదాయంతోపాటు రవాణా వ్యవస్థ కూడా అందరికీ ఎంతో మేలుగా ఉంటుందని స్పష్టం చేసింది. 5,100 రూట్లను ప్రైవేటు చేసే ప్రొసెస్‌‌కు ప్రారంభించాలని ఆర్టీసీని ఆదేశిస్తూ కేబినెట్‌‌ తీర్మానం చేయడం చట్ట నిబంధనలకు అనుగుణంగా లేదని తప్పు ఎత్తిచూపింది. ఈ చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వమే కాబట్టి ఆ ప్రతిపాదన ట్రాన్స్‌‌పోర్టు ప్రిన్సిపల్‌‌ సెక్రటరీకి చేయాలని తేల్చింది. ఇందుకు అనుగుణంగా చేస్తామని సర్కార్‌‌ తరఫున అడ్వొకేట్‌‌ జనరల్‌‌ బీఎస్‌‌ ప్రసాద్‌‌ భరోసా ఇచ్చారు కాబట్టి ఆ మేరకు రికార్డుల్లో నమోదు చేశామని, అందుకు అనుగుణంగా సర్కార్‌‌ చేయాలని తీర్పులో ఆదేశించింది.

Latest Updates