సార్ తప్పు చేస్తుండు: కేసీఆర్ పై మంత్రులు, ఎమ్మెల్యేల అసంతృప్తి

‘సార్ తప్పు చేస్తుండు. ఆర్టీసీ కార్మికులను సతాయిస్తే ఉసురు కొడ్తది. వాళ్లను పిలిచి మాట్లాడాలే. వాళ్లు ఒక అడుగు దిగినప్పుడు.. మనం ఒక అడుగు దిగితే ఆకాశమేమన్న ఊడిపడ్తదా?’.. టీఆర్ఎస్ ​సీనియర్ నాయకుడొకరి అభిప్రాయమిది.

‘అన్నా.. మా సార్ కు ఎవరు చెప్పాలె. చెప్తె వింటడా.. ఆయన అనుకున్నది చేస్తడు. మేం బయటికి పోలేకపోతున్నం. కార్మికులను చూస్తె పాపం అనిపిస్తున్నది. సార్  వాళ్లను చర్చలకు పిలవాలె’.. ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తి ఇది.

‘సమ్మెను ఇంకా సాగనీయొద్దు. ఫుల్ స్టాప్ పెట్టాలె. లేకపోతే చెడ్డ పేరొస్తది. ప్రైవేటు బస్సులకు అనుమతిచ్చినం. కొన్ని విషయాల్లో ఇగోకు పోవద్దు. ఈ విషయం సార్ కు తెలుసు. కార్మికులను ఏరి కోరి శత్రువులుగ చేసుకోవద్దు’.. ఓ మంత్రి ఫీలింగ్ ఇది..

హైదరాబాద్, వెలుగు:

ఆర్టీసీ సమ్మె మొదలైనప్పటి నుంచీ మంత్రులు, అధికార టీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు పెద్దగా బయటికి రావడం లేదు. కొన్నిచోట్ల అయితే అధికారిక కార్యక్రమాలకూ వెళ్లడం లేదు. నెలన్నర రోజులుగ సమ్మె చేస్తుండటంతో అటు కార్మికులు, ఇటు జనం తీవ్రంగా ఇబ్బందుల్లో ఉన్నారని.. తాము కనిపిస్తే నిలదీస్తుండటంతో బయటికి వెళ్లేందుకు భయంగా ఉంటోందని అంటున్నరు. దగ్గరి బంధువుల పెళ్లిళ్లు, ప్రోగ్రామ్​లకు కూడా పోలేకపోతున్నమని వాపోతున్నరు. కార్మికులు పడుతున్న అవస్థలు చూస్తే జాలేస్తోందని.. కానీ ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఉందని కొందరు ఎమ్మెల్యేలు, నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం మాట్లాడితే పెద్ద సార్​కు ఏం కోపం వస్తుందోనని, ఇంతలా ఎందుకు చేస్తున్నారోనని అంటున్నారు. సీఎం ఆర్టీసీ సమ్మెపై త్వరగా తేల్చితే బాగుంటుందని, కార్మికులు ఓ మెట్టు దిగొచ్చాక కూడా మొండిగా ఉండటం సరికాదని చెప్తున్నారు. కానీ ఎవరూ ధైర్యం చేసి బయటికి చెప్పలేకపోతున్నారు. సీఎంకు సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు మంత్రులు ఈ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించారని, ‘ఈ విషయం మీకెందుకు? ఆర్టీసీ సమ్మెపై ఏమీ మాట్లాడొద్దు’ అని సీఎం సీరియస్ గా స్పందించడంతో మౌనంగా ఉండిపోయారని టీఆర్ఎస్​ వర్గాలు చెప్తున్నాయి.

బందోబస్తుతోనే బయటికి..

ఆర్టీసీ సమ్మె మొదలైనప్పట్నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారు. కొన్నిచోట్ల అధికారిక కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. బయటికి వెళ్తే ఆర్టీసీ కార్మికులు, ప్రతిపక్షాల కార్యకర్తలు వచ్చి నిలదీస్తారనే ఆందోళన కనిపిస్తోంది. బయటికి వెళ్లాల్సి వస్తే పోలీసు బందోబస్తు మధ్య వెళ్తున్నారు. వ్యక్తిగత పనుల కోసం వెళ్లినా అదనపు సెక్యూరిటీ పెట్టుకుంటున్నారు చివరికి పెళ్లిళ్లకు హాజరుకావాలన్నా వెనుకా ముందూ ఆలోచిస్తున్నారు. ‘‘కార్తీకమాసం కావడంతో చాలా పెళ్లిళ్లు జరుగుతున్నయి. చాలా పెళ్లిళ్లకు వెళ్లాల్సి ఉండె. కానీ ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు ఎక్కడ అడ్డుకుంటారోనని భయం. సమీప బంధువులు, బాగా తెలిసినవారి ప్రోగ్రామ్​లకు అలా వెళ్లి ఇలా వస్తున్నం’’ అని ఓ ఎమ్మెల్యే చెప్పారు. మంత్రి సత్యవతి రాథోడ్  ఈ మధ్య భద్రాచలంలో ఓ అధికారిక కార్యక్రమానికి వెళ్లగా.. ఆర్టీసీ కార్మికులు ఆమెను నిలదీశారు. కరీంనగర్ లో మంత్రి గంగుల కమలాకర్ కు అదే పరిస్థితి ఎదురైంది. ఆర్టీసీ కార్మికులు మంత్రుల ఇండ్ల ముట్టడికి పిలుపు ఇచ్చినప్పుడు చాలా మంది మంత్రులు ముందు రోజే వేరే చోటికి వెళ్లిపోయారు. హైదరాబాద్ లోని మినిస్టర్స్​ క్వార్టర్స్ కు వెళ్లే రోడ్డు నం 12ను పోలీసులు ఆ రోజంతా మూసివేశారు.

సమ్మెపై ఏమీ మాట్లాడొద్దు..!

విలీనమనే ప్రధాన డిమాండ్ పై కార్మికులు వెనక్కి తగ్గిన తర్వాత.. ప్రగతిభవన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ మంత్రి సమ్మె అంశాన్ని సీఎం కేసీఆర్ వద్ద ప్రస్తావించారని తెలిసింది. కానీ సీఎం సీరియస్ గా స్పందించినట్టు సమాచారం. ‘‘ఆర్టీసీ విషయం నాకు వదిలేయండి. ఏం చేయాలో నాకు తెలుసు. ఎవరూ సమ్మెపై ఏం మాట్లాడొద్దు’’ అని తీవ్ర స్వరంతో చెప్పినట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీ సమ్మె విషయంపై ఎవరు మాట్లాడినా సదరు మంత్రి మౌనంగా ఉంటున్నారు. సమ్మె విషయాన్ని తేల్చితే బాగుంటుందని ఓ ఎమ్మెల్యే ఆ మంత్రివద్ద పదే పదే ప్రస్తావించగా.. ‘అన్నా మనకెందుకే? అంతా సార్  చూసుకుంటున్నరు. మన పని మనం చేసుకోవాలె’ అని సర్దిచెప్పారని తెలిసింది.

 

 

Latest Updates