కొత్త రెవెన్యూ చట్టంలో.. టైటిల్ గ్యారంటీ లేనట్లే

హైదరాబాద్‌, వెలుగు: భూములకు కచ్చితమైన ఓనర్​షిప్‌ను నిర్ధారించే టైటిల్ గ్యారంటీని కొత్త రెవెన్యూ చట్టంలో ప్రభుత్వం పొందుపరచడం లేదని తెలిసింది. ప్రస్తుతం అమలులో ఉన్న ఆర్వోఆర్, టైటిల్‌రిజిస్ట్రేషన్ విధానాన్ని కొనసాగించేందుకే సర్కార్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. టైటిల్ గ్యారంటీనే భూవివాదాలకు శాశ్వత పరిష్కారమని భూచట్టాల నిపుణులు ఏళ్లుగా చెబుతున్నా.. అది పరిహారం, లీగల్ సమస్యలతో ముడిపడి ఉండడంతో ప్రభుత్వం విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్‌, ఇజ్రాయెల్‌, న్యూజిలాండ్‌, ఫిలిప్పీన్స్‌, రష్యా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌, అమెరికాలో అమలులో ఉన్న టైటిల్ గ్యారంటీ తరహా చట్టాలను మన దేశంలో కూడా అమలు చేయాలన్న ఆలోచన 1987 నుంచే ఉంది. దీనిపై ఉమ్మడి ఏపీలో భూభారతి ప్రాజెక్టు రూపంలో కొంతమేర కసరత్తు జరిగినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. దేశంలోనే తొలిసారిగా 2016లో రాజస్థాన్‌​ టైటిల్‌గ్యారంటీ చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ చట్టాన్ని అర్బన్​ఏరియాలోని ఇళ్ల స్థలాలకే పరిమితం చేసింది. రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు సీఎం కేసీఆర్​ ప్రకటించిన నేపథ్యంలో కంక్లూజివ్ ​టైటిల్స్, టైటిల్ ​గ్యారంటీపై మళ్లీ చర్చ మొదలైంది.

ప్రతి టైటిల్‌కు ప్రభుత్వానిదే గ్యారంటీ

ప్రభుత్వం ప్రస్తుతం జారీ చేస్తున్న ఆర్వోఆర్ ​పాస్​పుస్తకాలు, టైటిల్ రిజిస్ట్రేషన్స్​ ఏవీ కూడా భూయాజమాన్యాన్ని నిర్ణయించగలిగే అంతిమ పత్రాలు కావు. ఈ డాక్యుమెంట్‌ను ప్రభుత్వమే జారీ చేసినప్పటికీ ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు. వేరొకరు ఆ భూమి తమదేనని రుజువులతో కోర్టులను ఆశ్రయించి గెలిస్తే ఆ పత్రాలు రద్దయిపోతాయి. ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి బాధ్యత వహించదు. అందుకే వీటికి గ్యారంటీ లేదు. దీని వల్ల న్యాయంగా డబ్బులు పెట్టి భూములు కొనుగోలు చేసిన వ్యక్తులు కూడా డబుల్ ​రిజిస్ట్రేషన్‌, ఇతర వివాదాల వల్ల నష్టపోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం టైటిల్ ​గ్యారంటీ ఇచ్చినట్లయితే కొనుగోలుదారులు నష్టపోకుండా ప్రభుత్వమే బాధ్యత వహించి వారికి పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. ఇతర దేశాల్లో అమలులో ఉన్న టైటిల్ ​గ్యారంటీని కొత్త రెవెన్యూ చట్టంలో తీసుకొస్తే బాగుంటుందని ఇప్పటికే నల్సార్​ యూనివర్సిటీకి చెందిన భూచట్టాల నిపుణులు  గవర్నమెంట్‌కు సూచించినట్లు తెలిసింది.

Latest Updates