ఉద్యానవన సాగులో తెలంగాణ నెంబర్ వన్ గా నిలవాలి

కూరగాయలు, పండ్లు, పూలు తదితర తోటల సాగులో గుణాత్మక మార్పులు రావాలని… ఇందుకోసం ఉద్యానవన శాఖ సుశిక్షితం, బలోపేతం కావాలన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్ లో బుధవారం ఉద్యానవన శాఖపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో విభిన్న స్వభావాలు కలిగిన నేలలు, మంచి వర్షపాతం, వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు ఉన్నారన్నారు. ఈ సానుకూలతలను వినియోగించుకుని పండ్లు, కూరగాయలు, పూల సాగులో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలని  పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉద్యానవన శాఖను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర ఉద్యానవన పంటల సాగు విధానాన్ని రూపొందించాలని, ఏడాదిలోగా ఫలితాలు సాధించాలని సిఎం చెప్పారు. వివిధ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా నిలిచినట్లు ఉద్యానవన పంటల సాగులో కూడా అగ్రస్థానం సంపాదించాలన్నారు. భవిష్యత్తుకు బాటలు వేసుకునే దశలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యానవన పంటల విషయంలో కూడా సమగ్ర దృక్పథం ఏర్పరచరుకోవాలన్నారు.

అందేకాదు తెలంగాణ రాష్ట్రంలో విభిన్న రకాల స్వభావాలు కలిగిన నేలలున్నాయన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా 900-1500 మిల్లీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం ఉందన్నారు. వృత్తి నైపుణ్యం కలిగిన లక్షలాది రైతు కుటుంబాలున్నాయని తెలిపారు. ఇవన్నీ తోటల సాగుకు ఎంతో సానుకూలమని… ఇంత ఉండి కూడా ఇంకా వేరే రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు, పూలు,మసాల దినుసులు, నూనె గింజలను దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. ఉద్యానవన పంటల్లో తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. మన అవసరాలు తీర్చడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు, ప్రపంచంలోని వివిధ దేశాలకు ఎగుమతి చేసే విధంగా మనం ఎదగాలని తెలిపారు. ఇందుకోసం ఉద్యానవన శాఖ సమాయత్తం కావాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులను చైతన్య పరిచి… ఏ ప్రాంతంలో ఎలాంటి ఉద్యానవన పంటలు సాగు చేయగలుగుతామో నిర్ణయించి, రైతులకు అవగాహన కలిగించాలన్నారు. ఉద్యాన వన పంటల సాగులో అద్భుత ప్రగతి సాధించి దేశంలోనే నెంబర్ వన్ గా నిలవాలని సూచించారు సీఎం కేసీఆర్.

పండ్లు, కూరగాయలు, పూలు, నూనె గింజలు, మసాలా దినుసులు తదితర ఉద్యాన పంటల సాగులో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడానికి ఉద్యానవన శాఖ పూర్తి స్థాయిలో సమాయత్తం కావాలన్నారు సీఎం కేసీఆర్. ఉద్యానవన విద్య, విస్తరణ, పరిశోధన పెంపొందాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, హర్యానా లాంటి రాష్ట్రాల్లో, నెదర్లాండ్ లాంటి దేశాల్లో ఉద్యానవన పంటలు అద్భుతంగా పండిస్తున్నారని తెలిపారు. అక్కడికి వెళ్ళి సాగు పద్ధతులు, అనుభవాలు, మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలన్నారు. మంచి విధానాలను మనం అనుసరించాలన్నారు. తెలంగాణకు చెందిన ఉద్యానవన శాఖ అధికారులను బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చర్ రిసెర్చ్ కు పంపి శిక్షణ ఇప్పించాలి. అక్కడి నుంచి నిపుణులను తెలంగాణకు ఆహ్వానించి, ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించాలని సూచించారు. హార్టికల్చర్ యూనివర్సిటీలో, ఉద్యానవన శాఖలో తోటలపై పరిశోధనలు విస్తృతంగా జరపాలన్నారు. ఉద్యానవన పంటల సాగులో వస్తున్న ఆధునిక పద్ధతులు, మార్కెటింగ్ పై ఎప్పటికప్పుడు అధ్యయనం జరగాలన్నారు. ఈ శిక్షణ, అధ్యయనం ప్రక్రియ నిరంతరాయంగా సాగాలన్నారు. ఉద్యానవన తోటల సాగులో యాంత్రీకరణను ప్రోత్సహించాలన్నారు సీఎం.

రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగులో గుణాత్మకమైన మార్పు తీసుకురావడానికి సమగ్ర ఉద్యానవన పంటల విధానం తయారు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వేరే ప్రాంతాల్లో పర్యటించి, తెలంగాణకు అనుగుణమైన విధానాన్ని మూడు నెలల్లో రూపొందించాలన్నారు. ఏడాదిలోగా ఉద్యాన పంటల సాగులో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవాలన్నారు కేసీఆర్.

ఉద్యానవన శాఖను విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. మండలానికి ఒక ఉద్యానవన శాఖ అధికారిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర ఉద్యానవన శాఖలో కూడా సాగు విధానంలో వస్తున్న మార్పులను అధ్యయనం చేయడానికి, మార్కెటింగ్ పై  ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవడానికి, పంటల్లో నాణ్యత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేయడానికి సీనియర్ అధికారుల నాయకత్వంలో ప్రత్యేక విభాగాలు ఉండాలన్నారు. ఉద్యానవన శాఖకు ఇంకా ఎంత మంది ఉద్యోగులు కావాలి? శాఖను ఎలా విస్తరించాలి? అనే అంశాలపై వెంటనే ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. అవసరమైన అధికారులను, సిబ్బందిని నియమించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న అన్ని రైతు వేదికల్లో ఉద్యానవన శాఖ అధికారులు కూడా కూర్చుని రైతులతో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

రాష్ట్రంలో ఉద్యానవన పంటలను పెద్ద ఎత్తున సాగు చేయడంతో పాటు అవసరమైన మార్కెటింగ్ విషయంలో కూడా దృష్టి పెట్టాలన్నారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ ఏది అవసరమో గుర్తించి, వాటిని రైతులతో సాగు చేయించాలన్నారు. ఢిల్లీ ఆజాద్ పూర్ మార్కెట్ తరహాలో హైదరాబాద్ కొంగరకలాన్ ప్రాంతంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఉద్యానవన పంటల మార్కెట్ ను ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్.

సీఎం సమీక్ష సమావేశంలో పలువురు మంత్రులతో పాటు ఉన్నతాధికాలు పాల్గొన్నారు.

Latest Updates