తెలంగాణ వరికి అంతర్జాతీయ ఖ్యాతి

    ‘ఆర్‌‌ఎన్‌‌ఆర్‌‌–15048’పై అమెరికన్ జర్నల్ లో ఆర్టికల్

    7 రాష్ట్రాల్లో తెలంగాణ సోనా విత్తనానికి డిమాండ్

    ఇతర వరి రకాల కంటే తక్కువ గ్లూకోజ్  

    టైప్ -2 షుగర్ నూ తగ్గిస్తదని తేల్చిన ఎన్‌‌ఐఎన్‌‌, ఐసీఎంఆర్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: ఫ్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైస్ రీసెర్చ్ సెంటర్ అభివృద్ధి చేసిన తెలంగాణ సోనా (ఆర్‌‌ఎన్‌‌ఆర్‌‌-–15048) వరి రకానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. అమెరికాకు చెందిన ‘జర్నల్ ఆఫ్‌‌ ఫుడ్‌‌ అండ్‌‌ న్యూట్రీషన్‌‌’లో తెలంగాణ సోనాపై ప్రత్యేక కథనం పబ్లిష్​ అయింది.  తెలంగాణ సోనా ఉత్పత్తి, దాని విశిష్ట లక్షణాలను రీసెర్చ్ వివరాలతో సహా ఈ జర్నల్ లో ప్రచురించారు. ఈ వరి రకంతో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండే బియ్యం ఉత్పత్తి అవుతాయని, టైప్–2 డయాబెటిస్ నియంత్రణలోనూ ఈ వంగడం కీలకమని ఆర్టికల్ లో వివరించారు.

గ్లూకోజ్ శాతం51.6 మాత్రమే

తెలంగాణ సోనా వరి రకంలో గ్లూకోజ్ శాతం51.6 మాత్రమే ఉండడం ప్రత్యేకత. జొన్నలు, సజ్జలు వంటి చిరు ధాన్యాల్లో ఉండే స్థాయిలోనే ఈ వరి బియ్యంలో కార్బో హైడ్రేట్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈ బియ్యంపై ఫాస్టింగ్‌‌ బ్లడ్‌‌ గ్లూకోజ్‌‌, గ్లైకోసిలేట్‌‌ హిమోగ్లోబిన్‌‌(హెచ్‌‌బీ ఏ1సీ) టెస్ట్‌‌ల ద్వారా, ఓరల్‌‌ గ్లూకోజ్‌‌ టాలరెన్స్‌‌ టెస్ట్‌‌ల ద్వారా ఎన్ఐఎన్, ఐసీఎంఆర్ ఎనాలసిస్ చేశాయి. తద్వారా ఈ బియ్యం టైప్–2 షుగర్ ను నియంత్రిస్తుందని గుర్తించాయి.

రెండు పంటలకు అనుకూలమే..

వానాకాలం, యాసంగి రెండు పంటలు పండించుకునే సౌకర్యం తెలంగాణ సోనాకు ఉన్న మరో ప్రత్యేకత. తక్కువ రోజుల్లో పంట వస్తుంది కాబట్టి నీటి అవసరం కూడా తక్కువే. పంట మధ్యలో జనుము, పిల్లి పెసర వంటి పచ్చి రొట్ట ఎరువులు వేసుకుంటే భూసారం పెరుగుతుంది. మిగతా ఎరువుల వినియోగం, ఖర్చు తగ్గుతుంది. సాంబా మసూరి(బీపీటీ–5204) వంటి రకంతో వరి పంట పండించడానికి155 నుండి160 రోజుల సమయం పడితే తెలంగాణ సోనా పండించడానికి125 రోజులు సరిపోతుంది. దిగుబడి కూడా ఇతర వంగడాల కంటే 5 నుంచి10 శాతం ఎక్కువే వస్తుంది. సాంబా మసూరి ఎకరానికి 22 క్వింటాళ్ల దిగుబడి వస్తే తెలంగాణ సోనా రకంతో 28 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని చెప్తున్నారు.

అభివృద్ధి చేసింది ఇలా..

ఎక్కువ దిగుబడిని ఇచ్చే ఎంటీయు1010(ఫీమేల్‌‌), జేజీఎల్‌‌3855(మేల్‌‌)లను క్రాసింగ్‌‌ చేసి తెలంగాణ సోనా(ఆర్‌‌ఎన్‌‌ఆర్‌‌–15048) వరి రకాన్ని  జయశంకర్‌‌ యూనివర్సిటీ వరి పరిశోధన విభాగం అభివృద్ధి చేసింది. ఇందులో సాంబా మసూరి కంటే ప్రోటీన్‌‌ (8.76 శాతం) ఎక్కువగా ఉండడంతో పాటు బీ2, బీ3 విటమిన్‌‌ లు కూడా ఉంటాయి. ఈ బియ్యాన్ని తింటే గ్లూకోజ్‌‌ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుందని గుర్తించారు.

ఏడు రాష్ట్రాల్లో డిమాండ్‌‌

తెలంగాణ సోనా వరి రకానికి ఇతర రాష్ట్రాల్లోనూ మంచి ఆదరణ ఉంది. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, ఇలా దాదాపు7 రాష్ట్రాల రైతులు ఈ విత్తనాలతో పంట వేస్తున్నారు. ఈ వరి రకం మార్కెటింగ్ లైసెన్స్ కోసం ఇతర రాష్ట్రాల వరి విత్తన వ్యాపారుల నుంచి సైతం మంచి డిమాండ్ ఉందని అంటున్నారు.

Latest Updates