డ్యాముల భద్రతపై ఫోకస్!.. సీడీఎస్ఈ నిర్వహణకు ఇరిగేషన్ శాఖ కసరత్తు

 డ్యాముల భద్రతపై ఫోకస్!..  సీడీఎస్ఈ నిర్వహణకు ఇరిగేషన్ శాఖ కసరత్తు
  • మంత్రి ఉత్తమ్ రివ్యూ తర్వాత క్షేత్రస్థాయి ఇంజనీర్లకు ట్రైనింగ్
  • సీడీఎస్​ఈ రికార్డులను పట్టించుకోని గత సర్కార్
  • 2026 డిసెంబర్​ కల్లా రిపోర్టులు ఇవ్వాలని కేంద్రం డెడ్​లైన్
  • చర్యలు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని డ్యాముల భద్రతపై ప్రభుత్వం దృష్టి సారించింది. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ వచ్చాక.. గత బీఆర్ఎస్ హయాంలో డ్యాముల భద్రతను పట్టించుకోలేదు. డ్యామ్ సేఫ్టీ కోసం కాంప్రహెన్సివ్ డ్యామ్ సేఫ్టీ ఎవాల్యుయేషన్ (సీడీఎస్ఈ) నిర్వహించి రికార్డులను తయారు చేయాలని ఆ చట్టం స్పష్టం చేసినా.. ఒక్కటంటే ఒక్క డ్యాముకూ ఇప్పటివరకు సీడీఎస్ఈ రికార్డులు, రిపోర్టులూ లేవు. ఈ నేపథ్యంలోనే సీడీఎస్ఈ రిపోర్టులను 2026 డిసెంబర్ నాటికి సమర్పించాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను ఇటీవల కేంద్రం ఆదేశించింది. 

అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డికి సైతం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ లేఖ రాశారు. ఈ అంశంపై ఇటీవల సీఎం సమీక్ష నిర్వహించగా, రెండు, మూడు రోజుల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ చేయనున్నట్లు తెలిసింది. అందుకు అనుగుణంగా సీడీఎస్ఈ నిర్వహణపై ఇరిగేషన్ అధికారులు కసరత్తు ప్రారంభించారు.

మూడు అంశాలుగా రిపోర్టులు

డ్యామ్ రిస్క్ అసెస్మెంట్ స్టడీ: డ్యామ్​ల ప్రస్తుత పరిస్థితితో పాటు గతంలో ఆ డ్యామ్​కు జరిగిన ప్రమాదం లేదా రాబోయే ప్రమాదాలకు సంబంధించి విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. డ్యామ్ కరకట్టలు, గేట్లు, ఇతర నిర్మాణాల పటిష్ఠతపై స్టడీ చేయాల్సి ఉంటుంది. 

ఎమర్జెన్సీ యాక్షన్ ప్లాన్: డ్యామ్​లకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్​ప్లాన్ రూపొందించాలి. ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలకు ప్రణాళికలను తయారు చేయాలి. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలన్నదానిపై మాన్యువల్​ను ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది.

సీడీఎస్ఈ: ఇందులో భాగంగా ప్రతి డ్యామ్​కు సంబంధించి డిజిటల్ లాగ్​బుక్​లు, డేటాబేస్​లను తయారు చేసి పెట్టుకోవాలి. డ్యామ్ లొకేషన్, దాని ప్రయోజనాలు, నిర్మించిన ఉద్దేశం వంటి వివరాలను డిజిటల్​గా రికార్డు చేసి పెట్టాలి. ఆపరేషన్ ప్రొటోకాల్, డ్యామ్ ఎత్తు, గేట్ల సంఖ్య, హెడ్ రెగ్యులేటరీలు, ప్రధాన కాల్వలు, విద్యుత్ ప్రాజెక్టుల వంటి వివరాలనూ రికార్డు చేయాలి.

రాష్ట్రంలో ఏ డ్యాముకూ రికార్డులు లేవు

పై మూడు అంశాల ఆధారంగా డ్యాముల పటిష్ఠతపై రికార్డులను తయారు చేయాల్సి ఉన్నా.. ఇప్పటి వరకు రాష్ట్రంలోని ఏ ఒక్క డ్యాముకూ ఆ రికార్డులే లేవంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో రాష్ట్రంలోని సాగర్, శ్రీశైలం, ఎస్సారెస్పీ లాంటి కీలక ప్రాజెక్టులతో పాటు పలు మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలు, వాటి భద్రతపై ఆందోళనలు సైతం వ్యక్తమయ్యాయి.

 దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం డ్యాముల భద్రతపై దృష్టి సారించి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు లేఖలు రాసింది. అన్ని డ్యాములకు సీడీఎస్ఈ నిర్వహించి రిపోర్టులను పంపాలని స్పష్టం చేసింది. 15 నెలల్లోగా కేంద్రానికి ఆ రిపోర్టులు అందాలని తేల్చి చెప్పింది. మరోవైపు డ్యామ్ సేఫ్టీ యాక్ట్​కు అనుగుణంగా డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్​ను ఏర్పాటు చేసి.. అధికారులను కేటాయించినా సీడీఎస్ఈ నిర్వహించకపోవడం గమనార్హం.

డ్యాముల భద్రతకు చట్టం..

దేశంలోని అన్ని ప్రధాన డ్యాముల భద్రతకు సంబంధించి సర్వైలెన్స్, తనిఖీ, ఆపరేషన్, నిర్వహణ, రక్షణపై కేంద్ర ప్రభుత్వం 2021లో డ్యామ్ సేఫ్టీ యాక్ట్​ను తీసుకొచ్చింది. మన రాష్ట్రంలోని 173 డ్యాములు సహా దేశంలోని 6,500 డ్యాములను చట్టం పరిధిలోకి తెచ్చింది. 2026 నాటికి అన్ని డ్యాములకు సీడీఎస్ఈ నిర్వహించాలని చట్టంలోని సెక్షన్​ 38 (1)లో పేర్కొన్నారు. కానీ మన రాష్ట్రంలో ఏ ఒక్క డ్యాముకూ ఇప్పటివరకు సీడీఎస్ఈ రికార్డులు నిర్వహించలేదు. మూడు అంశాలుగా రిపోర్టులను సిద్ధం చేయాల్సి ఉన్నా.. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం సీడీఎస్ఈ అమలుపై నిర్లక్ష్యం చూపుతూ వచ్చింది.