ఎడ్యుకేషన్​కు ‘నామ్ కే వాస్తే’

    అంకెల్లో పెరిగి, శాతాల్లో తగ్గింది

    ఇంటర్ కాలేజీల్లో మిడ్ డే మీల్స్ డౌటే

    వర్సిటీల్లో కనిపించని ప్రగతిపద్దు

    టెక్నికల్ ఎడ్యుకేషన్​కు కోత

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విద్యాశాఖకు నామమాత్రపు కేటాయింపులే జరిగాయి. 2020–21 బడ్జెట్​లో 6.63 శాతం మాత్రమే నిధులను ప్రతిపాదించారు. అంకెల్లో విద్యారంగానికి నిధులు పెరిగినట్టు కనిపిస్తున్నా.. శాతాల్లో మాత్రం తగ్గాయి. యూనివర్సిటీల్లో ప్రగతిపద్దు ఈ ఏడాది కూడా మాయం కాగా, టెక్నికల్​ఎడ్యుకేషన్​లో నిర్వహణ పద్దులోనూ కోత పడింది. ఉద్యోగుల జీతాలకూ ఈ నిధులు సరిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

స్కూల్ ఎడ్యుకేషన్  కు కేంద్రం నిధులే ఆధారం

విద్యారంగానికి మొత్తం రూ.12,127.55 కోట్ల నిధులను ప్రతిపాదించారు. దీంట్లో నిర్వహణ పద్దు రూ.10,751.13 కోట్లు కాగా, ప్రగతి పద్దు రూ.1,376.42 కోట్లు. గతేడాదితో పోలిస్తే బడ్జెట్​లో 2,227.75 కోట్ల ప్రతిపాదనలు పెరిగినా, శాతాల్లో మాత్రం తగ్గింది. 0.12 శాతం మేర కోత పడింది. స్కూల్ ఎడ్యుకేషన్​కు రూ.10,405 కోట్లు ప్రతిపాదించగా, వీటిలో నిర్వహణ పద్దు కింద రూ.9,113.10 కోట్లు, ప్రగతిపద్దు కింద రూ.1,292.19 కోట్లు పెట్టారు. గతేడాదితో పోలిస్తే రూ.2,196.27 కోట్లు పెరిగాయి. నిర్వహణ పద్దు కింద రూ.1,557 కోట్లు పెరగ్గా, అవన్నీ కూడా 2017 టీఆర్టీ ద్వారా భర్తీ చేసిన టీచర్ల వేతనాలకే సరిపోతాయని అధికారులు చెప్తున్నారు. ప్రగతి పద్దు కింద సమగ్ర శిక్షా అభియాన్​(ఎస్ఎస్ఏ)కు రూ.623.48 కోట్లు ప్రతిపాదించారు. గతేడాదితో పోలిస్తే 500 కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. ప్రగతిపద్దు కింద లైబ్రరీలకు రూ.1.04 కోట్లు, టెక్స్ట్ బుక్స్​కు రూ.7.35 కోట్లు, ఎగ్జామ్స్​బోర్డు కు రూ.12.95 కోట్లు, గురుకుల ఎడ్యుకేషన్ సొసైటీకి రూ.25 కోట్లు, స్పోర్ట్స్​కు రూ.60 లక్షలు ప్రతిపాదించారు. అడల్ట్ ఎడ్యుకేషన్​కు గతేడాది రూ.73.70 లక్షలు ఇస్తే, ఈసారి రూ.1.37 లక్షలు మాత్రమే ప్రతిపాదించారు. స్కూల్​ఎడ్యుకేషన్​ కేంద్రం నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడినట్టు స్పష్టమవుతోంది.

హయ్యర్ ఎడ్యుకేషన్​కు రూ.1,452 కోట్లు

బడ్జెట్​లో హయ్యర్ ఎడ్యుకేషన్​కు రూ.1,452.03 కోట్లు ప్రతిపాదించారు. దీంట్లో రూ.1,372.95 నిర్వహణ పద్దు కాగా, రూ.79.08 కోట్ల ప్రగతి పద్దు. అయితే గతేడాది కంటే రూ.84 కోట్లు ఎక్కువ. హయ్యర్ ఎడ్యుకేషన్ పద్దులో ఈసారి ఇంటర్​విద్యుకు రూ.490.30 కోట్లు ప్రతిపాదించగా, దీంట్లో ప్రగతిపద్దు కేవలం రూ.36.27 కోట్లు మాత్రమే. అయితే వచ్చే విద్యాసంవత్సరం కూడా ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం లేదని ఈ లెక్కల ద్వారా స్పష్టమవుతోంది. హయ్యర్​ఎడ్యుకేషన్ లో కేటాయింపులన్నీ జీతాలకే కోసమే కేటాయించినట్టు కనిపిస్తోంది. ప్రగతిపద్దులో రూసాకు రూ.10.71కోట్లు, కళాశాల విద్యాశాఖకు రూ.39.61 కోట్లు ప్రతిపాదించారు.

టెక్నికల్ ఎడ్యుకేషన్​కు రెండో ఏడాదీ కోత

టెక్నికల్ ఎడ్యుకేషన్​కు వరుసగా రెండో ఏడాది భారీగా కోత పెట్టారు. 2020–21 బడ్జెట్​లో రూ. 270.23 కోట్లు ప్రతిపాదించగా, దీంట్లో రూ.265.08 కోట్లు నిర్వహణ పద్దు కాగా, ప్రగతిపద్దు రూ.5.15 కోట్లుగా చూపించారు. గతేడాదితో పోలిస్తే ఈ శాఖకు రూ.52.68 కోట్లు కోత పెట్టారు. జేఎన్​టీయూహెచ్​కు నిర్వహణ పద్దులో భారీగా కోతపడింది. గతేడాది రూ.66.04 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.33.02 కోట్లు ప్రతిపాదించారు. పాలిటెక్నిక్​లకూ ఇదే దుస్థితి. గతేడాది 142 కోట్లు కేటాయిస్తే ఈసారి రూ.98.99 కోట్లే ప్రతిపాదించారు.

Latest Updates