లక్షా 82 వేల కోట్ల బడ్జెట్​: భూములు, ఆస్తుల అమ్మకం.. లిక్కర్​ ఆదాయమే దిక్కు

అన్ని చార్జీల పెంపునకు రెడీ.. పాత హామీలకే నిధులు.. కొత్త పథకాల్లేవు

నిరుద్యోగులు, ఉద్యోగులకు మొండిచేయి

ఇరిగేషన్​ ప్రాజెక్టులకు తగ్గిన కేటాయింపులు

సొంత జాగల్లో ఇల్లు కట్టుకుంటే పైసలు

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మళ్లీ నిధులు

ఆర్టీసీకి వెయ్యి కోట్లు.. గ్రేటర్​కు 10 వేల కోట్లు

నిరుడు ఆర్థిక మాంద్యంతో నేలకు తాకిన రాష్ట్ర బడ్జెట్.. ఈసారి ఊహలకు అందని విధంగా పెరిగి పోయింది. 2020–21 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. లక్షా 82 వేల 914  కోట్ల భారీ పద్దును సర్కార్​ ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రూ. లక్ష కోట్లు రాష్ట్ర ఆదాయం ఉండగా.. రాబోయే ఆర్థిక సంవత్సరంలో అది రూ. 1.43 లక్షల కోట్లకు చేరుతుందని ప్రభుత్వం లెక్కలు వేసింది. అంటే 43 శాతం వృద్ధి సాధ్యమని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆర్థిక మాంద్యం కారణంగా తగ్గినట్లు చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. సొంత ఆదాయ వనరులపై ఆధారపడి భారీ సైజ్​ బడ్జెట్​ను ప్రజెంట్​ చేయడం గమనార్హం.  అంతమొత్తంలో ఆదాయాన్ని సర్కారు ఏయే మార్గాల్లో  రాబడుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.

ప్రధానంగా భూముల అమ్మకం, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం, స్టాంపులు రిజిస్ట్రేషన్ల చార్జీల పెంపు, లిక్కర్, ఇసుక అమ్మకాల ద్వారా భారీ ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం డిసైడయింది. అందుకు అనుగుణంగానే రెవెన్యూ రాబడుల్లో ఈ పద్దులను పెంచి చూపించింది. అప్పు చేయటంలో వెనక్కి తగ్గేది లేదంటూ పాత పంథానే అనుసరించింది. చట్ట ప్రకారం బడ్జెట్​ పరిధిలో చేసే అప్పులతోపాటు ప్రభుత్వ గ్యారెంటీపై కార్పొరేషన్ల ద్వారా ఈ ఏడాది రూ. 40 వేల కోట్లు అప్పు తీసుకున్నట్లు వెల్లడించింది. రాష్ట్ర బడ్జెట్​ను అసెంబ్లీలో ఆర్థిక మంత్రి హరీశ్​రావు ఆదివారం ప్రవేశపెట్టారు. గంటపాటు ఆయన ప్రసంగం కొనసాగింది.

భూములు అమ్ముడు.. చార్జీలు పెంచుడు

రాజీవ్​ స్వగృహతోపాటు నిరర్ధక ఆస్తులను అమ్మేసి ఆదాయాన్ని సమకూర్చుకుంటామని మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ ప్రసంగంలో చెప్పారు. దీంతో రాజీవ్​ స్వగృహ, హౌసింగ్​ బోర్డు, ఔటర్​ చుట్టున్న భూముల వేలానికి ముహూర్తం సిద్ధమైనట్లే. డీఐఎల్​ భూములతోపాటు హౌసింగ్  బోర్డు భూములను ప్రధానంగా అమ్మకానికి పెట్టనున్నారు. ఈ భూముల అమ్మకం ద్వారానే వచ్చే ఏడాది రూ. 14,294 కోట్లు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసుకుంది. రెవెన్యూ రాబడిలో ఈ పద్దును ప్రస్తావించింది. దీంతోపాటు త్వరలోనే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచనున్నట్లు ఇండికేషన్​ ఇచ్చింది. వచ్చే ఏడాది ఈ విభాగం ద్వారా వచ్చే ఆదాయం రూ.3,800 కోట్ల మేరకు పెరుగుతుందని అంచనా వేసింది. ఆర్టీసీ చార్జీలు, కరెంటు చార్జీలు పెంచుతామని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. రాష్ట్ర ఖజానాకు ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే లిక్కర్​ సేల్స్​ ద్వారా అదనంగా రూ. 6 వేల కోట్ల ఆదాయం సంపాదించాలని సర్కారు టార్గెట్​గా పెట్టుకుంది. లిక్కర్​ ద్వారా ఈ ఏడాది  రూ. 21 వేల కోట్లు ఆదాయం రాబట్టిన ప్రభుత్వం.. బడ్జెట్​లో రూ. 27,439 కోట్లు అంచనా వేసుకుంది. ఈ సారి ఇసుక అమ్మకం ద్వారా 5,600 కోట్లు అంచనా వేసింది.

పాత హామీలకే నిధులు

ఎన్నికల ముందు ఇచ్చిన కొన్ని హామీల అమలు కార్యాచరణ తప్ప.. కొత్త పథకాలేవీ ఈ బడ్జెట్​లో కనిపించలేదు. నిరుద్యోగ భృతిని ప్రభుత్వం ప్రస్తావించలేదు. ఉద్యోగులకు పీఆర్సీ అమలు విషయాన్ని వెల్లడించలేదు. దీంతో లక్షలాది నిరుద్యోగులకు,  ప్రభుత్వ ఉద్యోగులకు ఆశాభంగమైంది. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన రైతు రుణమాఫీ పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు ప్రకటించింది. రూ. 25 వేల లోపు రుణాలున్న రైతులకు ఈ నెలలోనే  చెక్కుల పంపిణీకి రూ. 1,198 కోట్లు విడుదల చేయనుంది. రూ. 25వేల నుంచి లక్ష లోపు రుణాలున్న మిగతా రైతులకు నాలుగు విడతల్లో మాఫీ చేస్తామని ప్రకటించింది. రైతు సమన్వయ సమితులను ‘రైతు బంధు సమితులు’గా పేరు మార్చింది. రైతు వేదికల నిర్మాణం కోసం రూ. 350 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్​లో  బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఎంబీసీల సంక్షేమాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించని ప్రభుత్వం.. ఈసారి ఎంబీసీలకు రూ. 500 కోట్లు కేటాయించింది. హైదరాబాద్​ డెవలప్​మెంట్​కు ఈ బడ్జెట్​లో పెద్దపీట వేసింది. ఏకంగా  రూ. 10 వేల కోట్లు కేటాయించటం రాబోయే జీహెచ్​ఎంసీ ఎన్నికల ముందస్తు ప్లాన్​గా తెలుస్తోంది. ఇప్పటివరకు డబుల్​ బెడ్రూం ఇండ్లకు అప్పులతో నిధులు సరిపెట్టిన ప్రభుత్వం.. తొలిసారిగా బడ్జెట్​ నుంచి భారీగా రూ. 10,500 కోట్లు కేటాయించింది. 57 ఏండ్లు నిండినవారికి ఆసరా పెన్షన్లను పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఆసరాకు కేటాయించే నిధులను పెంచింది. సమ్మెతో రాష్ట్రంలో సంచలనం రేపిన ఆర్టీసీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించింది.

సీఎం ఫండ్​కు కోత.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఊరట

సీఎం ఆధ్వర్యంలో ఖర్చు చేసే స్పెషల్​ డెవెలప్​మెంట్​ ఫండ్​కు లాస్ట్​ బడ్జెట్​లో రూ.10 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.3,500 కోట్లకు కుదించింది. నిరుటి బడ్జెట్​లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఇచ్చే నియోజకవర్గ అభివృద్ధి నిధిని ఆపేసిన ప్రభుత్వం.. ఈసారి పునరుద్ధరించింది. ఒక్కొక్కరికి రూ. 3 కోట్లు చొప్పున రూ. 480 కోట్లు కేటాయించింది.

ఆదాయం పడ్డా.. పైపైకి!

ఆదాయం రికార్డు స్థాయిలో పడిపోయిందని ప్రభుత్వం వెల్లడించింది.  తొలి ఐదేండ్లలో సగటున 21.5 శాతం వృద్ధి నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకు 6.3 శాతానికి పడిపోయింది. అంటే ఒక్కసారిగా 15.2 శాతం తగ్గిందని ప్రభుత్వం ప్రకటించింది. కానీ బడ్జెట్​ సైజ్​ను మాత్రం అమాంతం పెంచేసింది. కాగ్​కు సమర్పించిన అకౌంట్ల ప్రకారం 2019–20లో రాష్ట్ర రెవెన్యూ రాబడి జనవరి నెలాఖరు నాటికి రూ. 80 వేల కోట్లు. ఈ ప్రకారం మార్చి నెలాఖరు వరకు రూ. లక్ష కోట్లు దాటే అవకాశం లేదు. కానీ 2020–21 ఏడాది రెవెన్యూ రాబడి  రూ.1.43 లక్షల కోట్లుగా బడ్జెట్​లో పొందుపరిచింది.

అందరికీ అన్నీ ఇచ్చినం: హరీశ్
రాష్ట్రంలో అన్ని వర్గాలకు ప్రయోజనం కలిగించేలా సంక్షేమ బడ్జెట్ ప్రవేశపెట్టినం. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నం. ఆర్థిక మాంద్యంతో పన్నులు, పన్నేతర రాబడి తగ్గిపోయింది. కేంద్రం నుంచి ఆదాయం తగ్గింది. రాష్ట్ర రెవెన్యూ అభివృద్ధి అంతకుముందు ఏడాది 16.1 శాతంతో పోలిస్తే.. ఇప్పుడు 6.3 శాతానికి తగ్గింది. కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లలో కోతపడినా సొంత ఆదాయ వృద్ధితో లోటును పూడ్చుకుంటున్నం. జీఎస్డీపీ 14.3 శాతం నుంచి 12.6 శాతానికి తగ్గింది. పరిస్థితులకు తగినట్టుగా ఆర్థిక వ్యూహ రచన చేస్తున్నం. రాజీవ్ స్వగృహతోపాటు నిరర్థకంగా ఉన్న ప్రభుత్వ ఆస్తులను అమ్మి ఆదాయం సమకూర్చుకుంటం.
– బడ్జెట్ ప్రసంగంలో మంత్రి హరీశ్రావు

ఇది ప్రగతిశీల బడ్జెట్

అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రభుత్వ ప్రణాళికలకు తగినట్లుగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆర్థిక మాంద్యం ప్రభావంతో రాబడులు తగ్గినా, కేంద్ర నిధుల్లో కోత పడినా.. రాష్ట్రాభివృద్ధికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతిపాదనలు తయారు చేశారు. ఇది ప్రగతిశీల, వాస్తవిక బడ్జెట్. పల్లెలు, పట్టణాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకునే కార్యక్రమాలకు అనుగుణంగా బడ్జెట్​ను రూపొందించారు.

– సీఎం కేసీఆర్​

25 వేల లోపు రుణాలు ఈ నెలలోనే మాఫీ

అగ్రికల్చర్​కు సర్కారు రూ.24,116 కోట్లు కేటాయించింది. ఇందులో రైతు బంధు, రైతు రుణమాఫీ, రైతు బీమాకే  రూ.21,366 కోట్లు ఇచ్చింది. రూ. 25 వేల లోపు రుణమున్న రైతులకు ఈ నెలలోనే మాఫీ చేస్తామని ప్రకటించింది. ఇందుకు రూ.1,198 కోట్లు కేటాయించింది. రూ.25 వేల నుంచి రూ.లక్ష లోపు రుణాలను 4 విడతల్లో మాఫీ చేస్తామని తెలిపింది.

57 ఏండ్లు నిండితే ఆసరా

57 ఏండ్లు నిండిన వాళ్లకు ఆసరా పెన్షన్​ను అందించనున్నట్లు ప్రకటించింది. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, నేత కార్మికులు, గీత కార్మికులు కలిపి 39 లక్షల మంది ఆసరా పింఛన్​ తీసుకుంటున్నారు. 57 ఏళ్లు నిండినవారిని కలిపితే ఈ సంఖ్య మరో 7 లక్షలకు పెరిగే చాన్స్​ ఉంది. ఆసరా పెన్షన్లకు రూ.11,758 కోట్లు కేటాయించిన సర్కార్​.. మూడేండ్ల కింద ఆగిపోయిన అభయహస్తం పింఛన్లను పట్టించుకోలేదు.

గ్రేటర్కు ఎలక్షన్ ఫండ్స్!

గ్రేటర్​ హైదరాబాద్​కు రూ. 10వేల కోట్లు కేటాయించింది. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలే టార్గెట్​గా ఇంత మొత్తం కేటాయించినట్లు తెలుస్తోంది. గ్రేటర్ లో చివరి దశకు చేరుకున్న 50 వేల డబుల్​ బెడ్రూం ఇండ్లను దసరాకల్లా ప్రారంభించి, లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నిధులను ఇండ్ల నిర్మాణాన్ని పూర్తి చేయడానికి  ఉపయోగించనుంది.

రాష్ట్ర అప్పులు రూ. 3.18 లక్షల కోట్లు

రాష్ట్రం అప్పులు రూ. 3.18 లక్షల కోట్లు దాటనున్నాయి. ఇరిగేషన్​ ప్రాజెక్టులు, మిషన్‌ భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిట ఇప్పటికే రూ.89,600 కోట్ల రుణాలకు ప్రభుత్వం గ్యారెంటీలు ఇచ్చింది. ఎఫ్ఆర్​బీఎం పరిధిలో కొత్త ఆర్థిక సంవత్సరంలో రూ.2.29 లక్షల కోట్లకు అప్పులు చేరుతాయని బడ్జెట్​లో ఆర్థిక శాఖ ప్రస్తావించింది. రూ.3.18 లక్షల కోట్ల అప్పులను రాష్ట్రంలో ఒక్కొక్కరికి పంచితే.. తలసరి అప్పు రూ. 91,019గా నమోదు కానుంది.

Latest Updates