ధనిక రాష్ట్రమే కానీ..అప్పు 2.90 లక్షల కోట్లు

  • మిత్తీలు కట్టలేక,స్కీమ్ లకు పైసల్లేక సర్కారు అవస్థలు

రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ పంచుకున్న అప్పు రూ. 70 వేల కోట్లు . గత ఆరేండ్లలో ఈ అప్పు నాలుగున్నర రెట్లు పెరిగింది. తీసుకున్న అప్పులకు మిత్తి ఏటేటా తడిసి మోపెడవుతోంది. వడ్డీలకు నిరుడు రూ.13 వేల కోట్లు ముట్ట జెప్పగా ఈ ఏడాది రూ.14,600 కోట్లను సర్కారు కేటాయించింది.

ధనిక రాష్ట్రం తెలంగాణ అప్పులతో అవస్థపడుతోంది. ఆరేండ్లలో బాకీలు రూ. 2.90 లక్షల కోట్లకు చేరడంతో మిత్తీలు కట్టలేక సతమతమవుతోంది. నెలనెలా ఇన్‌‌స్టాల్‌‌ మెంట్లుచెల్లించేందుకు ముప్పు తిప్పలు పడుతోంది. ఇన్నాళ్లూ తెలియకపోయినా మూడు నెలలుగా కరోనా వైరస్‌‌ వల్ల ముసురుకున్న సంక్షోభం రాష్ట్ర ఎకానమీని బట్టబయలు చేసింది.నిర్వహణఖర్చులకే నెలనెలా రూ. 4 వేల కోట్ల కొత్త అప్పు చేస్తున్న తీరు ధనిక రాష్ట్రం స్వరూప స్వభావాలను వేలెత్తి చూపింది. కరోనా టైమ్‌లో 3 నెలల పాటు సర్కారు ఉద్యోగులు,పెన్షనర్లకు జీతాలియ్యలేక కోతపెట్టింది. నెలనెలా ఇచ్చే ఆసరా పెన్షన్లు, పథకాల కోసం కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

జీతాలకు మించి అప్పుకిస్తీలు

సొంత ఆదాయ వనరులతో పాటు వివిధ మార్గాల్లో రాష్ట్ర ఖజానాకు ప్రతి నెలా రూ.11 వేల కోట్ల నుం చి రూ.12 వేల కోట్ల రాబడి వస్తుంది. అయితే ఆర్బీఐతో పాటు వివిధ ఆర్థిక సంస్థలనుంచి ప్రభుత్వం చేసిన అప్పు ఇప్పటికేరూ. 2.90 లక్షల కోట్లకు చేరింది.ఈ అప్పులను నెలనెలా వాయిదాల్లో చెల్లించటం అనివార్యమైంది. .ఇదే సర్కారుకు గుదిబండగా మారింది. తెచ్చిన అప్పులకు ఈ ఆర్థిక సంవత్సరం రూ. 37,500 కోట్లు చెల్లించాలి. అంటే  నెలనెలా దాదాపు రూ. 3, 100 కోట్లు అప్పు కిస్తీలకే పోనున్నాయి.ఈ లెక్కన సాధారణ పరిస్థితుల్లో వచ్చే ఆదాయంలో దాదాపు 4వ వంతు నిధులు ఇన్‌‌స్టాల్‌ మెంట్లకేనని అర్థమవుతోంది. ఇక ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు, రిటైర్ అయినోళ్ల పెన్షన్లకోసం రూ. 2,500 కోట్లు అవసరం. జీతాలతో పోలిస్తే అప్పుల కిస్తులే ఎక్కువ ఉండటం గమనార్హం.

ఆరేండ్లలో నాలుగున్నర రెట్లు

రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ పంచుకున్న అప్పు రూ. 70 వేల కోట్లు. గత ఆరేండ్లలో ఈ అప్పు నాలుగున్నర రెట్లు పెరిగింది. ఇలా ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతున్నాయని ప్రభుత్వ వర్గాలు అనుకుంటున్నాయి. తీసుకున్న అప్పులకు మిత్తి ఏటేటా తడిసి మోపెడవుతోంది. వడ్డీలకు నిరుడు రూ.13 వేల కోట్లు ముట్టజెప్పగా ఈ ఏడాది రూ.14,600 కోట్లను సర్కారు కేటాయించింది. అప్పులకు తోడు వడ్డీల భారం పెరుగుతుండటం ఆందోళనకరపరిణామమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. లాక్‌‌డౌన్ టైమ్‌లో అప్పుల చెల్లిం పులు వాయిదా వేయాలని, హెలికాప్టర్ మనీ విడుదల చేయాలని కేంద్రానికి కేసీఆర్‌‌ విజ్ఞప్తి చేశారు. అయితే కేంద్రం నుంచి ఆశించిన స్పందన లేకపోవటం రాష్ట్ర ఖజానాకు గండంగా మారింది. అప్పుల భారం ఇంతగా లేకుంటే జీతాల కోత పరిస్థితి వచ్చేది కాదని ఓ సీనియర్ అధికారి అభి ప్రాయపడ్డారు. కాగా, అభివృద్ధి పనులకే అప్పలు తీసుకుంటున్నామని సీఎం కేసీఆర్ పలుమార్లు అసెంబ్లీలో ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు, మిషన్‌‌‌‌భగీరథ, ఇతర కార్పొరేషన్ల పేరిటనే ప్రభుత్వం రూ.89 వేల కోట్లు రుణాలకు గ్యారంటీ ఇచ్చింది.

 ఆర్బీఐ నుంచి తెచ్చి రైతు బంధుకు?

లాక్‌‌డౌన్ టైమ్‌లో సర్కారు ఆదాయానికి పూర్తిగా గండి పడింది. అదే టైమ్‌లో అప్పుల చెల్లింపులూ మీద పడటం ఖజనాను అతలాకుతలం చేసింది. ఆ ఎఫెక్ట్ పథకాలపై పడింది. నెలనెలా ఇచ్చే బియ్యం సబ్సిడీ, ఆరోగ్య శ్రీ, ఆసరా పెన్షన్లు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లపై ఎఫెక్ట్ కనబడింది. ఎన్నికల ముందు ప్రకటించిన రుణమాఫీని ఇప్పటికీ అమలు చేయలేక పోయింది. రుణమాఫీకి 3 నెలల కిందట రూ. 1,210 కోట్లకు ఉత్తర్వులిచ్చినా నిధులింకా విడుదల చేయలేదు. గత రెండేళ్లలో చాలా చోట్ల రైతు బంధు డబ్బులు జమ చేయకుండా రూ. 4,500 కోట్లు ఆపేసింది. ఈసారి రైతుబంధు నిధులాపితే వ్యతిరేకత వస్తుందని అప్రమత్తమైంది. గత వారం రోజుల్లోనే రైతులందరి ఖాతాల్లోడబ్బులు జమచేసింది. ఆర్బీఐ నుంచి కొత్త అప్పు తెచ్చి రైతు బంధుకు సర్దుబాటు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి .

3 నెలల్లోనే 12 వేల కోట్ల అప్పు

అప్పు మీద అప్పులు చేసేందుకు ప్రభుత్వం వెనుకాడట్లేదు. గత 3 నెలల్లోనే రూ. 12 వేల కోట్లకు పైగా అప్పుతెచ్చింది. ప్రతి నెలా సగటున రూ. 4 వేల కోట్ల విలువైన బాండ్లు వేలం వేసి ఆర్బీఐ నుంచి రుణం తీసుకుంది. ఏప్రిల్‌లో రూ. 4 వేల కోట్లు, మే లో మరో రూ. 4 వేల కోట్లు, జూన్‌‌లో ఇప్పటికే రూ.4,460 కోట్లు బాండ్లు అమ్మి సేకరించింది. ఎఫ్‌‌ఆర్‌‌బీఎం రూల్స్‌ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి 9 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ. 15 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు కేంద్ర ఆర్థఇక శాఖ అనుమతిచ్చింది. కానీ తొలి 3 నెలల్లోనే ఇందులో 83 శాతం అప్పులను సర్కారు వాడేసుకుంది. ఈ లెక్కన వచ్చే 6 నెలలు ఖజానా గండం ఎట్లా గట్టెక్కుతుందని అధికారులూ ఆశ్చర్యపోతున్నారు.

Latest Updates