హామీల అమలుకై టీచర్ల పోరుబాట

  • హామీల అమలు కోసం ఆందోళనలు
  • జులైని పోరాట మాసంగా ప్రకటించిన యూనియన్లు
  • పాల్గొననున్న 70 వేల మంది టీచర్లు
  • ఏడాది అవుతున్నా అమలుకాని సీఎం హామీలు
  • పత్తా లేని ఐఆర్‌‌, పీఆర్‌‌సీ.. సీపీఎస్‌‌పైనా స్పష్టత కరువు
  • ఐఆర్‌‌ లేదు.. పీఆర్‌‌సీ లేదు..

హైదరాబాద్‌‌, వెలుగు: టీచర్లు పోరుబాట పడుతున్నారు. సమస్యల పరిష్కారానికి వచ్చేనెల నుంచి రోడ్డెక్కేందుకు రెడీ అవుతున్నారు. ఏడాది కిందట సీఎం కేసీఆర్‌‌ ఇచ్చిన హామీల అమలు కోసం ఇప్పటికే అనేకసార్లు మంత్రులు, అధికారులకు వినతిపత్రాలు అందించినా ఫలితం లేకపోవడంతో టీచర్‌‌ యూనియన్లు పోరాట మార్గాన్ని ఎంచుకున్నాయి. ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్‌‌పీసీ), ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జాక్టో) ఆందోళనలకు సిద్ధమయ్యాయి. జులై నెలను పోరాట మాసంగా ప్రకటించాయి. జాక్టో నుంచి బయటికొచ్చిన ఎస్‌‌టీయూ కూడా రంగంలోకి దూకనుంది.

యూటీఎఫ్‌‌, టీపీటీఎఫ్‌‌, డీటీఎఫ్‌‌ తదితర14 ప్రధాన సంఘాలతో కూడిన యూఎస్‌‌పీసీ జులై 12న మండల కేంద్రాల్లో ధర్నాలు, జులై 20న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు చేయాలని నిర్ణయించింది. అప్పటికీ సర్కారు నుంచి స్పందన రాకుంటే జులై నెలాఖరు లేదా ఆగస్టు మొదటివారంలో చలో హైదరాబాద్‌‌ నిర్వహించాలని భావిస్తోంది. జులై 2న జిల్లా కలెక్టర్లకు వినతి, 18న జిల్లా కేంద్రాల్లో ధర్నాలు, 29న పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌‌ ముట్టడి చేపడతామని 10 సంఘాలతో కూడిన జాక్టో ఇప్పటికే వెల్లడించింది. ఈ నెల 29న మండల కేంద్రాల్లో, జులై 6న జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించాలని, అయిన ప్రభుత్వం స్పందించకుంటే జులై 20న ఇందిరాపార్క్‌‌ వద్ద మహాధర్నా నిర్వహించాలని ఎస్‌‌టీయూ నిర్ణయించింది. వివిధ సంఘాల  పరిధిలో సుమారు 70 వేల మంది టీచర్లు ఈ ఆందోళనల్లో భాగస్వాములయ్యే అవకాశం ఉంది.

ఏడాది దాటినా..

రాష్ట్రంలో ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు సుమారు ఐదున్నర లక్షల మందికి పైగా ఉంటారు. ఇందులో 1.06 లక్షల మంది టీచర్లుంటారు. గతంలో సమస్యల పరిష్కారం కోసం టీచర్లు ఆందోళనకు దిగడంతో నాటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి టీచర్స్‌‌ యూనియన్లతో మాట్లాడారు. సీఎంతో మాట్లాడిస్తానని హామీ ఇచ్చారు. ప్రగతిభవన్‌‌లో మే 16న ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలతో సీఎం కేసీఆర్‌‌ సుధీర్ఘంగా నాలుగున్నర గంటల పాటు భేటీ అయ్యారు. 18 అంశాలతోపాటు పలు సమస్యలపై చర్చించారు. అదేరోజు సీఎం కేసీఆర్‌‌ గంటలన్నర పాటు ఆ వివరాలను మీడియాకు వివరించారు. జూన్‌‌ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎంప్లాయీస్‌‌ అందరికీ ఐఆర్‌‌ ప్రకటిస్తాననీ, ఆగస్టు15న పీఆర్‌‌సీ ప్రకటిస్తానని చెప్పారు. ఎంప్లాయీస్‌‌ చనిపోయిన పది రోజుల్లోనే కారుణ్య నియామకాలు చేపడతామనీ, అంతర్‌‌ జిల్లా స్పౌజ్‌‌ కేసులకు సంబంధించి వెంటనే ట్రాన్స్‌‌ఫర్లు నిర్వహిస్తామన్నారు. నాటి మంత్రి ఈటల రాజేందర్‌‌ నేతృత్వంలో ఎంప్లాయీస్‌‌ సమస్యలపై ఏర్పాటు చేసిన హైపవర్‌‌ కమిటీని కొనసాగిస్తామని, వారితో ఎప్పుడైనా సమస్యలు చెప్పుకోవచ్చని ప్రకటించారు. కానీ వీటిల్లో ఒక్కటీ కూడా నేటికీ అమలు కాలేదు.

ఐఆర్‌‌ లేదు.. పీఆర్‌‌సీ లేదు..

సీఎం ప్రకటించిన ఐఆర్‌‌, పీఆర్‌‌సీ ప్రకటనలు ఇప్పటికీ నెరవేరలేదు. 2018 జూన్‌‌ 30తో పాత పీఆర్‌‌సీ గడువు ముగియగా జులై 1 నుంచి కొత్త పీఆర్‌‌సీ అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఏడాది కావొస్తున్నా నేటికీ కనీసం ఐఆర్‌‌ కూడా ప్రకటించలేదు. ఉద్యోగి ఎవరైనా చనిపోతే పదిరోజుల్లోనే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని చెప్పినా.. అమలు కావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులైన భార్యాభర్తలు వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తే వారిని వెంటనే ఒకే మండలంలో, అది సాధ్యం కాకపోతే కనీసం పక్క మండలంలో అయినా ఉండేలా చూస్తామని చెప్పారు. అది కూడా అమలు కాలేదు. దీంతో వందల కిలోమీటర్ల దూరంలో కుటుంబాలకు దూరంగా వారంతా పనిచేస్తున్నారు. ఉద్యోగ విరమణ రోజే ఆ ఉద్యోగికి మొత్తం బెనిఫిట్లతో కూడిన ప్యాకేజీని అందించాలని సీఎం చెప్పినా.. రెండు, మూడేండ్ల నుంచి రిటైర్మెంట్‌‌ బెనిఫిట్ల కోసం పెన్షనర్లు ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. టీచర్లు, ఎంప్లాయీస్‌‌ సమస్యల అధ్యయనం కోసం వేసిన మంత్రుల హైపవర్‌‌ కమిటీ కొనసాగుతుందని సీఎం ప్రకటించినా.. ఏనాడూ ఆ కమిటీ భేటీ కాలేదు. యూనియన్లతో చర్చించలేదు. ఇలా అన్ని హామీలూ గాలికి వదిలేశారని యూనియన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

రిటైర్మెంట్‌‌ వయసు పెంచరా?

అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఉద్యోగుల రిటైర్మెంట్‌‌ వయ సు 61కి పెంచుతామని సీఎం హామీనిచ్చినా దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఈ మధ్యకాలంలోనే సుమారు 800 మంది టీచర్ల వరకు రిటైర్‌‌ అయ్యారు. టీచర్లు, ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్న సీపీఎస్‌‌ అంశంపై స్పష్టత లేదు. ఏపీలో సీపీఎస్‌‌ విధానం రద్దు చేస్తామని జగన్‌‌ ప్రకటన చేసినా.. తెలంగాణలో స్పందన లేదు. ఏళ్ల నుంచి టీచర్లకు ప్రమోషన్లు లేక రాష్ట్రంలో ఎంఈవో, డిప్యూటీడీఈఓ, డైట్‌‌ లెక్చరర్లు ఇలా అనేక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలుగు మహాసభల సందర్భంగా పండిట్‌‌, పీఈటీ పోస్టులను అప్‌‌గ్రేడ్‌‌ చేసి, వారికే ప్రమోషన్లు ఇస్తామని సీఎం చెప్పారు. అయితే 10,479 పోస్టులు అప్‌‌గ్రేడ్‌‌ చేసినా నేటికీ వారికి ప్రమోషన్లు ఇవ్వలేదు. 2016లో సమ్మర్‌‌లో మధ్యాహ్న భోజన నిర్వహణ కోసం పనిచేసిన 25 వేల మంది టీచర్లకు 24 ఈఎల్స్‌‌ను తెల్లారే ఇస్తామని చెప్పినా అది నేటీకీ అమలుకు నోచుకోలేదు.

అన్ని సంఘాలు కలిసి రావాలి

సర్కారు తీరుపై టీచర్లు, ఎంప్లాయీస్‌‌, పెన్షనర్లు అసంతృప్తితో ఉన్నారు. వీరికి నాయకత్వం వహిస్తున్న అన్ని సంఘాలు ఆందోళనల్లో కలిసి రావాలి. ఎండ్ల తరబడి సమస్యలు పరిష్కారం కాకనే పోరాట మార్గం ఎంచుకున్నాం. సర్కారులో చలనం రాకుంటే ఉద్యమాలను ఉధృతం చేస్తాం. – చావ రవి, యూటీఎఫ్‌‌ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి

ఉద్యమాన్ని తాకట్టుపెట్టారు

కొందరు ఉద్యమాన్ని తాకట్టు పెట్టి, ఉద్యోగులకు అందాల్సిన ఫలాలను అడ్డుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌‌ హామీలు గాలికి వదిలేశారు. టీచర్లపై ఎందుకు వివక్ష చూపిస్తున్నారు? ఇప్పటికైనా సమస్యలు పరిష్కరించి పీఆర్‌‌సీ ప్రకటించాలి.- బి.భుజంగరావు, ఎస్‌‌టీయూ రాష్ర్ట అధ్యక్షుడు

Latest Updates