సీట్లు నిండుతలేవ్..కాలేజీలను ఇక నడపలేం

  • మూసివేతకు అనుమతించండి
  • డీసెట్ ​కన్వీనర్​కు 35 డీఈడీ కాలేజీల అప్లికేషన్
  • చాలా కాలేజీల్లో15 మంది స్టూడెంట్స్ కూడా చేరలే
  • టీచర్​పోస్టుల భర్తీపై నమ్మకం లేక డీఈడీకి తగ్గిన క్రేజ్
  • ఆసక్తి చూపని స్టూడెంట్స్
  • నల్గొండ, వరంగల్ జిల్లాల్లోనే ఎక్కువ కాలేజీల మూసివేత

హైదరాబాద్, వెలుగు:

డిప్లొమా ఇన్‌‌ ఎడ్యుకేషన్‌‌ (డీఈడీ) కాలేజీలు స్టూడెంట్లు లేక వెలవెలబోతున్నాయి. రెండు విడతల అడ్మిషన్స్‌‌ కౌన్సెలింగ్‌‌ తర్వాత కూడా సగం సీట్లు  నిండలేదు. దీంతో ప్రైవేటు మేనేజ్​మెంట్లకు కాలేజీల నిర్వహణ భారమైంది. సర్కారు నుంచి వచ్చే ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ కూడా సరిపోకపోవడంతో కాలేజీలను మూసేయడమే మేలని మేనేజ్​మెంట్లు భావిస్తున్నాయి. ఈ ఏడాది రెండు విడతల కౌన్సెలింగ్‌‌ తర్వాత కూడా స్టూడెంట్లు చేరకపోవడంతో మూసివేతకు అనుమతివ్వాలని డీసెట్‌‌ కన్వీనర్‌‌కు 35 ప్రైవేటు కాలేజీలు అప్లికేషన్ పెట్టుకున్నాయి.

అప్పుడలా.. ఇప్పుడిలా..

ఉమ్మడి రాష్ట్రంలో డీఈడీ కాలేజీలు ఒక వెలుగు వెలిగాయి. ప్రస్తుతం ప్రభుత్వం టీచర్‌‌ పోస్టులను పెద్దగా భర్తీ చేయకపోవడంతో పాటు కొత్త కొత్త రూల్స్ పెడుతుండటంతో టీచర్ ఎడ్యుకేషన్ పై స్టూడెంట్స్ కు ఆసక్తి తగ్గుతోంది. దీనికి అనుగుణంగానే కాలేజీల సంఖ్య కూడా తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో 2015లో 212 డీఈడీ కాలేజీలుండగా, ఆ సంఖ్య ప్రస్తుతం173 కాలేజీలకు తగ్గింది. దీంట్లోనూ మరో 35 ప్రైవేటు కాలేజీలు మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే ఒక్కో కాలేజీలో 40 సీట్లుండగా, దాంట్లో 20 శాతం సీట్లను మేనేజ్మెంట్‌‌ భర్తీ చేసుకోవచ్చు. మిగిలిన సీట్లు కన్వీనర్‌‌ కోటా ద్వారా నింపుతారు. కన్వీనర్‌‌ కోటాలో సీట్లు పొందిన వాళ్లలో ఒక్కో స్టూడెంట్ కు ప్రభుత్వం రూ.12,500 ఫీజు రీయింబర్స్‌‌మెంట్‌‌ ఇస్తుంది. ఇది కాలేజీల నిర్వహణకు ఏ మూలకూ సరిపోవడం లేదని మేనేజ్మెంట్లు వాపోతున్నాయి. పైగా ఫీజు రీయింబర్స్‌‌ మెంట్ ఏండ్ల తరబడి పెండింగ్‌‌లో ఉండటంతో,  సిబ్బందికి జీతాలు ఇచ్చేందుకు కూడా అప్పులు చేయాల్సి వస్తోందని నిర్వాహకులు చెప్తున్నారు. ఎస్‌‌జీటీ పోస్టులకు బీఈడీ కోర్సు చేసిన వారికి కూడా అనుమతివ్వడం కూడా డీఈడీ కాలేజీలకు పెద్ద దెబ్బగా మారిందని అంటున్నారు.

తగ్గిపోయిన క్రేజ్

కొన్నేండ్లుగా డీఈడీ కోర్సు చదివేందుకు స్టూడెంట్స్ పెద్దగా ఆసక్తి చూపడం లేదు. డీఈడీతో టీచర్​జాబ్​కొట్టే చాన్స్ గతంలో ఎక్కువగా ఉండేది. అదే బీఈడీ అయితే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అసలు టీచర్ పోస్టుల భర్తీ జరుగుతుందన్న నమ్మకమే పోయిందని స్టూడెంట్స్ అంటున్నారు. డీఈడీకి కూడా ఒకవైపు కాంపిటీషన్ పెరిగింది. మరోవైపు పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు. నోటిఫికేషన్ వచ్చినా అరకొర పోస్టులకు పోటీ పడి జాబ్​కొట్టడం అనేది సాధ్యం కాదు. అందుకే.. డీఈడీపై స్టూడెంట్స్ కు ఆసక్తి తగ్గిపోయిందని చెబుతున్నారు.

సగం కాలేజీల్లో స్టూడెంట్స్15లోపే..

డీసెట్‌‌కు 2017లో 42,754 మంది అప్లై చేసుకోగా  7,650 మందే చేరారు. 2019లో అప్లికేషన్ల సంఖ్య 25,584కు పడిపోగా చేరింది 4,150 మందే. ఇదే లెక్కన కాలేజీలు కూడా ఐదేండ్లలో 45 వరకూ మూతపడ్డాయి. 2019–-20 విద్యా సంవత్సరానికి173 కాలేజీలుండగా, వాటిలో163 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా కాలేజీల్లో15లోపు స్టూడెంట్సే చేరినట్టు అధికారులు చెప్తున్నారు. కొన్ని కాలేజీల్లో ఒకరిద్దరు స్టూడెంట్స్‌‌ మాత్రమే చేరారు. దీంతో కాలేజీలను నడపలేమంటూ ఈ ఏడాది35 కాలేజీల వరకూ దరఖాస్తు చేసుకున్నాయి. వీటిలో అత్యధికంగా నల్లగొండలో 10 కాలేజీలుండగా, వరంగల్‌‌లో 7, మహబూబ్‌‌నగర్‌‌లో 6, ఖమ్మంలో 4 కాలేజీలు ఉన్నాయి. ఈ 35 కాలేజీల్లో సుమారు252 మంది స్టూడెంట్లు డీసెట్‌‌ ద్వారా సీట్లు పొందారు. దీంతో కాలేజీల మూతపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ మూసివేతకు అనుమతి ఇస్తే, స్టూడెంట్లు దగ్గర్లోని ఇతర కాలేజీల్లో చేరేందుకు అవకాశం కల్పించనున్నారు.

Latest Updates