అర్హతలుంటెనే పాఠం చెప్పాలె

– క్వాలిటీపై దృష్టిసారించిన విద్యాశాఖ

– ప్రైవేట్ స్కూల్స్‌ టీచర్ల వివరాల సేకరణ

– శిక్షణ ఉన్నవారినే బోధనకు అర్హులుగా గుర్తింపు

– వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు

ఎవ్వరుపడితే వాళ్లు పాఠం చెప్త అంటే కుదరిక. కేవలం పిల్లలకు బోధించేందుకు శిక్షణ పూర్తిచేసిన వారితోనే పాఠాలు చెప్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. చదువులో క్వాలిటీ పెంచేందుకు తీసుకునే ఈ చర్యలను వచ్చే విద్యాసంవత్సరం నుంచి కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. దీంట్లో భాగంగా సర్కారు బడుల్లోని టీచర్లతో పాటు ప్రైవేటు స్కూల్స్‌ టీచర్ల వివరాలూ సేకరించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది.

రాష్ర్టంలో మొత్తం 42వేల పాఠశాలలుండగా, వాటిలో 25వేల స్కూళ్లు సర్కార్‌వి కాగా, మరో12వేల వరకూ ప్రైవేటు బడులున్నాయి. మిగిలినవి గురుకులాలు, కేంద్రప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలలు. వీటన్నింటిలో రెండున్నర లక్షల మంది టీచర్లు పనిచేస్తున్నారు. సర్కారు బడుల్లో బోధించే టీచర్లంతా శిక్షణ (బీఈడీ, డీఈడీ, పండిట్స్‌…) తీసుకున్న వారే ఉండగా, ప్రైవేటు బడుల్లో మాత్రం సగానికి పైగా అన్‌ట్రైన్డ్‌ టీచర్లున్నారు. విద్యాహక్కుచట్టం ప్రకారం టీచర్‌ ట్రైనింగ్‌ తీసుకుని, టెట్‌క్వాలిఫై అయిన వారినే టీచర్లుగా కొనసాగించాలని ఇప్పటికే కేంద్రం రాష్ర్టాలకు ఆదేశాలు జారీచేసింది. దీంట్లో భాగంగా రాష్ర్ట ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. బడుల్లోని టీచర్ల వివరాలను సేకరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీంట్లో వారి స్టడీవివరాలూ తీసుకోనుంది. ఇప్పటికే విద్యాశాఖ రూపొందించిన వెబ్‌సైట్‌లో ఈనెల 28 నుంచి టీచర్లు, సిబ్బంది వివరాలను సేకరించనుంది. నెలరోజుల గడువుతో వారి నుంచి వివరాలన్నీ రాబట్టాలని భావిస్తుంది.

 అనర్హులకు చెక్‌…

ప్రైవేటు బడుల్లో దాదాపు లక్ష మందికి పైగా టీచర్లు పనిచేస్తున్నారు. వీరిలో సగంమంది మాత్రమే బీఈడీ లేదా డీఈడీ పాటు టెట్‌ పాసైనవారున్నట్టు సమాచారం. గతంలో కేవలం 20వేల మంది మాత్రమే అర్హతలు లేని టీచర్లున్నారని విద్యాశాఖ లెక్కగట్టినా, అవన్నీ బోగల్‌ లెక్కలేనని ఆ శాఖ అధికారులే చెప్తున్నారు. వీరికి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రత్యేక శిక్షణ కోర్సులు పెట్టింది. దాని ద్వారా కొద్దిమాత్రమే శిక్షణ తీసుకున్నారు. అయితే కొన్ని కార్పొరేట్‌ స్కూళ్లు.. ఒక్కోటీచర్‌తో రెండు, మూడు బడుల్లో పాఠాలు చెప్పిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. ఇలాంటి వాళ్లకూ చెక్‌పెట్టేందుకు విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది. కనీస విద్యార్హతలు లేకుండా పాఠాలు బోధించడం ద్వారా విద్యాప్రమాణాలు తగ్గుతున్నాయని భావించి నివారణ చర్యలు ప్రారంభించింది. జూన్‌లో ప్రారంభం కానున్న కొత్త విద్యాసంవత్సరం నుంచి పాఠశాలల్లో అనర్హులు లేకుండా చర్యలు తీసుకోవాలని గట్టిపట్టుదలతో విద్యాశాఖాధికారులున్నారు. అయితే అది ఏమేరకు అమలవుతుందో వేచిచూడాల్సిందే.

Latest Updates