హైదరాబాద్‌‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కు నం.1 ర్యాంక్‌ దూరం

అర్హత ఉన్నా హైదరాబాద్‌‌ టెన్నిస్‌ ప్లేయర్‌ కు నం.1 ర్యాంక్‌ దూరం
ర్యాంకింగ్స్‌ ను తారుమారు చేశారని తండ్రి ఆరోపణ
ఆలిండియా టెన్నిస్‌ సంఘం తీరుపై సర్వత్రా విమర్శలు

కొంతకాలంగా వరుస విజయాలు సాధిస్తూ.. నేషనల్‌‌ లెవల్‌‌లో గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ యువ టెన్నిస్‌‌ ప్లేయర్‌‌ చాందిని శ్రీనివాసన్‌‌కు అన్యాయం జరిగింది. అండర్‌‌–14 బాలికల విభాగంలో ఆమెకు నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ రాకుండా ఆలిండియా టెన్నిస్‌ అసోసియేషన్​(ఐటా)లో కొందరు అడ్డు పడ్డారు. విజయాల పరంగా, పాయింట్ల పరంగా ముందున్న చాందినిని కాదని మరో ప్లేయర్‌‌కు టాప్‌‌ ర్యాంక్‌‌ దక్కేలా చేశారు. ఇందుకోసం రూల్స్‌‌ను అతిక్రమించారని, ర్యాంకింగ్‌‌ సిస్టమ్‌‌లో లొసుగులను ఉపయోగించుకున్నరని చాందిని తండ్రి శ్రీనివాసన్‌‌ ఆరోపించడం దేశ టెన్నిస్‌‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

టాప్‌‌ ర్యాంక్‌‌లో నిలిచే ప్లేయర్‌‌గా థాయ్‌‌లాండ్‌‌లో వారం రోజుల ట్రెయినింగ్‌‌ (ఈ నెల 23న మొదలవుతుంది) క్యాంప్‌‌నకు తన కూతురు సెలెక్ట్‌‌ కాకుండా కుట్ర చేశారని ఆయన ఆరోపించారు. ఆగస్టు 26 నాటికి ఐటా తాజాగా విడుదల చేసిన అండర్‌‌–14 విభాగంలో హర్యానా ప్లేయర్‌‌ పారి సింగ్‌‌ 811 పాయింట్లతో టాప్‌‌ ప్లేస్‌‌లో, చాందిని 798 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. ఇటీవల జరిగిన ఆసియా అండర్‌‌–14 టోర్నీ గెలిచినందుకు గాను పారి సింగ్‌‌ ఖాతాలో అదనంగా 50 పాయింట్లు చేర్చారు.

రూల్స్‌‌ ప్రకారం సెప్టెంబర్‌‌ 2వ తేదీ నాటికి ఇచ్చే లిస్ట్‌‌లోనే ఈ పాయింట్లు కలపాలి. కానీ, ఒక వారం ముందుగానే ఈ పాయింట్లు ఆమెకు ఇచ్చారు. వీటిని మినహాయిస్తే చాందిని 38 పాయింట్ల ముందంజతో నంబర్‌‌ వన్‌‌ అయి ఉండేది. అలాగే, కర్నాల్‌‌, చెన్నై టోర్నీలకు గైర్హాజరైనందుకు రూల్స్‌‌ ప్రకారం పారి సింగ్‌‌కు 15 పెనాల్టీ పాయింట్లు విధించాలి. కానీ, ఈ పాయింట్లు ఆమె ఖాతా నుంచి మినహాయించలేదు. ఇదంతా తన కూతురుకు నంబర్‌‌ వన్‌‌ ర్యాంక్‌‌ రాకుండా, థాయ్‌‌లాండ్‌‌లో ట్రైయినింగ్‌‌ తీసుకునే చాన్స్‌‌ ఇవ్వకూడదన్న కుట్రతోనే చేశారని శ్రీనివాసన్‌‌ ఆరోపిస్తున్నారు.

Latest Updates