సెంట్రల్​ పవర్​ బిల్లు వద్దు..రాష్ట్ర హక్కులకు భంగం

హైదరాబాద్, వెలుగు: సెంట్రల్​ పవర్​ బిల్లు 2020 ని వ్యతిరేకించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 5 న జరిగిన కేబినెట్​ భేటీలో ఈ బిల్లుపై చర్చించిన మంత్రులు, దీన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. త్వరలో దీనిని కేంద్రానికి పంపించనున్నారు. ఈ బిల్లు చట్టంగా మారితే రాష్ట్రాల హక్కులకు భంగం కలుగుతుందని సర్కారు అభిప్రాయపడుతోంది. విద్యుత్​రంగంలో ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం ఉండదని అనుమానం వ్యక్తం చేస్తోంది. కేబినెట్​ భేటీ తర్వాత సీఎం కేసీఆర్​ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతామని ప్రకటించారు. దీనిపై రెండు, మూడు రోజుల్లో మరోసారి మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పవర్​ బిల్లు 2020 పై అభిప్రాయాలు చెప్పాలంటూ కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. అయితే, లాక్​ డౌన్​ నేపథ్యంలో జవాబిచ్చేందుకు మరికొంత టైం కావాలని రాష్ట్రాలు కోరాయి. ఈ క్రమంలో జూన్​ 5 లోపు అభిప్రాయాలు చెప్పాలని కేంద్రం టైమిచ్చింది.

వద్దన్నా బిల్లు ఆగదు..

పవర్​ బిల్లుపై రాష్ట్రం అభ్యంతరం తెలిపినా ప్రయోజనం ఉండదని ప్రభుత్వానికి న్యాయశాఖ రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. విద్యుత్ ఉమ్మడి జాబితాలో ఉండడంతో రాష్ట్రాల అభిప్రాయాలను తప్పనిసరిగా కేంద్రం పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరంలేదు. సగానికంటే ఎక్కువ రాష్ట్రాలు ఒప్పుకుంటే ఈ బిల్లు చట్టంగా మారుతుందని ఆ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. కేంద్రం నుంచి వచ్చిన ముసాయిదా బిల్లుపై సీఎం కేసీఆర్​ సలహా అడగడంతో న్యాయ శాఖ ఈ రిపోర్టు అందించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ‘కేంద్రం తీసుకొచ్చే కొత్త చట్టాన్ని అమలు చేయాలా వద్దా అనే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఇస్తే బాగుంటుందని, లేదంటే బిల్లును రాష్ట్రంలో అమలు చేయక తప్పదు’ అని న్యాయ శాఖ వర్గాలు తెలిపాయి.

కాంగ్రెస్ తో కలిసి ఫైట్ చేస్తారా?

పవర్​ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడతామన్న సీఎం కేసీఆర్​ ప్రకటనపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. దీనిపై కాంగ్రెస్​ తో కలిసి పోరాడతారా లేక ఫెడరల్​ ఫ్రంట్​ ద్వారా రాష్ట్రాల హక్కుల కోసం ఫైట్​ చేస్తారా అనేదానిపై నేతలు చర్చించుకుంటున్నారు. కలిసి ఫైట్​ చేద్దామంటే కాంగ్రెస్​ ఒప్పుకుంటుందా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ‘ఉమ్మడి జాబితా అంశాలపై కేంద్రం చట్టం అమల్లోకి రావాలంటే సగం రాష్ట్రాల ఆమోదం కావాలి. మెజార్టీ  రాష్ట్రాలు బీజేపీ పాలనలో ఉన్నాయి. ఇలాంటి సమయంలో మనం వ్యతిరేకించినా కేంద్రానికి ఇబ్బంది ఉండదు’ అని ఓ టీఆర్ఎస్ నేత అన్నారు.

ప్రైవేటైజేషన్ కుట్ర: జగదీశ్​ రెడ్డి

విద్యుత్ ముసాయిదా చట్టాన్ని అడ్డుకుని తీరుతామని రాష్ట్ర విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలనే కుట్రలో భాగంగానే కేంద్రం ఈ బిల్లును తీసుకొచ్చిందని  చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బిల్లును ఆమోదించబోమని తేల్చిచెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేశారన్నారు. ఈ బిల్లుతో మొదట రైతులపై తర్వాత గృహ వినియోగదారులపై ఎఫెక్ట్ పడుతుందన్నారు. రాష్ట్రంలోని 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగిస్తారని వెల్లడించారు. 69 లక్షల గృహ వినియోగాదారులపై అదనపు భారం పడబోతుందన్నారు. దీన్ని ఏరకంగా ఆమోదిస్తారని  ప్రశ్నించారు. కీలక రంగాలను వదలి,  రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలోని విద్యుత్ రంగంపై పెత్తనంకోసం చట్ట సవరణలు తేవడం మానుకోవాలని కేంద్రానికి  హితవు పలికారు.

Latest Updates