
హైదరాబాద్, వెలుగు విద్యుత్ వినియోగంలో రికార్డ్ నమోదైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా సోమవారం రాష్ట్రంలో 12009 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. ఇదే ఇప్పటి వరకు అత్యధిక విద్యుత్ డిమాండ్ . 2018 మే 30 న 11, 707 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఇప్పటి వరకు రికార్డుగా నమోదై ఉంది. ఐతే ఆదివారం, సోమవారాల్లో విద్యుత్ డిమాండ్ పాత రికార్డులను తిరగరాశాయి. ఆదివారం 11, 783 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా…సోమవారం ఏకంగా 12009 మెగావాట్ల కరెంట్ కు డిమాండ్ రికార్డైంది. గతేడాది ఫిబ్రవరి 17 నాడు 8, 962 మెగావాట్ల డిమాండే ఉండే. గతేడాది కన్నా ఈ సారి 3047 మెగావాట్ల అదనంగా డిమాండ్ ఉండటం విశేషం.
కాళేశ్వరం లిఫ్టింగ్ కారణంగానే
ఎండకాలం మొదలుకాకముందే రికార్డు స్థాయిలో విద్యుత్ డిమాండ్ నమోదవటానికి కాళేశ్వరం లిఫ్ట్ కోసం పంప్ హౌజ్ లు నడిపిస్తుండటమే కారణం. మేడిగడ్డ,నందిమేడారం,లక్ష్మీపూర్ పంప్ హౌజ్ ల వద్ద నీటిని లిప్ట్ చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున కరెంట్ వినియోగం అవుతోంది. దీనికి తోడు ఈ ఏడాది యాసంగిలో వరి సాగు పెద్ద ఎత్తున పెరిగింది. సాధారణంగా సాగు 6.83లక్షల హెక్టార్లు కాగా ఈ ఏడాది 10.81 లక్షల హెక్టార్లు సాగవుతోంది. ఇందుకోసం 25 లక్షల బోర్లు, బావుల పంపుసెట్లు కోసం కరెండ్ వాడుడు పెరిగింది. ఉమ్మడి కరీంనగర్ పరిధిలో లిఫ్టింగ్ కొనసాగుతుండటంతో ఇక్కడే విద్యుత్ డిమాండ్ భారీగా పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది ఫిబ్రవరి 17న 772 మెగావాట్ల డిమాండ్ ఉండగా…అది ఈ ఏడాది అదే రోజుకు 2130 మెగావాట్ల కు చేరింది.
జీహెచ్ఎంసీ పరిధిలో పెరిగిన వినియోగం
జీహెచ్ఎంసీ పరిధిలోనూ కరెంట్ డిమాండ్ పెరిగింది. గతేడాది ఫిబ్రవరి 17 రోజున 1807 మెగావాట్ల డిమాండ్ ఉండగా…ఈ ఏడాది అదే రోజుకు 2130 మెగావాట్ల డిమాండ్ రికార్డైంది. 323 మెగావాట్ల డిమాండ్ పెరిగింది. గత వారం రోజులుగా కరెంట్ వినియోగం పెరుగుతోంది. ఎండకాలం ఎఫెక్ట్ ప్రారంభం కావటంతో గ్రేటర్ లో విద్యుత్ వినియోగం పెరిగింది. మార్చి నాటికి రాష్ట్రంలో 13 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.