ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే మనమే టాప్: కేటీఆర్

ఐటీ వృద్ధిలో జాతీయ సగటు కంటే తెలంగాణ రాష్ట్ర సగటు చాలా ఎక్కువగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఉప్పల్‌లో జరిగిన హైదరాబాద్ గ్రిడ్ డెవలప్‌మెంట్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడారు. హైదరాబాద్‌లో ఐటీ పురోగతి గత నాలుగేళ్లుగా బాగుందన్నారు. తూర్పువైపున ఉప్పల్ వైపు నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. నగరం లోపల ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అలాగే, ఎంఎంటీఎస్‌ను రాయగిరి వరకు పొడిగించే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.

హైదరాబాద్ విశ్వనగరంగా ఎదగాలంటే నగరం నలువైపులా సమానంగా అభివృద్ధి చెందాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌కు రోజూ పెద్ద ఎత్తున తరలివచ్చే వేలాదిమంది ప్రజలకు నాణ్యమైన, నివాస యోగ్యమైన స్థలాలు అందుబాటులో ఉండాలంటే నగరం ఒకవైపున మాత్రమే పెరగకూడదని, నలువైపులా పెరగాలనేది సీఎం ఆకాంక్ష అన్నారు. నగరంలో మౌలిక సదుపాయాలతోపాటు వ్యాపార, వాణిజ్య అవకాశాలు కూడా పెరగాల్సి ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Latest Updates