తెలంగాణ యువత గోస కనబడతలేదా?

ఎన్నో ఏండ్ల పోరాట ఫలితంగా సాధించుకున్న కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన కేసీఆర్ రాష్ట్ర ప్రజలందరికీ తండ్రి లాంటివాడు. అంతటి బాధ్యతాయుతమైన స్థానంలో తెలంగాణ బిడ్డలంతా కేసీఆర్ ను కూర్చోబెట్టిన్రు. కానీ తన బిడ్డలను ఒక తీరుగ, తెలంగాణ బిడ్డలను ఇంకో తీరుగ చూస్తరని ఎవరూ అనుకోలే. గడిచిన ఆరేండ్లలో తెలంగాణ ప్రజలపై మన ముఖ్యమంత్రి చూపిస్తున్నది సవతి తల్లి ప్రేమే. రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటంలో త్యాగాలు చేసిన యువతను అధికారంలోకి వచ్చాక పూర్తిగా మర్చిపోయినరు. మన రాష్ట్రం సాధించుకుని, మన ఉద్యోగాలు మనమే చేసుకుందామని చెప్పి ఇప్పుడు పట్టించుకోకుంటే ఎలా? ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఆరేండ్లవుతున్నా నియామకాలపై నజరేయకుంటె ఎట్ల? ఎంపీ ఎలక్షన్లలో ఓడిపోయి తన బిడ్డ బాధపడుతోందని.. ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టిన కేసీఆర్ కు పెద్ద చదువులు చదువుకుని కొలువుల్లేక కంటతడి పెట్టుకుంటున్న తెలంగాణ బిడ్డలు కనబడ్తలేరా?

నిధులు, నీళ్లు, నియామకాల కోసం సాగిన తెలంగాణ ఉద్యమ సారథిగా సీఎం పదవిలోకి వచ్చారు కేసీఆర్. ఉద్యమం టైంలో మన పక్కనుండి కష్టాలు కళ్లారా చూసినోడు పదవిలోకి వస్తే ఆ బాధలన్నీ తీరిపోతయన్న ఆశతో రాష్ట్ర ప్రజలంతా టీఆర్ఎస్ కే ఓట్లేసి గెలిపించిండ్రు. అధికారంలోకి వచ్చినంక ఇంటికో ఉద్యోగమిస్తనన్న మాట ఇప్పటికీ ప్రతి ఒక్క నిరుద్యోగి చెవిలో మార్మోగుతోంది. కానీ రెండోసారి మల్ల అధికారంలోకి వచ్చినంక కూడా నోటిఫికేషన్ల మాటెత్తుతలేరు. ఏండ్లకేండ్లు ఒక్కపూట బువ్వదిని, రెండు జతల బట్టలతోటి అవ్వ అయ్య కూలికిపోయి, తెచ్చినపైసలతో తిప్పలుబడి సదువుకొని నౌకర్ల కోసం కండ్లు కాయలు కాసేటట్టు ఎదురుచూస్తున్న బిడ్డలు, కొడుకులకు నౌకర్లియ్యాలే ఉపాధి చూపియ్యాలెననీ మీకు ఎందుకనిపిస్తలేదు. రాజ్యసభ ఎంపీగానో, ఎమ్మెల్సీగానో  చేయాలని నీ బిడ్డ పట్టుబట్టంగనే నౌకరిచ్చిన  మీ మనసుకు రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్ధుల ఆర్తనాదాలు ఎందుకు కనిపిస్తలేవు? వాళ్ల శవాల కాడ ఆ తల్లిదండ్రుల శోకాలు ఎందుకు యినపడ్తలేవు?

స్వరాష్ట్రంలోనూ మన బిడ్డల సావులా?

తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంల నాయకుల వల్లనే  మనకు నౌకిర్లొస్తలెవ్వని, స్వరాష్ట్రమొస్తే మీకందరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరుకుతయనీ మీరు చెప్పిన మాటలు విని, 1200 మంది విద్యార్ధులు ఆత్మ బలిదానాలు చేసుకొనిరి. తెలంగాణ వచ్చినంక ఆరేండ్లయినా నౌకర్లు దక్కని నిరుద్యోగ బిడ్డలు స్వరాష్ట్రంల గూడ సావబడ్తిరి. మీకు వాళ్ల గోడు వినిపిస్తలేదా? విద్యార్ధులు ఉద్యమంలోకి రావాలని పిలుపునిస్తే  ఆనాడు మీరు చెప్పింది నమ్మి కాకతీయ యూనివర్సిటీలో  పీజీ చేస్తూ , రాష్ట్రం కోసం కొట్లాడిన నర్సంపేట బిడ్డ రవినాయక్‌, ఆరేండ్లు నౌకరి కోసం ఎదురుచూసి చూసి భార్యాబిడ్డల్ని ఎట్ల సాదాల్నో తెల్వక ఆత్మహత్య చేసుకొని ప్రాణం తీసుకున్నడు. ఉస్మానియా యూనివర్సిటీల పీహెచ్ డీ చేసిన యాదాద్రి జిల్లా బిడ్డ నర్సింహ ఉరేసుకొని క్యాంపస్‌లనే సచ్చిపాయె. ఆరేండ్ల నుంచి నౌకర్ల కోసం వాళ్లు చేసిన ధర్నాలు, నిరసనలు, రోడ్ల మీద ఎర్రటెండల పోలీస్‌ లాఠీ దెబ్బలు, అరెస్టుల మధ్య వాళ్ల గోడు కనిపిస్తలేదా?  నిన్న గాక మొన్న ఎమ్మెస్సీ గోల్డ్ మెడలిస్ట్‌ గాంధీ, ఇంకా ఉద్యోగం రాక గోల్డ్ మెడల్ సాధించి గూడ ఇంక నౌకర్ రాలేదేరా అని అందరూ అడుగుతుంటే .. ఒక దిక్కు అవమానం మరో దిక్కు ఇల్లు గడవక, ఆత్మహత్య చేసుకుని బతుకు తెల్లార్చుకొనే. బీటెక్ చదివి నౌకర్‌ లేక, బతికే దారి లేక ఆత్మహత్య చేసుకున్న నవీన్‌ది ఇంకో ఉదంతం. కరోనా కారణంగా పెద్ద ఎత్తున నౌకర్లు కోల్పోయిన బడ్జెట్ విద్యాసంస్థల టీచర్లు, లెక్చరర్లది ఇంకో గోస. నెల జీతం రాకపోతే గంజి తాగే గతి కూడా లేక 12 మంది ఆత్మహత్యలు చేసుకొనిరి.

పాఠాలు చెప్పే పంతుళ్లు చెప్పులు అమ్ముకుంటుండ్రు. తెలంగాణ  ఉద్యమం పేరు చెప్పుకుని మీ కుటుంబం మొత్తం పదవులు, అధికారం, హోదా అన్నీ అనుభవించారు. కానీ ఉద్యమంలో ఎండనకా వాననకా కొట్లాడిన నిరుద్యోగ యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక, లక్షల సంఖ్యలో తెలంగాణంతా ఉన్నరు.  అయినా వాళ్లేమన్నా మీకు, మీ బిడ్డలకొస్తున్నట్లు లక్షల జీతాలడుగుతున్నరా? వాళ్ల చదువులకు సరిపోయే ఉద్యోగమియ్యండి అని మాత్రమే అడుగుతున్నరు. మీలాగా ప్రగతిభవన్‌లు, వందల ఎకరాలల్ల ఫామ్‌హౌస్ లు కట్టుకోవాలనుకుంటున్నరా?  బతుకు బండికి భరోసా ఉంటే చాలనుకుంటున్నరు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్స్ ఎందుకు పెడ్తలేరు

ఒక్క పెన్ స్ట్రోక్‌తో లక్ష ఉద్యోగాలిస్తానన్న మీరు అదే అసెంబ్లీలో  ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆశలు పెట్టుకోవద్దు. నిరుద్యోగ భృతి కూడా ఈ ఏడాదికి ఇయ్యం అంటిరి. ఏం? ఉద్యోగాల మీద ఎందుకు ఆశలు పెట్టుకోవద్దు? అది తెలంగాణ బిడ్డల హక్కు. రాష్ట్రం తెచ్చుకున్నది ఒక్క మీ కుటుంబం మొత్తానికి నౌకర్లు తెచ్చుకునేటందుకు కాదు.. యావత్ తెలంగాణ బిడ్డలకు నౌకర్లు తెచ్చుకునేటందుకు. నిజంగానే ఖాళీలు లేకుంటే అదో లెక్క. కానీ తెలంగాణ ఏర్పడే నాటికే అన్ని ప్రభుత్వ శాఖలకు కలిపి లక్ష పై చిలుకు ఖాళీలున్నయి. తెలంగాణొచ్చినంక రిటైర్‌మెంట్‌ల ద్వారా ఇంకో 60 వేలు పెరిగనయి. మీరిచ్చిన అత్తెసరు ఉద్యోగాలు తీసేసినా ఇంకా లక్ష పైగా ఖాళీలున్నయి. లేనిదల్లా మీకు ఖాళీలు భర్తీ చేయాలన్న చిత్తశుద్ది. ఉమ్మడి రాష్ట్రంల వివక్ష వల్ల తెలంగాణ బిడ్డలు ఆఫీసర్లయితలేరు.. చప్రాసి నౌకర్లకే పరిమితమైతున్రు అంటిరి. ఇయ్యాల ఆరేండ్లయినా.. సొంత రాష్ట్రంల ఆఫీసర్ నౌకర్లొచ్చే గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇయ్యకపోతిరి. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోగా.. ప్రభుత్వ నౌకర్లమీద ఆశ పెట్టుకోవద్దని  చెప్పిన మీరు, ప్రైవేట్ రంగంల  నౌకర్లు ఇప్పించే పని ఏదన్న చేస్తున్నరా? తెలంగాణా  బిడ్డలకు నౌకర్లొచ్చేటట్టు పరిశ్రమలల్ల లోకల్ రిజర్వేషన్‌ యాక్ట్ ఎందుకు అమలుచేస్తలేరు తెలంగాణాల? 90 % యువత పనిచేయడానికి సిద్దంగా ఉన్నా 63% యువతకు నైపుణ్యం లేదని ఒక సాకు చెప్పి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలిస్తలేవు. మరి ఆ నైపుణ్యం పెంచే స్కిల్ డెవలెప్‌మెంట్  ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టరు మీరు. అసలు మా నౌకర్లు మాక్కావాలెనని.. నీళ్లు , నిధులు, నియామకాలు ట్యాగ్‌లైన్‌తో సాధించుకున్న  తెలంగాణల ముఖ్యమంత్రిగా  బాధ్యతాయుత స్థానంల కూర్చుని ఆరేండ్లయినా.. ఉద్యోగ విధానాన్ని ఎందుకు ప్రకటించలేదు. ఇప్పటికైనా తెలంగాణ యువత కష్టాలను  పట్టించుకుని నోటిఫికేషన్లు ప్రకటించాలి.

నా బాధ్యత, నన్ను నమ్మండి అంటిరి.. ఆరేండ్లయిపాయె!

నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఇంటికో  ఉద్యోగమిస్త.. మీరంత నా బిడ్డలు మిమ్మల్ని కాపాడుకొనుడు నా బాధ్యత నన్ను నమ్మండి అంటే నమ్మి మీకు ఓట్లేస్తే మీరియ్యాల ఆ సీట్ల కూసింటిరి.  మరి ఇయ్యాల తెలంగాణ రాష్ట్రంల ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ఆరేళ్లుగా అల్లాడిపోతున్న నిరుద్యోగ బిడ్డల కోసం ఎందుకు మీ మనసు తండ్లాడతలేదు? వాళ్ల బతుకుల గురించి తండ్రి స్థానంల మీరు ఎందుకు ఆలోచిస్తలేరు? దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణిస్తే పోస్ట్ కాలిగుంటే ఎట్లని ఎలక్షన్ కమిషన్ కు జెప్పి ఆగమేఘాల మీద ఉప ఎన్నిక నిర్వహిస్తిరి.  ఆఖరికి వార్డ్ మెంబర్ పోస్ట్ గూడా మొత్తం రాష్ట్రంల ఏడన్నా ఖాళీగున్నదా ? మరి ప్రజలకు శాశ్వత ప్రాతిపదికన పరిపాలన అందించాల్సిన ప్రభుత్వ శాఖల్లో  ఖాళీగా ఉన్న  పోస్టులను మాత్రం ఎందుకు భర్తీ చేస్తలేదు? నిరుద్యోగులకు ఉపాధి కల్పించే ఆలోచన ఎందుకు చేయరు? ఏదన్న నామినేటెడ్ పోస్ట్‌ ఇంకో యేడాదికి ఖాళీ అయితదంటే  ఓ పదిమంది మీకు అప్లికేషన్లు పెట్టుకుని మీ కాళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటేనే ఆ స్థానాలు భర్తీ చేస్తరే ? మరి మీరు 2014 లో అధికారంలకి వచ్చినంక నిరుద్యోగులారా మీకోసం వన్‌టైమ్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకోండి అంటే 25 లక్షల మంది తెలంగాణ బిడ్డలు ఎకాఎకిన ఒక్కసారే రిజిస్ట్రేషన్ చేయించుకున్నరు కదా. మరి ఆ లెక్క టీఎస్పీఎస్సీ మీకియ్యలేదా? లేకుంటే చేసుకుంటే చేసుకున్నరు నాకేంది అనుకున్నరా? రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తండ్రి స్థానంలో ఉన్న మీకు ఆ తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ ఉపాది మార్గాలు చూపించాల్సిన బాధ్యత లేదా ? మీది నుంచి మేము మస్తు ఉద్యోగాలిచ్చినమని  మీరో లెక్క, మీ మంత్రులో లెక్క , టీఎస్పీఎస్సీ చైర్మన్ ఓ లెక్క, పొంతనలేని నివేదికలిస్తరు.

– రాణీ రుద్రమ రెడ్డి, వర్కింగ్​ ప్రెసిడెంట్​, యువ తెలంగాణ పార్టీ

For More News..

దుబ్బాక రిజల్ట్స్​ ప్రకటించొద్దు

మాట్లాడాలని పిలిచి గ్యాంగ్ రేప్, మర్డర్

రైతులు పొలాలకు పోలేకపోతున్నరు.. రోడ్లెయ్యండి

Latest Updates