తెలుగు స్టూడెంట్లకు న్యాయం చేయండి

ఏపీ భవన్​ పీఆర్సీకి తెలుగు స్టూడెంట్​ అసోసియేషన్​ వినతి

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలోని శ్రీవేంకటేశ్వర కళాశాల(ఎస్వీ)లో తెలుగు స్టూడెంట్లకు న్యాయం చేయాలని ఏపీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అభయ్ త్రిపాఠికి తెలుగు స్టూడెంట్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన పలువురు తెలుగు స్టూడెంట్లు కమిషనర్​ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఆ తర్వాత అసోసియేషన్ ప్రెసిడెంట్ వివేక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎస్వీలో శాశ్వత తెలుగు విభాగం ఏర్పాటుకు కృషి చేయాలన్నారు. 1962లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు స్టూడెంట్ల అవసరాల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ఎస్వీ కళాశాలను ఏర్పాటు చేసిందని, ఏటా వందలాది మంది తెలంగాణ, ఏపీ స్టూడెంట్లు ఉన్నత విద్య చదివేందుకు ఇందులో చేరుతున్నారన్నారు. గతేడాది నుంచి సంస్కృతం, తెలుగు స్టూడెంట్లకు 10 శాతంగా ఉన్న కోటాను మేనేజ్​మెంట్ ఎత్తేసిందని, దీంతో తెలుగు స్టూడెంట్లకు అన్యాయం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమ విజ్ఞప్తులపై కమిషనర్​ సానుకూలంగా స్పందించారని, 15 రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

Latest Updates