తీరు మారని టైటాన్స్‌! బెంగళూరు చేతిలో ఓటమి

పాట్నా:  ప్రొ కబడ్డీ లీగ్‌‌ ఏడో సీజన్‌‌లో తెలుగు టైటాన్స్‌‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది. చెత్త ఆటతో  తెలుగు జట్టు మరో ఓటమి మూటగట్టుకుంది. ఇంకోవైపు పవన్‌‌ కుమార్‌‌ షెరావత్‌‌ (17) మరోసారి సూపర్‌‌–10తో  చెలరేగడంతో బెంగళూరు బుల్స్‌‌ వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌‌లో బుల్స్‌‌ 47–26తో టైటాన్స్‌‌ను చిత్తుగా ఓడించింది. ఆరంభంలో కాసేపు మెరుగ్గా ఆడిన తెలుగు జట్టు తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది.  రైడింగ్‌‌లో సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌ (11 పాయింట్లు), డిఫెన్స్‌‌లో విశాల్‌‌ భరద్వాజ్‌‌ (6) రాణించినా.. మిగతా ప్లేయర్లు పూర్తిగా చేతులెత్తేశారు. రైడింగ్‌‌తో పాటు డిఫెన్స్‌‌లోనూ షెరావత్‌‌ విజృంభించాడు. అతనికి కెప్టెన్‌‌ రోహిత్‌‌ కుమార్‌‌ (8), మహేందర్‌‌ సింగ్‌‌ (7) సహకరించారు. ఫస్టాఫ్‌‌లో 21–14తో లీడ్‌‌ సాధించిన బుల్స్‌‌ సెకండాఫ్‌‌లో మరింతగా చెలరేగింది. ఓవరాల్‌‌గా బుల్స్‌‌ 21 రైడ్‌‌, 19 టాకిల్‌‌ పాయింట్లు రాబట్టగా.. టైటాన్స్‌‌ 16 రైడ్‌‌, పది టాకిల్‌‌ పాయింట్లకే పరిమితమైంది. రెండు సార్లు ఆలౌటై లీగ్‌‌లో ఐదోసారి ఓడింది.

Latest Updates