ప్రొ కబడ్డీ : కూతకు వేళాయె

రాహుల్‌‌ చౌదరి పాయింట్‌‌ తెస్తే చప్పట్లు కొట్టిన తెలుగు ఫ్యాన్స్‌‌ ఇకపై అతను ప్రత్యర్థికి దొరికొతే మురిసిపోవాలి. సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌ అతడిని టచ్‌‌ చేసి వస్తే ఆనందపడాలి. ప్రొ కబడ్డీ ఏడో సీజన్‌‌ కొత్త దనం ఎలా ఉండబోతుందో చెప్పేందుకు ఉదాహరణలివి. హైదరాబాద్‌‌ గచ్చిబౌలి ఇండోర్‌‌ స్టేడియంలో శనివారం మొదలయ్యే పీకేఎల్‌‌ ఏడో సీజన్‌‌ సర్వత్రా ఆసక్తి కలిగిస్తోంది. మొదటి మ్యాచ్‌‌లో యు ముంబాతో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌‌ తలపడనుంది. తర్వాతి పోరులో డిఫెండింగ్‌‌ చాంప్‌‌ బెంగళూరు బుల్స్‌‌తో పట్నా పైరేట్స్‌‌ తలపడనుంది. ఈ నాలుగు జట్లతో పాటు గుజరాత్‌‌ ఫార్చూన్‌‌ జెయింట్స్‌‌, తమిళ్‌‌ తలైవాస్‌‌, జైపూర్‌‌ పింక్‌‌ పాంథర్స్‌‌, పుణెరి పల్టన్‌‌, హర్యానా స్టీలర్స్‌‌, యూపీ యోధా, బెంగాల్​ వారియర్స్‌‌, దబాంగ్‌‌ ఢిల్లీ కె.సి. అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఈ నెల 26న  హైదరాబాద్‌‌ అంచె పోటీలు ముగుస్తాయి. 27న నుంచి ముంబై లెగ్‌‌ జరుగుతుంది. ఆ తర్వాత మిగతా ఫ్రాంచైజీల హోమ్‌‌గ్రౌండ్స్‌‌ అయిన పట్నా, అహ్మదాబాద్‌‌, చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌‌కతా, పుణె, జైపూర్‌‌, పంచకుల (హర్యానా), గ్రేటర్‌‌ నొయిడా (యూపీ)ల్లో లీగ్‌‌ జరుగుతుంది. అక్టోబర్‌‌ 14న ప్లేఆఫ్స్‌‌ మొదలవుతాయి. అదే 16న సెమీఫైనల్స్‌‌, 19న జరిగే ఫైనల్‌‌తో లీగ్‌‌ ముగుస్తుంది. ఈ సీజన్‌‌లో మ్యాచ్‌‌లు అరగంట ముందుగా రాత్రి 7.30కే మొదలవుతాయి.

టైటాన్స్‌‌ టైటిల్‌‌ పట్టేనా!

లీగ్‌‌కే వన్నె తచ్చిన రాహుల్‌‌ చౌదరి వంటి టాలెంటెడ్‌‌ ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ లీగ్‌‌లో తెలుగు టైటాన్స్‌‌ ఇప్పటిదాకా టైటిల్‌‌ నెగ్గలేకపోయింది. ఆరు సీజన్లలో రెండుసార్లు ప్లే ఆఫ్స్‌‌ చేరడమే ఆ టీమ్‌‌ బెస్ట్‌‌ పెర్ఫామెన్స్‌‌. స్టార్‌‌ ప్లేయర్‌‌ రాహుల్‌‌ చౌదరిపై అతిగా ఆధారపడడం కొన్నిసార్లు ఆ జట్టును దెబ్బతీసింది.దాంతో, ఫ్రాంచైజీ ఈ సారి జట్టును పూర్తిగా ప్రక్షాళన చేసింది. రాహుల్‌‌ చౌదరితో ఆరు సీజన్ల అనుబంధాన్ని తెంచుకుంది. అతని ప్లేస్‌‌లో గత సీజన్‌‌ స్టార్‌‌ రైడర్‌‌ సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌ను తీసుకున్న టైటాన్స్‌‌ ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగుతోంది. ఈ సారి సిద్దార్థ్‌‌ దేశాయ్‌‌పై భారీ అంచనాలు పెట్టుకుంది. లాస్ట్‌‌ సీజన్‌‌లో దేశాయ్‌‌ ఆట చూసిన తర్వాత టీమ్‌‌లో అతను కీలకం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల ప్రత్యర్థి జట్లు అతడిని టార్గెట్‌‌ చేయడం ఖాయం. ఒకవేళ అతను విఫలమైతే మిగతా రైడర్లు ఏ మేరకు బాధ్యత తీసుకుంటారన్నది ఆసక్తికరం. రైడింగ్‌‌లో సిద్దార్థ్‌‌ అన్న సూరజ్‌‌ దేశాయ్‌‌, రాకేశ్‌‌ గౌడ ఏ మేరకు సహకారం అందిస్తారో చూడాలి. తెలుగు రైడర్లు మల్లికార్జున్‌‌, శివగణేశ్‌‌ రెడ్డికి తుది జట్టులో ఇప్పుడే చాన్స్‌‌ రావడం కష్టమే. ఈసారి డిఫెన్స్‌‌పై కూడా మేనేజ్‌‌మెంట్‌‌ దృష్టి సారించింది. కెప్టెన్‌‌ అబొజర్‌‌ మిఘాని, మాజీ సారథి విశాల్‌‌ భరద్వాజ్‌‌పై అందరి దృష్టి ఉంది. గత సీజన్‌‌లో అబొజర్‌‌, విశాల్‌‌ ద్వయం రాణించింది. అబొజర్‌‌తో మాట్లాడేందుకు విశాల్‌‌ పర్షియన్‌‌ పదాలు కూడా నేర్చుకున్నాడు. ఇక, వెటరన్‌‌ అరుణ్‌‌ రాకతో డిఫెన్స్‌‌కు మరింత బలం చేకూరినట్టే. వీరితో పాటు మదానె, ఇరాన్‌‌కు చెందిన ఆల్‌‌రౌండర్‌‌ ఫర్హాద్‌‌పై కూడా అంచనాలు ఉన్నాయి. ఆసియా క్రీడల్లో ఇరాన్‌‌కు తొలి స్వర్ణం రావడంలో కీలక పాత్ర పోషించిన గొలమ్‌‌ రెజా కోచింగ్‌‌ టైటాన్స్‌‌ రాతను మారుస్తుందో లేదో చూడాలి.

కొత్త కొత్తగా..

ఈ సారి ఫార్మాట్‌‌లో మార్పులు చేశారు. జోన్స్‌‌ స్థానంలో డబుల్‌‌ రౌండ్‌‌ రాబిన్‌‌ పద్ధతి తెచ్చారు. కొత్త సీజన్‌‌లో ఒక జట్టు మిగతా 11 జట్లతో రెండేసి మ్యాచ్‌‌లను ఆడనుంది. గతంలో మూడుసార్లు తలపడేది. అలాగే, హోమ్‌‌ లెగ్‌‌లో ఆతిథ్య జట్టు ఆరు మ్యాచ్‌‌లు కాకుండా నాలుగు మ్యాచ్‌‌ల్లోనే ఆడనుంది. లీగ్‌‌ దశ ముగిశాక పాయింట్ల పట్టికలో తొలి ఆరు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌‌కు అర్హత సాధిస్తాయి. ఇక, వేలంలో చాలా మంది ఆటగాళ్లు పాత జట్లను వదలి కొత్త జట్లలోకి చేరారు. అలాగే, చాలా జట్లకు కొత్త కెప్టెన్లు, కోచ్‌‌లు వచ్చారు. తెలుగు టైటాన్స్‌‌ను అబొజర్‌‌ మిహాని కెప్టెన్‌‌, గొలమ్‌‌ రెజా కోచ్‌‌గా ఎంపికయ్యారు. బెంగాల్​కు మణిందర్‌‌ సింగ్‌‌, ఢిల్లీకి జోగిందర్‌‌ నర్వాల్‌‌, గుజరాత్‌‌కు సునీల్‌‌ కుమార్‌‌, యూపీ యోధాకు నితీశ్‌‌ కుమార్‌‌ నాయకత్వం వహించనున్నారు.

Latest Updates