యాదాద్రి గర్భగుడి తలుపులకు బంగారం తాపడం

యాదాద్రిలో సీఎం కేసీఆర్ పర్యటన ముగిసింది. మధ్యాహ్నం 12:15 గంటలకు మొదలైన సీఎం పర్యటన సాయంత్రం 5:45 గంటల వరకు దాదాపు ఐదున్నర గంటల పాటు కొనసాగింది. యాదాద్రిలో జరుగుతున్న ఆలయ అభివృద్ధి పనుల పట్ల సీఎం కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు, ఈవో గీతారెడ్డి ఉమ్మడిగా తెలిపారు. మొత్తం ఆలయ పనులను పరిశీలించిన సీఎం గర్భగుడి తలుపులకు బంగారం తాపడం చేపిస్తామని, దానికోసం దేవస్థానం వద్ద ఉన్న 16 కిలోల బంగారం కాకుండా ఇంకా రూ.46 కోట్లు అవసరమవుతుందని, దానిని వెంటనే రిలీజ్ చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారని విప్ సునీత తెలిపారు. అంతేకాకుండా ఆండాళ్, ఆళ్వార్ ఆలయాల తలుపులకు వెండి తాపడాలు చేయించాలని సీఎం ఆదేశించారన్నారు ఈవో గీతారెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు. గండిచెరువును స్వామివారి తెప్పోత్సవం‌ కోసం ఉపయోగించనున్న నేపథ్యంలో, గండిచెరువును అతి పవిత్రంగా చూసుకోవాలని, ఏడాదిలో 365 రోజులు శుభ్రమైన నీళ్లు ఉండేలా చూసుకోవాలని సీఎం ఆదేశించారని తెలిపారు కిషన్ రావు.

స్వామివారిని దర్శనం చేసుకునే భక్తుడు గుడి చుట్టూ తిరిగి దర్శనం‌ చేసుకునేలా క్యూలైన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఈఓ చెప్పారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో పర్యటించారు సీఎం కేసీఆర్. మొదట బాలాలయంలో యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొండపైన పునర్నిర్మితమవుతున్న నరసింహుడి ప్రధానాలయం, శివాలయం సహా అన్ని కట్టడాలను పరిశీలించారు. పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తిరిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్, గండి చెరువు, కల్యాణ కట్ట, రింగ్ రోడ్, యాగస్థలంను కాలినడకన తిరిగి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు కేసీఆర్.

మధ్యాహ్నం 12:15 గంటలకు యాదాద్రి చేరుకున్న సీఎం, స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. మధ్యాహ్నం 12:25 నుంచి 2:30 గంటల వరకు ప్రధానాలయం, శివాలయం పనులు పరిశీలించారు. లంచ్ అనంతరం మ.3:15 నుంచి 4:15 వరకు గండి చెరువు, కల్యాణ కట్ట పనులు పరిశీలించారు. అనంతరం కొండ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు పనులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వీఐపీల వసతి కోసం నిర్మిస్తున్న ప్రెసిడెన్షియల్ సూట్ పనులను పరిశీలించారు. మరోవైపు కొండ చుట్టూ నిర్మిస్తున్న గిరిప్రదక్షణ, రీజినల్ రింగ్ రోడ్డు పనుల పురోగతిని పరిశీలించారు. అనంతరం వైటీడీఏ పరిధిలో జరుగుతున్న మొత్తం పనుల పురోగతిపై హరిత హోటల్ లో గంట పాటు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సాయంత్రం 5:45 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ తిరుగుప్రయాణమయ్యారు సీఎం కేసీఆర్.

Latest Updates