తొలి రోజే గుడి, మసీదులు కూల్చేశారు

  • ఆలస్యంగా విషయం వెలుగులోకి..
  • హిందూ, ముస్లిం సంస్థల ఆందోళన
  • విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
  • బిల్డింగ్స్ కూల్చే టైంలో శిథిలాలు
    ప్రార్థన మందిరాలపై పడ్డాయని వివరణ
  • ప్రభుత్వ ఖర్చుతో మళ్లీ నిర్మిస్తామని హామీ

హైదరాబాద్, వెలుగుసెక్రటేరియట్ కూల్చివేతల్లో భాగంగా ప్రభుత్వం ఎన్నో ఏండ్ల కిందటి ప్రార్థన మందిరాలను కూడా పడగొట్టింది. నల్లపోచమ్మ టెంపుల్​ను, రెండు మసీదులను ధ్వంసం చేసింది. గుట్టుచప్పుడు కాకుండా జరిగిన ఈ వ్యవహారం ఆలస్యంగా బయటికి వచ్చింది. విషయం తెలుసుకున్న హిందూ, ముస్లిం సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరుపై మండిపడ్డాయి. తమ మనోభావాలను దెబ్బతీశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చ జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుందని భావించిన సీఎం కేసీఆర్.. వెంటనే ప్రకటన విడుదల చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సెక్రటేరియట్ లోని ఇంకింత ఎక్కువ స్థలంలో ప్రార్థన మందిరాలను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు శుక్రవారం కూడా కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది.

మొదటి రోజే..

ఈ నెల 7వ తేదీ అర్ధరాత్రి నుంచి సెక్రటేరియట్ బిల్డింగ్స్ కూల్చివేత జరుగుతోంది. రహస్యంగా సాగుతున్న ఈ ప్రక్రియను సీఎస్, డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. 4 రోజులుగా సెక్రటేరియట్ చుట్టూ కిలోమీటర్ పరిధిలోని పరిసరాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు.2 వేల మంది పోలీసులు పహారా మధ్య కూల్చివేత నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మొదటి రోజు కూల్చివేతల్లో భాగంగా జీ, సీ, డీ బ్లాక్ ల పక్కనే ఉన్న రెండు మసీదులు, నల్లపోచమ్మ టెంపుల్ ధ్వంసమయ్యాయి. ఈ విషయం శుక్రవారం ఆలస్యంగా బయటికి పొక్కింది.

పండుగల సమయాల్లో సందడి

పండుగల సమయాల్లో మసీదులు, నల్లపోచమ్మ టెంపుల్ పరిసరాలు సందడిగా కనిపించేవి. రంజాన్ నెలలో మసీదుల్లో ఉద్యోగులు ప్రత్యేక ప్రార్థనలు చేసే వారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంప్లాయిస్ నల్లపోచమ్మ టెంపుల్ లో బోనాలు, బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించేవారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా కొనసాగిస్తున్నారు.

కొత్తగా నిర్మిస్తాం: సీఎం కేసీఆర్

సెక్రటేరియట్ కూల్చివేత సందర్భంగా అక్కడున్న దేవాలయం, మసీదులకు నష్టం కలగడంపై సీఎం కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఇది అనుకోకుకుండా జరిగిన ఘటన అని, అందరూ సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. శుక్రవారం ఈ మేరకు సీఎం ప్రకటన విడుదల చేశారు. బిల్డింగ్స్ ను కూల్చే క్రమంలో కొన్ని శిథిలాలు ప్రార్థన మందిరాలపై పడ్డాయని, దీంతో కొంత నష్టం జరిగిందని, దీనిపై చింతిస్తున్నానని తెలిపారు. సెక్రటేరియట్ స్థలంలోనే ఇప్పుడున్న దానికన్నా ఎక్కువ విస్తీర్ణంలో, విశాలంగా దేవాలయం, మసీదులను పూర్తి ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ప్రకటించారు. పాత భవనాల స్థానంలో కొత్తవి నిర్మించడమే ప్రభుత్వ ఉద్దేశం తప్ప, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగించడం కాదన్నారు. దేవాలయం, మసీదుల నిర్వాహకులతో సమావేశమవుతానని తెలిపారు. కొత్త సెక్రటేరియట్ భవన సముదాయంతోపాటుగా ప్రార్థనా మందిరాలను నిర్మించి ఇస్తామన్నారు. తెలంగాణ సెక్యులర్ రాష్ట్రమని, లౌకిక స్పూర్తిని కొనసాగిస్తామని ప్రకటించారు.

గోదావరి నీళ్లను మళ్లించే ఏపీ ప్రాజెక్టులను ఆపండి

Latest Updates