
డిపోలోని అధికారులకు దొంగ లెక్కలు చూపెడుతూ ఓ తాత్కాలిక కండక్టర్ టిక్కెట్ల ద్వారా వచ్చిన సొమ్మును జేబులో వేసుకుంటున్నాడు. డిపో అధికారులు గట్టిగా నిలదీయడంతో ఈ విషయం బయటపడింది. ఖమ్మం జిల్లా మధిర డిపోలో తాత్కాలిక కండక్టర్ పని చేస్తున్న శేఖర్ అనే వ్యక్తి ఈ నిర్వాకానికి పాల్పడ్డాడు. ఎప్పటిలాగానే డ్యూటీ ముగిసిన తర్వాత డిపోలో డబ్బు కడుతుండగా.. జేబులోనుంచి అదనపు టికెట్లు కిందపడ్డాయి. అది గమనించిన అధికారులు గట్టిగా నిలదీశారు. ఆ టిక్కెట్లు నకిలీవనీ, అవి ప్రయాణికులకు టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఈ నకిలీ టికెట్లను అంటగట్టి వారిచ్చిన డబ్బును స్వాహా చేస్తున్నట్టు తెలిసింది. ఇలా ఇప్పటివరకూ రూ.17 వేలు ప్రయాణికుల దగ్గర నుంచి దోచుకున్నట్టు వెల్లడైంది. దీంతో డిపో అధికారులు శేఖర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమ్మె కారణంగా బస్సుల్లేక జనం నానా ఇబ్బందులు పడుతుంటే.. తాత్కాలికి సిబ్బంది మాత్రం ఇలా అడ్డదారిలో డబ్బు దోచుకుంటున్నారు.