విత్​డ్రా చేసుకుంటరా, లేదా?..కేండిడేట్లకు ప్రలోభాలు, బెదిరింపులు

 • కేండిడేట్లకు ప్రలోభాలు, కిడ్నాపులు, బెదిరింపులు
 • ఏకగ్రీవాల పేరుతో టీఆర్​ఎస్​ నేతల ఒత్తిళ్లు
 • బలవంతంగా బరిలోంచి తప్పిస్తున్న లీడర్లు
 • పాతకేసులు తిరగదోడుతూ పోలీసులతో హెచ్చరికలు!
 • చెన్నూర్​లో ఎమ్మెల్యే సుమన్​ అనుచరుల హల్​చల్
 • పరకాలలో బీజేపీ అభ్యర్థిని ఎత్తుకెళ్లే యత్నం

‘రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లను గెలుచుకుని రండి’అన్న ముఖ్యమంత్రి కేసీఆర్​ మాటలను చాలెంజ్​గా తీసుకున్న టీఆర్ఎస్ లీడర్లు జిల్లాల్లో రెచ్చిపోతున్నారు. ఎన్నికల స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రతిపక్ష నేతలను బలవంతంగా బరిలోంచి తప్పిస్తున్నారు. ఇందుకోసం సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగిస్తున్నారు. ఏకగ్రీవాల పేరిట కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్లు, ఇండిపెండెంట్లపై ముందుగా ప్రలోభాల వల విసురుతున్నారు. వాటికి పడలేదంటే బెదిరింపులకు దిగుతున్నారు. పాత కేసులను తిరగదోడుతూ పోలీసులతోనూ హెచ్చరికలు పంపిస్తున్నారు. నామినేషన్ల విత్​డ్రాకు మంగళవారం చివరిరోజు కావడంతో సోమవారం పలు మున్సిపాల్టీలు, కార్పొరేషన్లలో పెద్ద సంఖ్యలో జరిగిన విత్​డ్రాల వెనక అధికార పార్టీ లీడర్ల హస్తం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 • వరంగల్​ రూరల్​ జిల్లా పరకాల మున్సిపాల్టీలో టీఆర్ఎస్​ లీడర్లు వివిధ పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులపై అనేక రూపాల్లో ఒత్తిడి తెచ్చి విత్​డ్రా చేయించారు. ఈ క్రమంలో వారిని ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారం 22వ వార్డు బీజేపీ అభ్యర్థి కొలనుపాక భద్రయ్యను టీఆర్ఎస్​ నేతలు ఎత్తుకెళ్లేందుకు విఫలయత్నం చేశారు. భద్రయ్య తప్పించుకోవడంతో ఆయన ఇంటికి చేరుకొని నానా హంగామా చేశారు. బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జ్ విజయ్​చందర్​రెడ్డి భద్రయ్య ఇంటికి రాగా, ఆయనతో టీఆర్ఎస్ లీడర్లు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.        మంచిర్యాల జిల్లా చెన్నూర్​ మున్సిపాల్టీలో లోకల్​ ఎమ్మెల్యే బాల్క సుమన్​ అనుచరులు ప్రతిపక్ష అభ్యర్థులకు చుక్కలు చూపెడుతున్నారు.
 • బెదిరింపులకు తట్టుకోలేక 10, 11, 13, 14 వార్డులకు చెందిన బీజేపీ, కాంగ్రెస్​ క్యాండిడేట్లు విత్​డ్రా చేసుకున్నారు. దీంతో ఆ వార్డుల్లో టీఆర్ఎస్​ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. ఈ ఒక్క మున్సిపాల్టీ పరిధిలోనే సోమవారం ఏకంగా 22 మంది నామినేషన్లను విత్​డ్రా చేసుకున్నారు. వీరిలో టీఆర్ఎస్​ నుంచి ఎనిమిది మంది ఉండగా, కాంగ్రెస్​ నుంచి ముగ్గురు, బీజేపీ నుంచి నలుగురు, ఎంఐఎం నుంచి ఇద్దరితోపాటు ఐదుగురు ఇండిపెండెంట్లు ఉన్నారు. 18వ వార్డుకు చెందిన బీజేపీ అభ్యర్థి శనివారమే పోటీ నుంచి తప్పుకున్నారు. ‘మీకు ఏం కావాలన్నా ఇప్పిస్తాం.. అవసరమైతే ఎమ్మెల్యేతో మాట్లాడిస్తాం.. ఎట్టిపరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాల్సిందే.. లేదంటే భవిష్యత్​లో తీవ్ర పరిణామాలు ఉంటాయి’అని టీఆర్ఎస్​ నేతలు తమ క్యాండిడేట్లను బెదిరిస్తున్నారని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగునూరి వెంకటేశ్వర్​గౌడ్​ ఆరోపించారు.
 • నిర్మల్‍ మున్సిపాల్టీలోని 33వ వార్డులో టీఆర్‍ఎస్‍ అభ్యర్థి గండ్రత్​ ఈశ్వర్‍ ఏకగ్రీవమయ్యారు. చైర్మన్​ రేసులో ఉన్న ఈయన ఏకగ్రీవం వెనుక భారీ తతంగమే జరిగినట్లు తెలుస్తోంది. ఇక్కడ పోటీ చేస్తున్న కాంగ్రెస్‍ అభ్యర్థి భూపతి సోమవారం నామినేషన్​ విత్​డ్రా చేసుకోవడంతో టీఆర్ఎస్ అభ్యర్థి ఈశ్వర్​ గెలుపు ఖాయమైంది. ఇక్కడ ప్రలోభాలు పనిచేశాయనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
 • మహబూబ్ నగర్ జిల్లా కోస్గి మున్సిపాల్టీలో కాంగ్రెస్​లోని బలమైన అభ్యర్థులపై టీఆర్ఎస్ వల విసురుతోంది. ఇందులో భాగంగా సోమవారం ఒక క్యాండిడేట్​ కాంగ్రెస్​ నుంచి అధికార పార్టీలో చేరాడు. ఇవాళ మరికొందరు వస్తారని భావిస్తున్నారు.
 • నల్గొండ జిల్లా మిర్యాలగూడలో టీఆర్ఎస్​ లీడర్లు సోమవారం ఇద్దరు కాంగ్రెస్​ క్యాండేట్లను తమ పార్టీలోకి లాగారు. చిట్యాలలో కాంగ్రెస్​ అభ్యర్థిని ప్రలోభపెట్టగా, ఆయన పోటీ నుంచి తప్పుకుని టీఆర్ఎస్​కు మద్దతు పలికారు. దీంతో ఆ వార్డు ఏకగ్రీవమైంది.
 • జగిత్యాల జిల్లా మెట్‌‌పల్లిలో19వ వార్డులో టీఆర్ఎస్ చైర్ పర్సన్ అభ్యర్థి రణవేని సుజాత ఏకగ్రీవమయ్యారు. టీఆర్ఎస్​ రెబల్స్ ఏశాల సుశీల, ఏశాల ప్రియాంక, బీజేపీ అభ్యర్థి ఏశవేని రాజవ్వ పోటీ నుంచి తప్పుకున్నారు. వీరిని తప్పించడం వెనుక ప్రలోభాలు పనిచేశాయనే ఆరోపణలున్నాయి.

నిజామాబాద్​ జిల్లా భీమ్‌‌‌‌గల్‌‌‌‌ పట్టణంలోని 7వ వార్డుకు నామినేషన్‌‌‌‌ వేసిన ముగ్గురు నామినేషన్లను విత్‌‌‌‌డ్రా చేసుకోవడంతో టీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌కు చెందిన ఖైరున్నీస బేగం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మినిస్టర్​ ప్రశాంత్​రెడ్డి స్పెషల్​ ఫోకస్​ పెట్టడంతో ఇక్కడ ఇప్పటివరకు ఏకంగా 94 మంది విత్‌‌‌‌డ్రా చేసుకున్నారు. వీరిలో టీఆర్ఎస్​ రెబల్స్​తోపాటు కాంగ్రెస్​, బీజేపీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లు ఉన్నారు.

కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లోని రెండో వార్డు ఏకగ్రీవమైంది. టీఆర్ఎస్​ తరఫున బర్మావత్​ యాదగిరి నాయక్, టీడీపీ నుంచి భిక్షపతి, కాంగ్రెస్​ నుంచి వెంకటస్వామి, సురేశ్​ నామినేషన్లు వేశారు. సోమవారం భిక్షపతి, వెంకటస్వామి, సురేశ్​ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో యాదగిరి ఏకగ్రీవమయ్యారు.

Latest Updates