CNG బంకుల్లో మోసం: ప్రతి బిల్లుపై రూ.10 ఎక్స్ ట్రా

ten-rupees-extra-charge-in-hyderabad-cng-bunks

హైదరాబాద్ నగరంలో కంప్రెస్డ్ ​నేచురల్ గ్యాస్  (సీఎన్ జీ) అమ్మకాల్లో బంకుల యజమానులు దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లను లక్ష్యంగా చేసుకొని ప్రతి బిల్లుపై  రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేంటని అడిగితే దబాయిస్తున్నారు. తమకు రవాణా ఖర్చులు ఉన్నాయంటూ పది పాయలు ఎక్కువ చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. కిలో సీఎన్ జీ అయినా, నాలుగు కిలోల సీఎన్ జీ అయినా ఎంత కొట్టించినా సరే పది రూపాయలు మాత్రం అదనంగా ఇవ్వాల్సిందే.  అయితే ఇది ఒక్క ఆటో డ్రైవర్ల నుంచే వసూలు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

సిటీలో దాదాపు 2 లక్షలకు పైగా కార్లలో సీఎన్ జీ వాడుతున్నారు. వీరి వద్ద మాత్రం ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయటం లేదని ఆటో డ్రైవర్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో దాదాపు 30 వరకు సీఎన్ జీ బంకులు ఉన్నాయి.  సికింద్రాబాద్, అబిడ్స్, ఉప్పల్, సుచిత్ర, చాదర్ ఘాట్, బాలానగర్,  బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, జూపార్క్, పురానా ఫూల్, కుత్బుల్లాపూర్, లింగంపల్లి  వద్ద ఉన్న బంకుల్లో ఈ దోపీడీ పర్వం కొనసాగుతోంది. కొన్ని నెలలుగా బంకుల యాజమాన్యాలు ఈ విధంగా దోపిడీలకు పాల్పడుతున్నా తూనికలు, కొలతల అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు వచ్చినా బంకుల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవటంలో విఫలమవుతున్నారు. తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. దీంతో ఇలా దాడులు చేసిన వారం రోజులకు మళ్లీ ఈ అదనపు వసూళ్లకు బంకుల యాజమాన్యాలు పాల్పడుతున్నాయి.

డిమాండ్ ను ఆసరాగా చేసుకొని వసూళ్లు
పెట్రోల్, డీజిల్ ధరల భారం పెరుగుతుండటంతో ఇటీవల కాలంలో సీఎన్ జీ కి  భారీగా డిమాండ్ పెరుగుతోంది. కాలుష్యం తక్కువగా ఉండటం, మైలేజీ ఎక్కువగా ఇస్తుండటం, ధర తక్కువగా ఉండటంతో వాహనదారులు సీఎన్ జీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో దాదాపు లక్షకు పైగా ఆటోలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా ప్రస్తుతం సీఎన్ జీ తోనే నడుస్తున్నాయి. పైగా రెండు లక్షలకు పైగా కార్లు, ఇతర వాహనాలు సీఎన్ జీ వినియోగిస్తున్నాయి. కానీ అందుకు తగినంత సరఫరా మాత్రం ఉండటం లేదు. ఇదే బంకుల యాజమాన్యాలకు వరంగా మారింది. కొరతను సాకుగా చూపుతూ ప్రతి బిల్లుపై పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. గట్టిగా మాట్లాడిన వారికి స్టాక్ లేదని చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక ఆటో డ్రైవర్లు అదనపు ఛార్జీలు చెల్లించుకుంటున్నారు. ప్రతి బిల్లుపై పది రూపాయలు అదనం కావటంతో ఒకేసారి ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. నగరంలో ప్రస్తుతం 8 లక్షల కిలోల వరకు సీఎన్ జీ డిమాండ్ ఉంటే 6 లక్షల కిలోలే సప్లయ్ అవుతోంది. డిమాండ్ కు సరిపడా సీఎన్ జీ సప్లయ్ చేయాలని ఆటో డ్రైవర్లు కోరుతున్నారు.

కిలోకు 900 గ్రాములే..
పెట్రోల్, డీజిల్ బంకుల్లో జరిగిన విధంగానే సీఎన్ జీ బంకుల్లో మోసాలు జరుగుతున్నట్లు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ మాదిరిగా లిక్విడ్ రూపంలో సీఎన్ జీ కనిపించకపోవటంతో ట్యాంక్ ఫుల్ చేయించుకున్నప్పటికీ కాస్త తక్కువగానే నింపుతున్నారని ఆరోపిస్తున్నారు. పైగా కిలో  సీఎన్ జీ 900 గ్రాములు మాత్రమే వస్తుందంటున్నారు. ఇలా ట్యాంక్ ఫుల్ చేయించుకున్న ప్రతిసారీ అరకిలో వరకు సీఎన్ జీ నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తూనికలు, కొలతల అధికారులు కచ్చితంగా దీనిపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates