సర్కారు కరెంటు బిల్లుల బాకీ 10 వేల కోట్లు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, వివిధ ప్రభుత్వ విభాగాల కరెంటు బిల్లుల బకాయిలు సుమారు రూ.10 వేల కోట్లు దాటినట్లు అంచనా. ఇవన్నీ వన్​ టైం సెటిల్మెంట్​ చేస్తామని సీఎం కేసీఆర్​ చేసిన తాజా ప్రకటన విద్యుత్​ పంపిణీ సంస్థ(డిస్కమ్​)ల్లో ఆశలు చిగురింపజేస్తోంది. అదే సమయంలో రైతు బంధు, రుణమాఫీకి సరిపడా నిధుల్లేక తిప్పలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఇంత భారీ మొత్తం బాకీలను ఎలా తీరుస్తుందనే సందేహాలను వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని రెండు డిస్కంల పరిధిలో స్థానిక సంస్థలతోపాటు ప్రభుత్వ శాఖలు చెల్లించాల్సిన కరెంట్​ బిల్లులు ఏ ఏటికాయేడు పేరుకుపోతున్నాయి. సకాలంలో కరెంట్​ బిల్లు కట్టకపోతే బకాయిలపై ఏడాదికి 18 శాతం వడ్డీ కూడా పడుతుంది.

నిధుల బదిలీ ఏది?

ఉమ్మడి రాష్ట్రంలో 2004 లో వైఎస్సార్​ సీఎం అయ్యాక గ్రామ పంచాయతీల కరెంటు బిల్లులన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించారు. కానీ డిస్కమ్​లకు ప్రభుత్వం నిధులు బదిలీ చేయలేదు. స్థానిక సంస్థలకు సంబంధించిన బిల్లులను ఏ పద్దు నుంచి చెల్లించాలో తెలియని పరిస్థితి. ఫలితంగా అప్పట్నుంచి గ్రామ పంచాయతీల కరెంటు బిల్లుల చెల్లింపు గాడి తప్పింది. ఇప్పటివరకు దశాబ్దాలుగా బిల్లులు కట్టని గ్రామ పంచాయతీలు కూడా ఉన్నాయని విద్యుత్​ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు తమకు విద్యుత్​ బిల్లులకు నిధులు కేటాయించని కారణంగానే వాటిని చెల్లించలేకపోతున్నామని ప్రభుత్వ శాఖల అధికారులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో డిస్కమ్​లు కరెంట్​ కట్​ చేసి గవర్నమెంట్​ ఆఫీసులు, మున్సిపాలిటీల నుంచి నామమాత్రంగా బిల్లులు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ పేరుకుపోయిన బకాయిలను పూర్తిస్థాయిలో రాబట్టుకోలేకపోతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్​లోని సైదాబాద్​ ఎమ్మార్వో ఆఫీసు కరెంటు బిల్లుల బకాయి రూ.28,019కు చేరటంతో జులై 29న  డిస్కమ్​ అధికారులు కనెక్షన్  కట్​ చేశారు. దీంతో మంగళవారం ఎమ్మార్వో ఆఫీసు అంధకారమైంది. ఉద్యోగులతోపాటు వివిధ పనులకు అక్కడికి వచ్చిన ప్రజలు ఇబ్బందిపడ్డారు. స్థానిక ఏఈతో తహసీల్దార్​ మాట్లాడినప్పటికీ విద్యుత్​ సరఫరాను పునరుద్ధరించలేదు. చివరకు బకాయిల్లో రూ. 8 వేలు చెల్లించటంతో బుధవారం నుంచి సైదాబాద్​ ఎమ్మార్వో ఆఫీసుకు కరెంటు కనెక్షన్​ తిరిగి ఇచ్చారు. ఈ నేపథ్యంలో సీఎం చేసిన ప్రకటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.


Latest Updates