క్రికెట్ బ్యాట్ల తయారీ సంస్థపై సచిన్ పిటిషన్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ క్రికెట్ బ్యాట్ల తయారీ సంస్థ స్పార్టన్ స్పోర్ట్స్ ఇంటర్నేషనల్ పై సిడ్నీ కోర్టులో పిటిషన్ వేశాడు. స్పార్టన్ సంస్థ తన పేరు,  ఇమేజ్ తో పాటు స‌చిన్ బై స్పార్ట‌న్ అన్న ట్యాగ్‌లైన్‌తో ఆ కంపెనీ త‌న ఉత్ప‌త్తుల‌ను అమ్ముకున్న‌ది. తనతో స్పార్టన్ 2016లో ఒప్పందం కుదుర్చుకుందని, కానీ తనకు చెల్లించాల్సిన 14 కోట్ల రూపాయలను ఇంతవరకు చెల్లించకపోగా… తాను పంపిన మెసేజ్ లకు కూడా బదులు ఇవ్వలేదని సచిన్ తెలిపాడు.

ఇకపై తన పేరు, ఇమేజ్ వాడుకోవద్దని స్పార్టన్ కు స్పష్టం చేశానని, అయినప్పటికీ స్పార్టన్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వస్తోందని ఈ మాస్టర్ బ్లాస్టర్ చెప్పారు. స్పార్టన్ సంస్థ ప్రచారం కోసం లండన్, ముంబై వంటి నగరాల్లో పలు కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నానన్నాడు. దీనిపై విచారణ జరిపి తనకు రావాల్సిన పారితోషికాన్ని చెల్లించేలా చూడాలని సచిన్ తన పిటిషన్ లో కోరాడు.

గిల్బ‌ర్ట్ టోబిన్ న్యాయ సంస్థ కేసును డీల్ చేస్తోంది. ఈ ఏడాది జూన్ 5వ తేదీన కేసును ఫైల్ చేశారు.

Latest Updates