హేమంత్ మర్డర్‌‌తో.. లవ్‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌ చేసుకున్నోళ్లలో టెన్షన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ప్రణయ్, హేమంత్ ఇద్దరివీ పరువు, ప్రతిష్టల కోసం జరిగిన హత్యలే. మిర్యాలగూడ ప్రణయ్ ను కులం కాటేస్తే.. చందానగర్ హేమంత్ హత్యకు ఆర్థిక అసమానతలు కారణమయ్యాయి. ఈ రెండు హత్యలు ప్రేమజంటలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. శుక్రవారం జరిగిన హేమంత్ హత్యతో లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటలు పోలీసులు, మీడియాను ఆశ్రయిస్తున్నాయి. ఉన్నతాధికారుల సూచనలతో బాధితులకు కావాల్సిన సాయం అందించేందుకు స్థానిక పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న జంటలు

గ్రేటర్ పరిధిలోని పోలీస్ స్టేషన్లకు ప్రేమజంటలు క్యూ కడుతున్నయి. సోషల్ మీడియా ఫ్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై తమ సమాచారాన్ని లోకల్ పోలీసులకు అందిస్తున్నారు. రెండ్రోజులుగా చిలుకలగూడ, జీడిమెట్ల, బోయిన్‌‌‌‌పల్లి పోలీసులను ప్రేమ జంటలు ఆశ్రయించినట్లు తెలిసింది. ఎలాంటి సమస్యలున్నా 100కి కాల్‌‌‌‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

లాక్‌‌‌‌డౌన్‌‌‌‌లో పెండ్లి చేసుకున్నరు

కరీంనగర్‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ ప్రేమజంట లాక్‌‌‌‌డౌన్‌‌‌‌ టైమ్ లో పెండ్లి చేసుకుంది. రెండు కుటుంబాలకు దూరంగా హైదరాబాద్‌‌‌‌లో షెల్టర్ తీసుకుంటోంది. సిటీకి వచ్చిన తర్వాత క్షేమంగా ఉన్నట్లు మధ్యవర్తుల ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. పోలీసులతో కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఇలా ఈ ఒక్క జంటనే కాకుండా ఈ ఏడాది కాలంలో ప్రేమపెండ్లిల్లు చేసుకున్న జంటలు భయాందోళనకు గురవుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఎలాంటి బెదిరింపులు వచ్చినా లోకల్ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించాలని సూచిస్తున్నారు.

—హేమంత్​ది సర్కార్ హత్యే 

శేరిలింగంపల్లి, వెలుగు: హేమంత్ ని కిడ్నాప్ చేసి, హత్య చేసిన తీరును చూస్తే.. ఇది సర్కార్ హత్యగానే భావించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. పోలీసులకు అవంతి ఫిర్యాదు చేసినా సకాలంలో స్పందించకపోవడం వల్లే హేమంత్ హత్యకు గురయ్యాడన్నారు. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నిందితులకు బెయిల్ కోసం అడ్వకేట్లు సహకరించొద్దని కోరారు. హేమంత్ భార్య అవంతి, కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలన్నారు. అవంతికి న్యాయం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం సాయంత్రం చందానగర్, తారానగర్​లోని హేమంత్​ఇంటి నుంచి అవంతి, ఫ్రెండ్స్, అడ్వకేట్స్​ జేఏసీ సభ్యులు ర్యాలీ నిర్వహించారు. అవంతి తల్లిదండ్రుల ఇంటివరకూ ర్యాలీగా బయలుదేరగా.. పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి చేరుకున్న నారాయణ.. అవంతితో పాటు రోడ్డుపై బైఠాయించారు. ర్యాలీలో హైకోర్ట్ అడ్వకేట్ రఘు పాల్గొన్నారు.

భయమేస్తోంది

మాది జగిత్యాల. మార్చిలో లవ్‌‌‌‌ మ్యారేజ్‌‌‌‌ చేసుకున్నాం. నేను ప్రైవేట్‌‌‌‌ జాబ్‌‌‌‌ చేస్తున్నా. పెండ్లైన తర్వాత హైదరాబాద్‌‌‌‌లో ఉంటున్నాం. హేమంత్‌‌‌‌ మర్డర్‌‌‌‌ తర్వాత భయమేస్తోంది. ముందు జాగ్రత్తగా పోలీసులకు సమాచారం ఇచ్చాం.

– వేణుగోపాల్, జగిత్యాల

హేమంత్‌‌‌‌ హత్యపై  డీజీపీ ఆరా 

రాష్ట్రంలో లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, క్రైమ్‌‌‌‌పై డీజీపీ మహేందర్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సమీక్ష జరిపారు. ఏజెన్సీ ప్రాంతాలతో పాటు లా అండ్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌, క్రైమ్ కేసుల వివరాలు తెలుసుకున్నారు. ఈ ఏడాది జరిగిన సెన్సేషనల్‌‌‌‌ కేసులు, పెండింగ్‌‌‌‌ ట్రయల్స్‌‌‌‌ గురించి డిస్కస్‌‌‌‌ చేశారు. అడిషనల్ డీజీలు, సీపీలు, ఎస్పీలతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌‌‌‌లో హేమంత్‌‌‌‌ పరువు హత్య గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Latest Updates