మేలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్​ ?

సర్కారుకు విద్యాశాఖ ఆఫీసర్ల ప్రపోజల్స్

ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ రద్దు?

ఫిజికల్ క్లాసులు స్టార్ట్ అయ్యాకే ఎగ్జామ్​ ఫీజు వసూలుకు యోచన

హైదరాబాద్, వెలుగు:  కరోనా కారణంగా ఈ ఏడాది అకడమిక్ ఇయర్ ఆగం అయింది. స్టూడెంట్లకు క్లాసులన్నీ మూడు నెలలుగా డిజిటల్, ఆన్​లైన్ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ ఫిజికల్ క్లాసులు లేకపోవడంతో ఈసారి పబ్లిక్  ఎగ్జామ్స్‌‌ ఉంటాయా? లేదా? అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే విద్యాశాఖ అధికారులు మాత్రం వచ్చే మే నెలలోనే ఎగ్జామ్స్ ఉంటాయని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో మార్చి నుంచి విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. అకడమిక్ ఇయర్ నష్టపోవద్దన్న కేంద్రం సూచన మేరకు సెప్టెంబర్ నుంచి ఆన్​లైన్​క్లాసులు మొదలయ్యాయి. వచ్చేనెలలో క్లాస్​రూమ్ టీచింగ్ కూడా ప్రారంభించేందుకు విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. 9,10 క్లాసులతో పాటు ఇంటర్, డిగ్రీ క్లాసులనూ స్టార్ట్ చేయాలని ఇప్పటికే ప్రైమరీ డెసిషన్ తీసుకున్నది. అయితే ఇప్పటికీ ఎగ్జామ్స్ ఫీజు గురించి కనీసం చర్చ కూడా లేకపోవడంతో.. ఎగ్జామ్స్‌‌ పెడతారా? లేదా? అనే చర్చ మొదలైంది. విద్యాశాఖ మాత్రం టెన్త్, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్​తప్పకుండా నిర్వహిస్తామని చెబుతోంది. ఇదే విషయాన్ని సర్కారుపెద్దల దృష్టికీ తీసుకుపోయినట్టు ఆఫీసర్లు చెప్పారన్నారు. ఇప్పటికే టెన్త్ లో 5 లక్షల మంది, ఇంటర్​లో 10 లక్షల మంది స్టూడెంట్స్ వరకూ​పబ్లిక్ ఎగ్జామ్స్​కు సిద్ధమవుతున్నారు. ఈ అకడమిక్ ఇయర్ (2020–21)లో ప్రైమరీ, టెన్త్ మినహా హైస్కూల్ స్టూడెంట్స్​కు మాత్రం ఎగ్జామ్స్ లేకుండానే పై తరగతికి ప్రమోట్ చేయాలని ఇప్పటికే అధికారులు నిర్ణయించారు.

మే నెలలోనే.. 

విద్యాశాఖ అధికారులు గతంలో సర్కారుకు పంపిన ప్రపోజల్స్​లో జనవరి 2న విద్యాసంస్థలు తెరవాలని, ఏప్రిల్​నెలాఖరులో టెన్త్ పబ్లిక్ పరీక్షలు పెట్టి, మే నెలలో ఇంటర్ పరీక్షలు పెట్టాలని పేర్కొన్నారు. కానీ కరోనా, చలి తీవ్రత నేపథ్యంలో సంక్రాంతి తర్వాతే విద్యాసంస్థలు తెరువాలని సర్కారు నిర్ణయం తీసుకోవడంతో, గతంలో అనుకున్న
ఎగ్జామ్స్​షెడ్యూల్​లో మార్పులు చేయాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో టెన్త్, ఇంటర్ పరీక్షలనూ మే నెలలోనే నిర్వహించే చాన్స్ ఉంది. దీంతో గతంలో అనుకున్న షెడ్యూల్ మారే అవకాశముందని చెప్తున్నారు. ముందుగా టెన్త్ పరీక్షలు నిర్వహించి, ఆ తర్వాతే ఇంటర్ ఎగ్జామ్స్ పెట్టే యోచనలో ఉన్నట్టు విద్యాశాఖ అధికారి ఒకరు చెప్పారు.

ఫస్టియర్ సప్లిమెంటరీ రద్దు?

ఇప్పటికే టెన్త్ పేపర్లను11 నుంచి 6కు కుదించాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. మరోపక్క ఇంటర్ ఫస్టియర్ లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్​కు నిర్వహించాలనుకున్న సప్లిమెంటరీ ఎగ్జామ్స్​రద్దు చేయాలని విద్యాశాఖ యోచిస్తోంది. వారందరినీ మినిమమ్ పాస్ మార్కులేసి ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. దీంతో వారంతా నేరుగా సెకండియర్ ఎగ్జామ్స్ రాసుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్స్​పై ఒత్తిడి తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. అయితే విద్యాసంస్థలు తెరిచిన తర్వాతే టెన్త్, ఇంటర్ ఎగ్జామ్ ఫీజు వసూలు చేయాలని నిర్ణయించినట్టు విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. కరోనా తీవ్రత ఇలాగే ఉంటే, మరో నెలరోజుల్లో ఎగ్జామ్​ఫీజుపై పునరాలోచిస్తామని కూడా ఆయన వెల్లడించారు.

Latest Updates