ఢిల్లీలో మోడీ ర్యాలీకి టెర్రర్​ అలర్ట్‌

ఇంటలిజెన్స్​ వర్గాల హెచ్చరిక
సెక్యూరిటీ ఏర్పాట్లలో సూచనలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని పాకిస్తాన్​ టెర్రర్​ గ్రూపులు టార్గెట్​గా చేసుకున్నాయని, ఆదివారం ఢిల్లీలో జరగనున్న ర్యాలీలో దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటలిజెన్స్​ శాఖ హెచ్చరించింది. ఎస్పీజీ, ఢిల్లీ పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రధాని రక్షణకు సంబంధించి బ్లూబుక్​లోని జాగ్రత్తలన్నీ పాటించాలని, సెక్యూరిటీ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని సూచించింది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఈ ర్యాలీని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇందులో ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్​ మంత్రులు పాల్గొంటారు.

ప్రధాని ర్యాలీకి జనం భారీగా హాజరయ్యే అవకాశం ఉండడంతో టెర్రరిస్టులు దాడి జరిపే అవకాశం ఉందని పేర్కొంది. జమ్మూ కాశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు తదనంతర పరిస్థితుల నేపథ్యంలో లష్కరే తాయిబా వంటి టెర్రర్​ గ్రూపులు ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాయని వివరించింది. పాక్​ భూభాగంపై ఉన్న టెర్రర్​ గ్రూపులకు ఐఎస్ఐ ఆర్థికంగా సాయపడుతోందని ఐబీ ఆరోపించింది.

Latest Updates