కర్నాటక గవర్నర్ గా ధావర్ చంద్ ప్రమాణ స్వీకారం

 కర్నాటక గవర్నర్ గా ధావర్ చంద్ ప్రమాణ స్వీకారం

బెంగళూరు: కేంద్ర మాజీ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కర్నాటక రాష్ట్ర 19వ గవర్నర్ గా ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో కర్నాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ అభయ్ శ్రీనివాస్ కొత్త గవర్నర్‌‌తో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈనెల 7వ తేదీన కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందు 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కేబినెట్ విస్తరణకు ఒకరోజు ముందు అంటే ఈనెల 6వ తేదీన థావర్ చంద్ గెహ్లాట్ రాజీనామా చేశారు. మరుసటి దినమే ఆయననను గవర్నర్ గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ సీనియర్ నేతగా ఆయనకున్న గుర్తింపు వల్ల కేబినెట్ నుండి తొలగించడం కలకలం రేపినా.. ప్రధాని మోడీ.. అమిత్ షాల ద్వయం ఈయనపై నమ్మకంతో గవర్నర్ గిరీనీ కట్టబెట్టినట్లు స్పష్టమైంది. 
గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి యడియూరప్పతోపాటు ఆయన మంత్రివర్గంలోని పలువురు సీనియర్ మంత్రులు, బెంగుళూరులో అందుబాటులో ఉన్న కొద్ది మంది మాత్రమే హాజరయ్యారు. దక్షిణాదిలో బీజేపీ కొలువుదీరిన ఏకైక రాష్ట్రం కర్నాటక కాబట్టి ఇక్కడి పరిణామాలు.. ఇరుగు పొరుగు రాష్ట్రాలపై పడే అవకాశం ఉండడంతో సీనియర్ అయిన గెహ్లాట్ సేవలకు ప్రాధాన్యతనిచ్చి నియమించినట్లు తెలుస్తోంది.