బాడీగార్డును ప్రేమించి పెళ్లాడిన రాజు

బ్యాంకాక్: థాయ్‌లాండ్ రాజు మహా వాజిరలోంకోర్న్ అనుకున్నంత పని చేశారు. కొన్ని రోజులుగా ఆయన పర్సనల్ బాడీగార్డ్ అయిన సుథిత తిడ్జాయ్ తో ప్రేమలో పడ్డారని అక్కడి మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే దీనిపై స్పందించన రాజు..ఇప్పుడు ఆమెను పెళ్లి చేసుకుని అందరి అనుమానాలను నిజం చేశాడు. మహా వాజిరలోంకోర్న్ సుథిద తిడ్జాయ్‌ను బుధవారం వివాహం చేసుకున్నారు. క్వీన్ సుథిద పేరుతో ఆమెకు రాణిగా అధికారిక గుర్తింపు ఇచ్చారు. ఈ పెళ్లితంతు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తగా.. ఈ వార్త ఫస్ట్ ‘రాయల్ గెజిట్’లో రాగా,  తర్వాత అన్ని థాయ్ టీవీ ఛానెళ్లలో కనిపించింది.

పదో రామా రాజుగా పిలుచుకునే 66 ఏళ్ల వాజిరలోంకోర్న్.. ఆయన తండ్రి, తొమ్మిదో రామా భుమిబోల్ అడులియాడేజ్ మృతి చెందిన తర్వాత అధికారికంగా రాజు అయ్యారు. 70 పాటు సింహాసనంపై కొనసాగిన భుమిబోల్ 2016 అక్టోబర్‌లో మరణించారు. వాస్తవానికి తండ్రి మరణానంతరమే వాజిరలోంకోర్న్ రాజుగా సింహాసనాన్ని అధిష్టించినప్పటికీ… తండ్రి మరణానంతరం సంతాప దినాల తర్వాత ఆయనకు పట్టాభిషేకం జరుగుతోంది. ఈ నెల 4న పట్టాభిషేక మహోత్సవం జరగనుండగా.. ఆ తర్వాతి రోజు బ్యాంకాక్ వీధుల్లో ఊరేగింపు జరుగుతుంది. ఈ క్రమంలోనే ఆయన సుథిదను వివాహం చేసుకోవడం గమనార్హం.

థాయ్‌ ఎయిర్‌వేస్‌లో సాధారణ ఫ్లైట్ అటెండెంట్‌గా పనిచేసిన సుథిదను రాజు వాజిరలోంకోర్న్ 2014లో తన పర్సనల్ బాడీగార్డ్ గా తీసుకొచ్చారు. ఫస్ట్ ఆమెను డిప్యూటీ కమాండర్‌గా నియమించిన రాజు… 2016 డిసెంబర్‌లో రాయల్ థాయ్ ఆర్మీకి పూర్తిస్థాయి జనరల్‌గా బాధ్యతలు అప్పగించారు. మళ్లీ తిరిగి 2017లో రాజు వ్యక్తిగత భద్రతాదళంలో డిప్యూటీ కమాండర్‌గా తీసుకున్నారు. ఆమెకు లేడీ అని అర్థం వచ్చే రాయల్ టైటిల్ థాన్‌ప్యూంగ్‌తో గుర్తింపునిచ్చారు. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టు రాజ ప్రసాదంలోనూ, విదేశీ మీడియాలోనూ గుసగుసలు వినిపించినప్పటికీ.. రాజకుటుంబం ఖండిస్తూ వచ్చింది. రాజు వాజిరలోంకోర్న్‌కు ఇంతకు ముందే మూడు పెళ్లిళ్లు జరిగాయి. వారందరితోనూ విడాకులు తీసుకున్న ఆయనకు ఏడుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు నాలగోసారి పెళ్లి చేసుకున్న రాజు ..ఈమెతోనైనా చివరివరకు కాపురం చేస్తాడా అంటున్నారు ఆ దేశ ప్రజలు.

 

 

 

 

 

Latest Updates