మెట్రో స్టేషన్ లో మహిళల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు

Thauni fair Exhibition in Hyderabad Maduranagar Metro Station

హైదరాబాద్ మెట్రో మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మెట్రోలో జర్నీ ఏర్పాట్లే కాదు…. ప్రయాణికులకు కావాల్సిన వస్తువులు కూడా అందుబాటులో ఉంచింది. పిల్లలకు ఆట, పాటలతో పాటు….కుటుంబ సమేతంగా ఉత్సాహంగా గడిపేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. వీటన్నింటిని మహిళల తోనే ఏర్పాటు చేయించడం విశేషం.

ప్రయాణీకులకు మంచి అనుభూతిని మిగిల్చేలా ఏర్పాట్లు చేస్తోంది మెట్రో. మహిళలు, వారి కుటుంబ సభ్యులకు అవసరమయ్యే… వస్తువులతో 150 స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ మధురానగర్ మెట్రో రైల్వే స్టేషన్ లో ఇప్పటికే 80 శాతం మహిళా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ తరుణి ఫెయిర్ పేరిట ఎగ్జిబిషన్ ప్రారంభించారు. 60 రోజుల పాటు జరిగే ఎగ్జిబిషన్ ను మహిళలే నిర్వహించనున్నారు

ప్రజా రవాణా వ్యవస్థను బట్టి అది ఎలాంటి నగరం అనేది అంచనా వేస్తారని… హైదరాబాద్ మంచి నగరాల్లో మొదటి ర్యాంకులో ఉంటుందని పట్టణాభివృద్ధి శాఖ, కమిషనర్, డైరెక్టర్ శ్రీదేవి అన్నారు. మెట్రో చుట్టూ మనకు అవసరమైన వస్తువులు అందుబాటులో ఉండాలని ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మహిళల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వారి భద్రతకు మెట్రోలో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేశామన్నారు హైదరాబాద్ నగర అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్.

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. మహిళలను ప్రోత్సహించేందుకే ఇలాంటి వినూత్న కార్యక్రమాలను ఏర్పాటు చేశామన్నారు. మహిళల్లో నూతన ఆలోచనలు ఉంటాయని.. కానీ అమలు కోసం వారికి అవకాశం దొరకదన్నారు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ హరిచందన. మొదటి రోజు ఎగ్జిబిషన్ కు మంచి రెస్పాన్స్ ఉందని చెప్తున్నారు అధికారులు.

Latest Updates