ఏపీ సెక్రటేరియట్ గేటుకు​..కరెంట్​ కట్

హైదరాబాద్​, వెలుగు: ఇంకో వారం పది రోజుల్లో సెక్రటేరియట్​ మొత్తాన్ని ఖాళీ చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా పాత సచివాలయం గేట్లు మూతబడిపోతున్నాయి. కొన్ని శాఖలకు కరెంట్​ కనెక్షన్​ కట్​చేశారు.  ఆదివారం నుంచి ఏపీ సచివాలయం గేటుకు తాళం పడబోతోంది. సెప్టెంబర్​ 1 నుంచి ఏపీ గేటును మూసేస్తున్నామని జీఏడీ అధికారులు ఓ నోటీస్​ కూడా పెట్టారు. సెకట్రేరియట్​ షిఫ్టింగ్​ దాదాపు 60% పూర్తి కావడంతో త్వరలోనే కూల్చివేతలు మొదలుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలోనే 25 ఏళ్ల పాటున్న ఏపీ గేట్​ను మూసేస్తున్నారు. కూల్చివేశాక అది పూర్తిగా కనపడకుండా పోనుంది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయ్యాక 1995లో లుంబినీ పార్కు ఎదురుగా ఈ గేటును ఏర్పాటు చేశారు. అంతకుముందు ఎన్టీఆర్​ సీఎంగా ఉన్నప్పుడు తెలుగు తల్లి ఫ్లై ఓవర్​ మొదలయ్యే దగ్గర సచివాలయానికి ఎంట్రెన్స్​ ఉండేది. దాని వాస్తు బాగాలేదనిచంద్రబాబు దాన్ని లుంబినీ పార్కుకు ఎదురుగా మార్చారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు రెండేళ్లు హైదరాబాద్​ నుంచే పాలన చేశారు. ఈ టైంలో ఏపీ గేటు నుంచే లోపలికెళ్లేవారు. ఎన్టీఆర్​మార్గ్​ వైపు తెలంగాణ గేటును ఏర్పాటు చేశారు.

త్వరలో నీళ్లు, కరెంట్​ కట్​

ప్రస్తుతం శాఖల షిఫ్టింగ్​తో పేషీలు ఖాళీ అయ్యాయి. కారిడార్లలో చిత్తు కాగితాలు పేరుకుపోయాయి. వీటిలో జనాలు సమస్యలపై ఇచ్చిన వినతి పత్రాలూ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, ఖాళీ అయిన ఈ బ్లాక్​లకు త్వరలోనే కరెంట్​, నీళ్ల కనెక్షన్​ను కట్​ చేయాలని అధికారులు నిర్ణయించినట్టు తెలుస్తోంది. కొన్ని చాంబర్లలో సామాను ఖాళీ అవడంతో ఎలుకలు తెగ తిరిగేస్తున్నాయి. ఇంటర్నెట్​ కేబుళ్లను కొట్టేస్తున్నాయి. దీంతో శనివారం నెట్​కనెక్షన్​ కట్​ అయి డ్యూటీలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. మరికొద్ది రోజుల్లో బడ్జెట్​ఉండడంతో డీబ్లాక్​లో ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బంది కసరత్తులు ముమ్మరం చేశారు. అయితే, నెట్​ కట్​ అవడంతో అధికారులు ఇబ్బంది పడ్డారు. ఇంటర్నెట్​ కేబుళ్ల రిపేర్​కు లక్ష రూపాయల దాకా ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు.

Latest Updates