5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థపై కన్నేసిన బ్యాంకులు

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ రావాలంటే ఏం చేయాలి!

వర్క్‌‌షాపులు మొదలుపెట్టిన బ్యాంకులు

అనేక అంశాలపై ఉన్నతాధికారులచర్చలే చర్చలు

 హైదరాబాద్‌‌లో సిండికేట్‌‌, ఆంధ్రాబ్యాంకుల మీటింగులు

  సిబ్బంది అభిప్రాయాల సేకరణ

హైదరాబాద్‌‌, వెలుగు:ఇండియాను ఐదేళ్లలో ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు బ్యాంకులు సలహాలు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ సూచించిన సంగతి తెలిసిందే. దీంతో పలు ప్రభుత్వరంగ బ్యాంకులు శనివారం వర్క్‌‌షాప్‌‌లు, ప్రత్యేక సమావేశాలు నిర్వహించాయి. ఆర్థిక వ్యవస్థ అబివృద్ధికి సహకరించడం, వ్యాపారాన్ని విస్తరించడం, మరింత మంది కస్టమర్లను చేర్చుకోవడం, లోన్ల సంఖ్యను పెంచడం వంటి విషయాలపై చర్చించాయి. సిండికేట్‌‌ బ్యాంకు కూడా హైదరాబాద్‌‌లో శనివారం వర్క్‌‌షాప్‌‌ను ప్రారంభించింది. ప్రాథమికస్థాయిలో సరికొత్త ఆలోచనలను సృష్టించడమే దీని లక్ష్యమని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ టార్గెట్లను చేరుకునేలా తమ బ్యాంకింగ్‌‌ టెక్నాలజీని మెరుగుపరుస్తామని తెలిపింది.

ఈ వర్క్‌‌షాప్‌‌కు అన్ని విభాగాల అధిపతులు, హైదరాబాద్‌‌ ఫీల్డ్‌‌లెవెల్‌‌ ఆఫీసర్లు వచ్చారు. లక్ష్యాల సాధనకు మొదట బ్రాంచ్‌‌స్థాయిలో సంప్రదింపులు మొదలుపెట్టి నగర, రాష్ట్ర స్థాయిల్లో నిర్వహిస్తారు. బ్యాంకును అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి బాటమ్‌‌ అప్ విధానాన్ని అనుసరిస్తామని సీనియర్‌‌ ఆఫీసర్లు చెప్పారు. గత ఐదేళ్లలో బ్యాంకు పనితీరును ఈ సందర్భంగా సమీక్షించారు. డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ బిజినెస్‌‌, ఎంఎస్‌‌ఎంఈలకు, రైతులకు, వ్యాపారులకు లోన్లను పెంచడం, టెక్నాలజీ వినియోగంపై చర్చలు జరిగాయి. ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడం, హౌసింగ్‌‌, ఇన్‌‌ఫ్రా ప్రాజెక్టులకు లోన్లు ఇవ్వడం, మహిళా సాధికారత, స్వచ్ఛభారత్‌‌, ముద్ర, ఎడ్యుకేషన్ లోన్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, కార్పొరేట్‌‌ సామాజిక బాధ్యత వంటి అంశాలపైనా సమాలోచనలు జరిపారు. కొత్త పథకం ఏదీ తీసుకొచ్చినా అది ఆర్థిక వ్యవస్థకు మేలు చేసేలా చూస్తామని, అందుకే ఈ వర్క్‌‌షాప్‌‌లను నిర్వహిస్తున్నామని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌‌ నాగేశ్వర రావు అన్నారు. మొత్తం 4,063 బ్రాంచుల్లో వర్క్‌‌షాప్‌‌లను నిర్వహిస్తున్నామని తెలిపారు. చర్చల సారాంశంతో కూడిన నివేదికను సీనియర్‌‌ ఆఫీసర్లకు అందిస్తామని, దీనిని బ్యాంకు రోడ్‌‌మ్యాప్‌‌ తయారీకి ఉపయోగిస్తారని తెలిపారు.

ఆంధ్రాబ్యాంకులో జోనల్‌‌స్థాయి సమావేశాలు

కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మొదటిదఫా జోనల్‌‌స్థాయి సంప్రదింపుల సమావేశాలను ఈ నెల 17,18 తేదీల్లో నిర్వహిస్తున్నట్టు ఆంధ్రా బ్యాంకు ప్రకటించింది. కొత్త ఆలోచనలను సృష్టించడానికి, బ్యాంకు పనితీరును అంచనా వేయడానికే ఈ ప్రయత్నమని తెలిపింది. హైదరాబాద్‌‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో సికింద్రాబాద్‌‌ జోన్‌‌కు చెందిన 79 శాఖలు పాల్గొన్నాయి. బ్రాంచ్‌‌ పనితీరును మెరుగుపర్చడం, ఫ్యూచర్‌‌ప్లాన్లు, బ్యాంకింగ్‌‌రంగ సమస్యలపై ఈ సందర్భంగా చర్చ జరిగింది. ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా వివిధ రంగాలకు మరిన్ని లోన్లు ఇవ్వడంపైనా సమాలోచనలు జరిపారు. సీనియర్‌‌ సిటిజన్లకు, రైతులకు, చిన్న వ్యాపారులకు, వ్యాపారులకు, విద్యార్థులకు, మహిళలకు మరింత సమర్థంగా సేవలు అందించడంపైనా అభిప్రాయాలను సేకరించామని బ్యాంకు సీనియర్‌‌ ఆఫీసర్లు తెలిపారు. అంతేగాక ఆర్థిక వ్యవస్థకు సహకారం అందించడం, వ్యవసాయం, పాడిపరిశ్రమకు లోన్లు ఇవ్వడం, జల్‌‌శక్తి, డైరెక్ట్‌‌ బెనిఫిట్‌‌ ట్రాన్స్‌‌ఫర్స్‌‌, డిజిటల్‌‌ ఎకనమీ, కార్పొరేట్‌‌ సోషల్‌‌ రెస్సాన్సిబిలిటీపైనా అధికారులు, సిబ్బంది తమ ఆలోచనలను పంచుకున్నారు.

Latest Updates