బీజేపీ కామన్​ మేనిఫెస్టోలోని అంశాలు

ఎక్కడి మున్సిపల్ ఆదాయం అక్కడే ఖర్చు
వంద గజాలలోపు ఉన్న ఇండ్లకు ఆస్తి పన్ను రద్దు,
అంతే స్థలంలో ఇండ్ల నిర్మాణానికి నో ఎన్వోసీ
భూ కబ్జా బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్, హెల్ప్​ సెంటర్స్​
ధోబీఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు వృత్తి పన్ను రద్దు, ఫ్రీ కరెంట్​, ఫ్రీ వాటర్​
మేనిఫెస్టోను విడుదల చేసిన ఎమ్మెల్సీ రాంచందర్​రావు

హైదరాబాద్, వెలుగుతాము గెలుచుకునే మున్సిపాలిటీల్లో ఇంటి పన్నును తగ్గిస్తామని బీజేపీ మున్సిపోల్స్​ కామన్​ మేనిఫెస్టోలో ప్రకటించింది. ఎక్కడి మున్సిపల్ రాబడిని అక్కడే ఖర్చు చేస్తామని, వంద గజాలలోపు ఉన్న ఇండ్లకు ఆస్తి పన్నును రద్దు చేస్తామని హామీ ఇచ్చింది. పార్కులు, చెరువులను కబ్జాల నుంచి కాపాడుతామని తెలిపింది. భూ కబ్జా బాధితుల కోసం టోల్ ఫ్రీ నంబర్, సహాయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, దోబీ ఘాట్లు, హెయిర్ కటింగ్ సెలూన్లకు వృత్తి పన్ను రద్దు చేస్తామని వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు సంబంధించిన కామన్ మెనిఫెస్టోను బీజేపీ శాసన మండలి పక్ష నేత ఎస్.రాంచందర్ రావు ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఆయా మున్సిపాలిటీల పరిధిలో స్థానిక సమస్యలు, తమ పార్టీ లోకల్ లీడర్ల ఆలోచనలకు అనుగుణంగా ఎక్కడికక్కడ లోకల్ మేనిఫెస్టోలను ఇప్పటికే ప్రకటించామని తెలిపారు. ఇప్పుడు ఇది స్టేట్ కామన్ మేనిఫెస్టో అని, బీజేపీ గెలిచే మున్సిపాలిటీల్లో ఈ మేనిఫెస్టోను అమలు చేస్తామన్నారు.

హౌస్​ ట్యాక్స్​ పేరిట టీఆర్​ఎస్​ దోపిడీ

టీఆర్ఎస్ సర్కార్ హౌజ్ ట్యాక్స్ పేరుతో ప్రజల్ని  దోచుకుంటోందని రాంచందర్​రావు మండిపడ్డారు.  మున్సిపాలిటీలలో ప్రస్తుతం వసూలు చేస్తున్న ఇంటి పన్నుల విధానం సరిగ్గా లేదని, ఇది పట్టణ, నగర ప్రాంతాల్లోని పేదలకు భారంగా మారిందన్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో  వసూలు చేస్తున్న ఇంటి పన్ను కన్నా ఇతర ప్రాంతాల్లో అధికంగా వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఇంటి పన్ను వసూలు విధానంలో ఎలాంటి శాస్త్రీయత లేదని, దీన్ని సరళతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ గెలుచుకునే మున్సిపాలిటీలలో ఇంటి పన్ను విధానాన్ని పక్కగా మారుస్తామని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వం మున్సిపాలిటీలకు వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని సైతం అక్కడి అభివృద్ధికి ఖర్చు చేయకుండా, ఇతర పథకాల కోసం మళ్లించుకుంటోందని ఆరోపించారు. తాము గెలిచిన చోట అక్కడి అభివృద్ధికే ఆ ఆదాయాన్ని ఖర్చు చేస్తామని చెప్పారు. మున్సిపాలిటీల పరిధిలో పలు పార్క్ లు, చెరువులు కబ్జాకు గురవుతున్నాయని, తాము వాటిని పరిరక్షిస్తామన్నారు. చెత్త సేకరణ, తరలింపు, డంపింగ్ యార్డుల ఏర్పాటులో ఆధునిక పద్ధతులు తీసుకొస్తామని చెప్పారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను ఆయన వివరించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు ప్రకాశ్​రెడ్డి, జనార్దన్ రెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ కామన్​ మేనిఫెస్టోలోని అంశాలు

జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డు తరలింపు. రాజ్యాంగంలోని 74వ సవరణకు అనుగుణంగా మున్సిపాలిటీలు స్థానిక ప్రభుత్వాలుగా గుర్తింపు. ప్రజాభిష్టానికి అనుగుణంగా పారదర్శక, సుస్థిరమైన పాలన. వంద గజాలలోపు ఉన్న ఇండ్లకు ఆస్తి పన్ను రద్దు, పాత ఇండ్ల ఆధునీకరణ. అంతే స్థలంలో కొత్త ఇండ్లను నిర్మించుకుంటే ఎన్వోసీ అవసరం ఉండదు.మురికి కాలువల ఏర్పాటు, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ. ప్రజారోగ్యానికి పెద్దపీట. రహదారుల నిర్మాణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి.. పరిసర పల్లెలకు మున్సిపాలిటీల రోడ్ల అనుసంధానం. భూకబ్జా బాధితులను ఆదుకోవడం కోసం టోల్ ఫ్రీ నంబర్​, సహాయ కేంద్రాలు. శ్మశాన వాటికల విస్తరణ, ప్రత్యేక నిధుల కేటాయింపు,  మార్చురీ వ్యాన్ల ఏర్పాటు, ఫ్రీజ్ బాక్స్ లను ఆన్ లైన్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడం.

వర్షాధార నీటి వినియోగం, సౌర విద్యుత్ వాడకంపై ఫోకస్​. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం, రైతు బజార్ ల ఆధునీకరణ, పబ్లిక్​ లైబ్రరీలు, కంప్యూటర్  సెంటర్ల ఏర్పాటు, ఉచిత ఇంటర్ నెట్ సేవలు. పిల్లల కోసం సైన్స్, ఎడ్యుకేషన్ మ్యూజియంల ఏర్పాటు, మైదానాలను కాపాడడం, యువతలో క్రీడా నైపుణ్యం పెంపొందించేందుకు కృషి. కుల వృత్తులను కాపాడి, జీవనోపాధి పెంచడం. దోబీఘాట్ లకు, హెయిర్ కటింగ్ సెలూన్ లకు వృత్తి పన్ను రద్దు. వీటికి ఉచిత విద్యుత్, ఉచిత మంచినీటి సరఫరా. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు గౌరవప్రదమైన జీవితాన్ని ఇవ్వడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు. మున్సిపాలిటీలలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులకు ఎప్పటికప్పుడు శిక్షణనిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను మున్సిపాలిటీలలో విజయవంతంగా అమలు చేయడం.

see also: ఆరేళ్ల TRS పాలనలో బతుకులు మారలేదు

Latest Updates