విషాదం: మురికి కుంటలో పడి బాలుడు మృతి

ఆడుకుంటూ వెళ్లి మురికికుంటలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన మెడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధిపేట జిల్లా తొంగుంట గ్రామానికి చెందిన సత్తయ్య , లత దంపతులు సంవత్సరం క్రితం నగరానికి వచ్చారు. మెడ్చల్ మున్సిపల్ పరిధిలోని ఆధ్వెళ్లి గ్రామంలో గల శివగణేష్ నిలయంలో సత్తయ్య వాచ్ మెన్ గా విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి ఒక బాబు ఆంజనేయులు (4) ఉన్నాడు. ఆదివారం సాయంత్రం ఆంజనేయులు బయట ఆడుకుంటానని చెప్పి వెళ్ళాడు. సాయంత్రం 7 గంటలైనా ఆంజనేయులు తిరిగి రాకపోవడంతో చుట్టూ పక్కల వెతికిన బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆంజనేయులు ఓ మురికి కుంటలో శవమై కనిపించాడు.

బాలుడు ఆడుకుంటూ వచ్చి నీళ్లు ఉన్న మురికికుంటలో పడి మృతి చెందాడని పొలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం మెడ్చల్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గంగాధర్ తెలిపారు.

ఆ మురికి కుంట ప్రైవేట్ బైక్ షోరూం నిర్వహిస్తున్న నాగప్పకు చెందినది. తన షో రూమ్ లో బైక్ సర్వీస్ చేసిన వాటర్ బయటికి పోయి నిల్వ ఉంటున్నందున కాలనీవాసులు అభ్యతరం చేశారని, షోరూం ఆవరణలో ఒక పక్క గుంత తవ్వి నీళ్లు నిల్వ ఉండే విధంగా ఉంచాడు. కానీ ఆ గుంతకు ఎటువంటి ఫెన్షింగ్ వేయలేదు. ఆదివారం సాయంత్రం ఆంజనేయులు (4) ఆడుకుంటూ వచ్చి నీళ్ల గుంతలో పడిపోయాడు. ఎవరు గమనించకపోవడంతో ఆ బాలుడు  నీళ్లలో మునిగి మృతి చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు  తమ బిడ్డ మృతికి కారణమైన షోరూం ముందు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి నాగప్పను అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Latest Updates