ఎల్ఆర్ఎస్ చార్జీల భారం తగ్గేది కొందరికే!

2013కు ముందు నాటి రిజిస్ట్రేషన్లకే ఊరట
ఏడేండ్లుగా జరిగిన రిజిస్ట్రేషన్లకు ప్రస్తుత చార్జీలే వర్తింపు

హైదరాబాద్, వెలుగు: రిజిస్ట్రేషన్ చేసుకున్న నాటి వ్యాల్యూ ప్రకారమే ఎల్ఆర్ఎస్ చార్జీలను వసూలు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించినా అది కొద్దిమందికే ఉపయోగపడేలా ఉంది. 2013కు ముందు జరిగిన రిజిస్ట్రేషన్లకే చార్జీల భారం తగ్గనుంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న భూముల మార్కెట్ వ్యాల్యూను చివరిసారిగా 2013 ఆగస్టులో ప్రభుత్వం పెంచింది. అటు తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. ఒక ప్లాట్‌ను 2013 సెప్టెంబర్‌లో రిజిస్ట్రేషన్ చేసినప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఏ మార్కెట్ వ్యాల్యూ వేశారో.. అదే ప్లాట్‌కు ఈ ఏడాది ఆగస్టులో రిజిస్ర్టేషన్ చేసినా అదే మార్కె ట్ వ్యాల్యూ వర్తిస్తుంది. అందుకే కొత్త మార్కె ట్ వ్యాల్యూ​ అమల్లోకి వచ్చిన గత ఏడేండ్లలో రిజిస్ర్టేషన్ జరిగిన స్థలాలకు ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారమే ఎల్ఆర్ఎస్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రిజిస్ర్టేషన్స్ శాఖ సీనియర్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.

కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాతే ఎక్కువ రిజిస్ర్టేషన్లు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొంతకాలం రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగించినప్పటికీ.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త జిల్లా కేంద్రాల్లో ఆ వ్యాపారం ఊపందుకుంది. కొత్త జిల్లా కేంద్రాలతోపాటు హైదరాబాద్ చుట్టూ హెచ్ఎండీఏ పరిధిలో, టెంపుల్ టౌన్ యాదాద్రి కేంద్రంగా కొత్తగా అనధికార వెంచర్లు భారీగా వెలిశాయి. రాష్ట్రంలో గత ఐదేండ్లలో రోజుకు 2 వేల నుంచి 3 వేల ప్లాట్ల చొప్పున లక్షల్లో ప్లాట్ల అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. ఈ లెక్కన 2013 తర్వాత కొనుగోలు చేసిన ప్లాట్ల సంఖ్య సుమారు 3 లక్షల వరకు ఉంటాయని అంచనా.

For More News..

అభిమానుల చూపంతా ధోని ఐపీఎల్ ఆటపైనే..

ఉద్యోగం పోయినోళ్లకు నయా జాబ్స్..

ఈ సీజన్ ఐపీఎల్‌లో సచిన్ కొడుకు ఆడే చాన్స్!

Latest Updates