పాత టీవీలు, రేడియోలకు లక్షలు ఇస్తామంటూ బేరాలు

గుప్తనిధుల కోసం తవ్వకాల కోసం రెండు తలల పాములు, తాబేళ్ల కోసం గతంలో వెతుకులాడే వారు అక్రమార్కులు. అయితే ప్రస్తుతం గుప్తనిధుల కోసం టెక్నాలజీని ఉపయోగించే పనిలో పడ్డారు. పాత బ్లాక్ అండ్ వైట్ టీవీలు, రేడియోల కోసం లక్షలు ఇస్తామంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఓ ముఠా తిరగుతుండడంతో జనం అయోమయంలో పడ్డారు. పాత టీవీలు, రేడియోలకు లక్షలు ఇస్తామనడంతో బంధువులకు ఫోన్లు చేసి మరీ వాటిని తెప్పించుకుంటున్నారు. గుప్త నిధుల తవ్వకాలంటూ…జనాన్ని అమాయకులని చేసి మోసం చేస్తున్నారు అక్రమార్కులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గతంలో రెండు తలల పాములు, తాబేళ్లతో గుప్త నిధుల జాడ తెలుసుకుంటామని తిరిగిన కేటుగాళ్లు…తాజాగా పాత రెడీయోలు, టీవీలను కొంటామంటూ ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా.. ఎవరి నోట విన్నా ఒకటే మాట… మీ ఇంట్లో పాత టీవీలు, రేడియోలు ఉన్నాయా… ఉంటే వాటికి లక్ష రూపాయలు ఇస్తామంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

ఏళ్ల కింద మూలన పడేసిన టీవీ, రేడియోలకి లక్షలు వస్తాయని దుమ్ము దులిపి మరీ పక్కన పెడుతున్నారు జనం. ఇంకొందరు తమ చుట్టాలకు ఫోన్లు చేసి మరీ పాత టీవీలు, రేడియోలు తెప్పించుకుంటున్నారు. టీవీలు రిపేర్ చేసే షాపుల వారికైతే తాకిడి మరీ ఎక్కువైంది. పాత తరం టీవీలు రేడియోల్లో ఉన్నా వాల్వ్, కాయిల్స్  గుప్త నిధులను గుర్తిస్థాయని ప్రచారం చేస్తున్నారు. రెండు మూడు ఇంచులు ఉండే రెడ్ కలర్ వాల్వ్… మెటల్ ని బాగా గుర్తిస్తుందన్న ప్రచారం ఎక్కువ కావడంతో వాటికోసం వేట మొదలైంది. అయితే ఇలాంటి వాల్వ్ లను తామెప్పుడు చూడలేదంటున్నారు మెకానిక్ లు. పురాతన టీవీలు ప్రస్తుతం దొరకడం కూడా కష్టమంటున్నారు. పాత టీవీలు, రేడియోల్లో ఉన్న వాల్వ్ లను వాట్సప్ వీడియో కాల్స్ ద్వారా పరిశీలిస్తున్నారు కొందరు. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా అంతటా ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో బంగారు రింగ్ ను పాత రేడియో, టీవీల దగ్గరికి తీసుకెళ్లగా.. అది శబ్దం చేస్తుండటంతో బంగారు నిధుల వేట కొనసాగించే వారికి మరిన్ని ఆశలు కలుగుతున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పట్టణాలు-పల్లెల్లో ఎక్కడ చూసినా ఇదే అంశంపై చర్చ నడుస్తోంది.

ఇదంతా ఫేక్ అనీ..నమ్మితే అసలుకే మోసం వస్తుందంటున్నారు జనవిజ్ఞాన వేదిక సభ్యులు. మాయమాటలు చెప్పి మోసం చేసే అవకాశం ఉందంటున్నారు. ప్రజలు ఇలాంటి కాల్స్ కి రెస్పాండ్ కావొద్దని సూచిస్తునారు. అయితే చాలా మంది యువత ఈజీ మనీ కోసం.. ఈ టీవీలను వెతికే పనిలో ఉన్నారు. దీంతో సమయం వృధా కావడంతో పాటు ఖర్చు కోసం అప్పులు కూడా చేస్తున్నట్టు చెబుతున్నారు. పాత టీవీలు రేడియోల కోసం ఎవరైనా ఫోన్లు చేస్తే మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు. డబ్బులు ఆశజూపే వారి సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. కొందరు పనిగట్టుకొని ఓల్డ్ టీవీలు, రేడియోల కోసం వెతుకుతున్నారన్న సమాచారం ఉందనీ… వారిని నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. పాత టీవీలు, రేడియోల కోసం జరుగుతున్న వెతుకులాట…చైన్ సిస్టంలా మారింది. ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడ ఎవరినోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది.

Latest Updates