కంటెయినర్ ను వెనుక నుండి ఢీకొట్టి.. కంటెయినర్లోకి ఎక్కిన కారు

కారులో మంటలు రేగి బ్యాంక్ ఉద్యోగి శివకుమార్ సజీవదహనం

కర్నూలు: జిల్లాలోని నంద్యాల మండలం చాపిరేవుల టోల్‌ప్లాజా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి సజీవదహనం అయ్యాడు. సినిమా ఫక్కీలో జరిగిన ఈ ప్రమాదం ఆలస్యంగా గుర్తించారు. గూడ్స్ కంటెయినర్ లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో  వెనుక నుండి వస్తున్న కారు అదుపు చేయలేక కంటెయినర్ ను ఢీకొట్టింది..  కంటెయినర్ లో కారు చిక్కుకుంది.. వెనుక నుండి కారు ఢీకొన్న విషయాన్ని కార్గొ లారీ డ్రైవర్ గుర్తించలేకపోయాడు. పెద్ద శబ్దం అయినట్లు పసిగట్టినా అలాగే ముందుకెళ్లాడు.

సుమారు 8 కిలోమీటర్ల దూరం వెళ్లాక.. నంద్యాల సమీపంలోని చాపిరేవుల టోల్ గేట్ వద్ద వెనుకవైపు నుండి వచ్చిన వాహనంలోని వారు కేకలు వేయడంతో… కార్గొ లారీని రోడ్డు పక్కన నిలబెట్టి దూరం జరిగారు. కంటెయినర్ లారీలో చిక్కుకున్న కారులో పెట్రోల్ లీక్ కావడంతో.. మంటలు చెలరేగాయి..  ఈలోగా కారులో ప్రయాణిస్తున్న నలుగురిలో ముగ్గురు బయటపడ్డారు. వికలాంగుడైన  నంద్యాల స్టేట్ బ్యాంక్ ఉద్యోగి శివకుమార్ కారులో నుండి బయటకు రాలేక.. మంటల్లో మాడి మసయ్యాడు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

నంద్యాల స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్న శివకుమార్ తన తల్లికి వైద్య చికిత్స కోసం కర్నూలుకు తీసుకెళ్లి.. తెల్లవారు జామున 2 గంటలకు కర్నూలు నుండి నంద్యాలకు బయలుదేరారు. మరో 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనేలోగానే ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కంటెయినర్ డ్రైవర్ పాణ్యం దాటిన తర్వాత సడెన్ బ్రేక్ వేశాడు. కంటెయినర్ వెనుకే వస్తున్న కారును అదుపుచేయలేక కంటెయినర్ ను ఢీకొట్టింది. కారులో ఉన్న నలుగురిలో అందరూ నిద్ర మత్తులో ఉన్నారు. ఏం జరిగిందో గుర్తించేలోగానే తమ కారును కంటెయినర్ ఈడ్చుకుంటూ తీసుకెళ్తున్నట్లు కనిపించింది. భయాందోళనకు గురైన వీరు.. కారు అద్దాలను పగులగొట్టి బయటపడే ప్రయత్నం చేశారు. సుమారు 8 కిలోమీటర్లు వెళ్లాక కంటెయినర్ ను ఆపడంతో.. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు బయటపడ్డారు. అయితే తీవ్రంగా గాయపడిన  ఎస్‌బీఐ బ్యాంక్ ఉద్యోగి శివకుమర్ బయటపడలేక సజీవదహనం అయ్యాడు. వికలాంగుడు కావడం వల్లే బయటపడలేకపోయినట్లు గుర్తించారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.  స్థానికులు ఆయనను 108లో నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు.

Latest Updates