సమతా కేసు: సర్వత్రా ఉత్కంఠ

సమతా అత్యాచారం, హత్య కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక కోర్టు గురువారం తీర్పు వెల్లడించనుంది. ఈ నెల 27న తీర్పు ఇవ్వాల్సి ఉండగా..న్యాయమూర్తి అనారోగ్య కారణంగా సెలవు పెట్టడంతో తీర్పు వాయిదా పడింది. సమతా కేసులో తీర్పుపై జిల్లా ప్రజల్లో ఆసక్తి కనబడుతోంది. సమతా దోషులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ స్టీలు గిన్నెలు అమ్ముకునే సమతను కుమ్రంభీం జిల్లా లింగాపూర్ దగ్గర్లోని ఎల్లపటూర్ అడవుల్లో ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ కేసులో లింగాపూర్ కు చెందిన షేక్ బాబు, షేక్ ముగ్ధూం,షేక్ షాబుద్దీన్ ను ప్రత్యేక న్యాయస్థానం దోషులుగా తేల్చింది. వీరి శిక్షలపై న్యాయస్థానం గురువారం తుది తీర్పు వెల్లడించనుంది.

సమత ఘటనను గోసంపల్లి గ్రామస్థులు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరక్కుండా దోషులకు కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేస్తున్నారు. సమత ఘటన తర్వాత మేథావులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ నాయకులు గోసంపల్లి గ్రామస్థులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. గ్రామంలోని మహిళలకు పెప్పర్ స్ప్రేలు అందించి అవసరమైన సమయాల్లో వినియోగించాలని చెప్తున్నారు. ఆపద సమయంలో ఎలా వ్యవహరించాలో తెలియజేస్తూ ఎమర్జెన్సీ నంబర్లపై అవగాహన కల్పిస్తున్నారు పోలీసులు. సమత అత్యాచారం హత్య కేసులో న్యాయస్థానం గురువారం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది.  నిందితులకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు సమతా బంధువులు, గ్రామస్థులు.

Latest Updates