రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయీ బాకీ లేదు : బీజేపీ ఎంపీలు

కేంద్ర నిధులపై టీఆర్ఎస్​ ఎంపీలవి డ్రామాలు: బీజేపీ ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ప్రభుత్వం బకాయిలు ఇవ్వాల్సి ఉందంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో డ్రామాలు చేశారని బీజేపీ రాష్ట్ర ఎంపీలు మండిపడ్డారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలేవీ లేవని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో కేంద్రంపై నెపం వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆరేళ్లుగా నిధులను దుర్వినియోగం చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర ఖజానాను దివాళా తీసే పరిస్థితికి తీసుకువచ్చారని విమర్శించారు. బడ్జెట్ నిర్వహణలో అవకతవకలు, అవినీతి, వృధా ఖర్చులు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్పష్టం చేశారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, సొయం బాపురావు బుధవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు.

అన్నీ మోసపూరిత ఆరోపణలే..

కేంద్రం దాదాపు రూ.29 వేల కోట్లు ఇవ్వాల్సి ఉందన్న టీఆర్ఎస్​ ఎంపీల మాటలు మోసపూరితమని.. రాష్ట్రానికి కేంద్రం ఒక్క రూపాయి కూడా బకాయి లేదని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. నిర్ణీత షెడ్యూల్​ ప్రకారం రాష్ట్రానికి నిధుల బదిలీ జరుగుతోందన్నారు. ప్రాజెక్టులకు వేల కోట్లు ఇవ్వాలంటున్నారని, పరిపాలన గురించి తెలుసుకోవడానికి టీఆర్ఎస్​ ఎంపీలు తిరిగి స్కూలుకు వెళ్లాలని ఎగతాళి చేశారు. ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులపై నీతి ఆయోగ్  నిర్ణయం తీసుకోదని, ఆ సంస్థ ఇచ్చే అనధికార సిఫార్సులతో కేంద్ర బడ్జెట్ కేటాయింపులు జరగవని స్పష్టం చేశారు. ఇలాంటి అర్థ రహిత డిమాండ్లతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చుతున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్  సొంత ప్రయోజనాల కోసం అడ్డగోలు వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టులకు ఖర్చు చేసిన రూ. 2 లక్షల కోట్ల లెక్కలను కాగ్ కు అందజేయాలని డిమాండ్​ చేశారు. వేల కోట్ల కేంద్ర నిధులను అనుమతి లేకుండానే కేసీఆర్ తప్పుదారి పట్టించారని ఆరోపించారు.

శ్వేతపత్రం విడుదల చేయాలె..

గత ఆరేండ్లలో కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చిన నిధులు, చేసిన ఖర్చులపై కేసీఆర్ సర్కారు శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. తప్పేమీ లేకపోతే ప్రాజెక్టుల ఖర్చు లెక్కలను కాగ్​కు ఎందుకు సమర్పించడం లేదని నిలదీశారు. వచ్చే పదేండ్లలో తెలంగాణకు అప్పుల భారం సమస్యగా మారుతుందని, లక్షల కోట్ల రుణాలకు వడ్డీ కట్టడానికే ఆదాయం సరిపోని దుస్థితి వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు.

కేంద్రం నిధులిస్తేనే నడుస్తోంది!

నెలకు 4 వేల కోట్లు అప్పు చేస్తేగానీ రాష్ట్రం నడిచే పరిస్థితి లేదని బీజేపీ ఎంపీలు పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడం వల్ల వేల కోట్ల కేంద్ర నిధులు మురిగిపోతున్నాయి. చివరకు ఉద్యోగుల భవిష్య నిధి సొమ్ము కూడా వాడుకునే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారింది. కేంద్రం పంపే నిధులు పది రోజులు లేటుగా ఇస్తే రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు. అలాంటిది కేసీఆర్ కేంద్రం మీద నిందలు వేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. ప్రజలను మభ్యపెట్టడానికే కేంద్రంపై బురదజల్లుతున్నారు..” అని మండిపడ్డారు. ఈఏడాది రాష్ట్ర బడ్జెట్​ను రూ. 36 వేల కోట్లు కుదించారని, దేశ చరిత్రలో ఇలా చేసిన సీఎం ఒక్క కేసీఆర్​ మాత్రమేనని, అలాంటి వాళ్లు కేంద్రం మీద విమర్శలు చేయడమేంటని నిలదీశారు.

 

Latest Updates